తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కశ్మీర్​ రంగస్థలంలో సరికొత్త 'రాజకీయం'! - Girish Chandra Murmu

గిరీశ్ చంద్ర ముర్ము.. కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్​ ఏర్పడిన తర్వాత తొలి లెఫ్టినెంట్​ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. అయితే అత్యున్నత స్థాయి పదవి చేపట్టి సరిగ్గా ఏడాదికే రాజీనామా చేశారు. పదోన్నతి పేరిట 'కాగ్'​గా బాధ్యతలు తీసుకున్నా.. అనూహ్యంగా పదవి మారడం వెనుక ఉన్న కీలక అంశాలను విశ్లేషించారు ఈటీవీ భారత్​ న్యూస్​ ఎడిటర్​ బిలాల్​ భట్.

JK theatrics: Exit the bureaucrat, enter the politician
జమ్ముకశ్మీర్​ రంగస్థలంలో సరికొత్త రాజకీయం

By

Published : Aug 9, 2020, 1:45 PM IST

జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లు గతేడాది ఆగస్టు 5న పార్లమెంట్​ ఆమోదం పొందిన తర్వాత.. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. అప్పటివరకు ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా రద్దయింది. ఆర్టికల్​-370 రద్దు తర్వాత వచ్చిన పలు చట్టపరమైన సంక్లిష్టతలను పరిష్కరించడానికి ప్రభుత్వ ఉన్నతాధికారి అవసరమయ్యారు. అలాంటి సమయంలోనే తెరపైకి వచ్చింది... గిరీశ్ చంద్ర ముర్ము పేరు.

మోదీకి నమ్మకస్తుడు

గుజరాత్​ కేడర్​కు చెందిన ఐఏఎస్​ అధికారి అయిన ముర్ము.. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇష్రత్​ జహాన్​ ఎన్​కౌంటర్​ కేసునూ బాగా డీల్​ చేసి మోదీ మెప్పుపొందారు. చాలా సందర్భాల్లో తన విధేయత చూపించుకున్న ముర్మును సరైన వ్యక్తిగా కేంద్రం భావించింది. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత చట్టపరమైన, న్యాయపరమైన అంశాలను చక్కదిద్దేందుకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు అప్పగించింది.

చాకచక్యంగా అమలు..

జమ్ముకశ్మీర్​ శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్​ను​ సాధారణ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రభుత్వం వర్గీకరించింది. ఫలితంగా జమ్ముకశ్మీర్​లో శాసనసభ, రాజ్​భవన్​ సహా రెండు రాజధానులు ఉంటాయి. వాటన్నింటితో చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఉగ్రవాద సమస్యను పరిష్కరించడం, సాయుధ దళాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం, ప్రభుత్వ వ్యతిరేక స్వరాలు బలహీనపడేలా చూసుకోవడం, వేర్పాటువాద ఉద్యమాన్ని నిశితంగా గమనించడం వంటి పనులు చాకచక్యంగా చేశారు ముర్ము. నూతన పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా అర్హత ఉన్న అభ్యర్థులకు నివాస ధృవీకరణ పత్రాల జారీ విషయంలోనూ చాలా నిశబ్దంగా పని పూర్తిచేశారు.

ప్రభుత్వ అజెండా పక్కాగా..

జమ్ముకశ్మీర్​లో అమలు చేసే చట్టాలు ప్రభుత్వ అజెండాను పూర్తి చేసే విధంగా రూపొందించాల్సి ఉంటుంది. ముర్ము కూడా చాలా నమ్మకంగా అనుకున్నట్లుగానే ఆ పని చేశారు. అసమ్మతి స్వరాలను షట్​డౌన్​ మోడ్‌లో ఉంచారు. స్వతంత్ర ఒప్పందాలు, బలవంతపు దౌత్యం ద్వారా ప్రధాన రాజకీయ శ్రేణుల్లోని చాలా మందిని జైలులో పెట్టారు. ఇంకా మాట వినని వాళ్లను గృహ నిర్బంధంలో ఉంచారు.

ముర్ము పనితీరును తెలిపేలా... నెలల నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత పీడీపీ రాజకీయ నాయకుడు పలు విషయాలు వెల్లడించారు. ప్రభుత్వం చెప్పినదానికి కట్టుబడి ఉంటామని పత్రంలో సంతకం చేయించుకున్న తర్వాతే విడుదల చేసినట్లు తెలిపారు. చట్టబద్దమైన మార్గాల ద్వారా ఈ బలవంతపు దౌత్యం నెరపడం బ్యూరోక్రసీ భాషను అర్థం చేసుకున్న ముర్ము వంటి వ్యక్తికి మాత్రమే సాధ్యమైంది. అందుకే ఏడాది కాలంగా కశ్మీర్ రాజకీయంగా నిద్రావస్థలో ఉంది. ప్రభుత్వాధికారుల కార్యకలాపాలే కొనసాగాయి.

ఇప్పుడు రూటు మారుతోందా?

ఏడాది తర్వాత ప్రస్తుతం జమ్ముకశ్మీర్​లో రాజకీయం తిరిగి పుంజుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో లెఫ్టినెంట్​ గవర్నర్​గా కొనసాగేందుకు తాను తగిన వ్యక్తి కాదని అనుకున్నారు. అదే సమయంలో ఎన్నికలు, అంతర్జాలంపై ఆంక్షలు, పునర్విభజన వంటి అంశాల్లో ముర్ముకు, కేంద్రానికి మధ్య విభేదాలు వచ్చాయి. ఇక ఎల్​జీ స్థానంలో మరో వ్యక్తిని నియమించడమే మేలని భావించిన ప్రభుత్వం... ముర్ము నిజాయితీ, సామర్థ్యానికి తగినట్లుగా భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​(కాగ్) బాధ్యతలు అప్పచెప్పింది.

ముర్ము స్థానంలో మనోజ్​ సిన్హాను ఎంపిక చేశారు. అనుకున్న పనిని నిశబ్దంగా పూర్తిచేయగల, ప్రజలతో మమేకం కాగల సత్తా సిన్హాకు ఉందన్నది భాజపాలోని అనేక మంది నేతల విశ్వాసం.

ఎల్​జీగా సిన్హా నియామకంతో జమ్ముకశ్మీర్ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరం.

(రచయిత- బిలాల్​ భట్, ఈటీవీ భారత్​ న్యూస్​ ఎడిటర్)

ABOUT THE AUTHOR

...view details