లాక్‌డౌన్ నేపథ్యంలో సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు పనులు కల్పించడం, ఆకలి అగచాట్లు లేకుండా చూడటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నాలుగు దశాబ్దాలుగా భారత్‌లో పేదరికం, ఆకలి, ప్రజాపంపిణీ వ్యవస్థపై విస్తృతంగా అధ్యయనం చేసిన జాన్ డ్రీజ్ అభిప్రాయపడ్డారు. నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌తో కలిసి పలు గ్రంథాలు రాసిన డ్రీజ్ దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గౌరవ ఆచార్యులుగా, రాంచీ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వద్ద భారీగా ఉన్న ఆహార ధాన్యాల నిల్వలను పేదలకు పంపిణీ చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఉపాధి హామీ పనులను పెద్దయెత్తున చేపట్టడం, ఎక్కువ మందిని ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) పరిధిలోకి తేవడం వంటి చర్యలు తీసుకోవాలని డ్రీజ్ సూచించారు. దేశంలో వలస కార్మికులు, ఆకలి సమస్యలపై 'ఈనాడు' ప్రత్యేక ప్రతినిధి ఎం.ఎల్.నరసింహారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన తరవాత ఏర్పడిన ఆహార సంక్షోభం ఏ స్థాయిలో ఉంది?
ఒకపూట భోజనం లేకపోవడాన్నో లేక ఖాళీ కడుపుతో ఉండటాన్నో ఆకలి (హంగర్)గా భావిస్తే- ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థ ఉంది. మూడు నెలల పాటు రేషన్‌ను రెండింతలు చేయాలని నిర్ణయించడం మంచి పరిణామం. అయితే 50 కోట్ల మంది ప్రజాపంపిణీ వ్యవస్థ వెలుపలే ఉన్నారు. ఇందులో అందరూ పేదలు కాకున్నా, చాలామంది పేదలే. వచ్చే కొన్ని నెలల్లో చాలామంది దారిద్య్ర రేఖకు దిగువకు జారే అవకాశమూ ఉంది. ఝార్ఖండ్‌నే పరిశీలిస్తే, ప్రతి గ్రామంలో రేషన్ కార్డు లేని పేదలున్నారు. ఆకలి సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది లెక్కకట్టడం కష్టం, కానీ చాలా తీవ్రమైన సంక్షోభం దిశగా వెళ్తున్నాం. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చాలా కుటుంబాలను ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంది. దేశంలో భారీగా మిగులు ధాన్యాలున్నాయి, వాటిని వినియోగించుకోవచ్చు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పునరావాస కార్యక్రమాలు సరిపోతాయా? ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి?
రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పునరావాస కార్యక్రమాలకు కేంద్రం అండగా నిలబడుతూ చాలా చేయాల్సి ఉంది. పెద్దయెత్తున ఆహార ధాన్యాలు సమకూర్చాలి. రేషన్ కార్డులు లేని వారికీ ఆహార ధాన్యాలివ్వాలి. రాష్ట్రాల ఆదాయాలు తగ్గినందువల్ల వాటికి ఆర్థిక సాయం పెంచాలి. జాతీయ ఉపాధి హమీ చట్టం కింద పెద్దయెత్తున పనులు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి. కేంద్రం చేసిన ప్రకటనలు కార్యరూపం దాల్చాల్సి ఉంది. రానున్న కొన్ని నెలలపాటు చాలామందికి ఇదే రక్షణ కానుంది. పీడీఎస్, ఉపాధిహామీ, సామాజిక భద్రత పింఛన్లను విస్తరించడం ద్వారా ప్రస్తుత సంక్షోభంలో పేదలను ఆదుకొన్నట్లవుతుంది. సామూహిక వంటశాలలు, నగదు బదిలీ లాంటివీ ఉపయోగపడతాయి. ఇప్పటికే ఉన్న పథకాలు సమర్థంగా, పటిష్ఠంగా, ఎక్కువ మందికి ఉపయోగపడేలా అమలు జరగాలి.
ఆధునిక భారత చరిత్రలో ఇంతటి తీవ్ర పరిస్థితి ఎప్పుడైనా ఉందా?
భారత స్వాతంత్య్రానికి ముందు బెంగాల్ దుర్భిక్షం ప్రస్తుత పరిస్థితికన్నా తీవ్రమైంది. బెంగాల్ దుర్భిక్షం తరవాత అప్పుడప్పుడు ఆహార సంక్షోభం, కరవులు నెలకొన్నాయి. 1966-67లో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి బిహార్‌లో తీవ్ర కరవు ఏర్పడింది. దేశమంతా ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆహార సంక్షోభం స్వాతంత్య్రం వచ్చాక ఇదే.