2023లో 9 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటక అసెంబ్లీకి సైతం ఈ ఏడాదే ఎన్నికలు జరుగుతాయి. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం పార్టీ దిగ్గజం, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై గంపెడు ఆశలు పెట్టుకుంది. లింగాయత్ నేతగా ఆయన భాజపాను విజయతీరాలకు చేరుస్తారని పార్టీ ఆశిస్తోంది.
రాష్ట్రంలో లింగాయత్ వర్గానికి అధికార, విపక్షాలను నిర్ణయించే సత్తా ఉంది. రాష్ట్ర జనాభాలో 17 శాతం లింగాయత్‌లు ఉన్నారు. వీరిలో అధిక భాగం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఉన్నారు. సంప్రదాయం ప్రకారం వీరంతా భాజపాకు ఓటేస్తూ వస్తున్నారు. అందుకే, కాంగ్రెస్-జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక యడ్డీనే సీఎం కుర్చీ ఎక్కించింది కమలదళం. అనంతరం, కొన్ని కారణాల వల్ల ఆ పదవి నుంచి తొలగించినా.. ఆయన్ను పూర్తిగా విస్మరించలేదు. యడ్డీకి వారసుడిగా లింగాయత్ వర్గానికే చెందిన బసవరాజ్ బొమ్మైని ఎంపిక చేసి.. వారికి తమ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో చాటిచెప్పింది.
"లింగాయత్ ఓట్లు మా పార్టీకి చాలా కీలకం. అందులో ఎలాంటి అనుమానం లేదు. అత్యంత జనాధారణ పొందిన లింగాయత్ నేతల్లో యడియూరప్ప ఒకరు. రాష్ట్రంలో పార్టీ గెలవాలంటే లింగాయత్ వర్గం మాకు అండగా ఉండాలి. వారి ఓట్ల కోసం మేం యడియూరప్పపైనే ఆధారపడి ఉన్నాం."
-ఓ భాజపా నేత
2021 జులై 28 వరకు కర్ణాటక సీఎంగా కొనసాగారు యడియూరప్ప. అనంతరం ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మై బాధ్యతలు చేపట్టారు. అయితే, 2022 ఆగస్టులో భాజపా సంస్థాగత మార్పులు చేపట్టింది. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న పార్లమెంటరీ బోర్డులో యడ్డీకి చోటు కల్పించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసమే యడ్డీకి భాజపా కీలక పదవి కట్టబెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు పార్టీ.. ఆయనపైనే ఆధారపడుతోందని అంటున్నారు.
"ముఖ్యమంత్రి పదవి వదులు కోవాలని యడియూరప్పను అడిగినప్పుడు ఆయన పార్టీని ఇబ్బంది పెట్టకుండా తప్పుకున్నారు. తనపై నమ్మకంతో పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణం అదే. ఆయన రాజకీయ చతురత పార్టీకి దక్షిణ భారతదేశంలో ఉపయోగపడుతుంది. అందువల్ల పార్లమెంటరీ బోర్డులో ఆయనకు స్థానం ఇవ్వడం అర్థం చేసుకోవచ్చు."
-కర్ణాటక భాజపా ఎంపీ