దేశంలో పెచ్చరిల్లుతున్న నేర సంఘటనలతో నేరస్తుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు, విచారణ ఖైదీలకు సరైన సమయంలో బెయిలు మంజూరు కాకపోవడం వల్ల నెలల తరబడి జైళ్లల్లోనే మగ్గుతున్నారు. ఫలితంగా కారాగారాలు కిక్కిరిసిపోతున్నాయి. దీనివల్ల పాలనపరంగానూ అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కారాగారాలను శిక్షా కేంద్రాలుగానే కాకుండా నేరస్తుల సంస్కరణ నిలయాలుగా పరిగణించాలి. ఇందుకు ఖైదీల ప్రాథమిక హక్కులను గుర్తించి అమలు చేయడం ముఖ్యం. ఒక ఖైదీని ప్రాథమిక హక్కులతోపాటు మానవ సానుభూతికి అర్హమైన మనిషిగా పరిగణించాల్సిన అవసరం ఉందని భారత సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టంచేసింది. కానీ ఖైదీల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ- వారికి సరిపడా జైళ్లను కూడా అందుబాటులోకి తీసుకురాలేక పోతున్నాయి ప్రభుత్వ యంత్రాంగాలు. ఖైదీల హక్కులను గుర్తించి తదనుగుణంగా పరిస్థితులను మెరుగుదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది.
సౌకర్యాల కొరత
దేశంలోని ప్రముఖ జైళ్లలో కొంతమేర మెరుగైన సౌకర్యాలున్నా- చాలావాటిలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేక ఖైదీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సరైన ఆరోగ్య సౌకర్యాలు లేక అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ అధికారిక నివేదిక ప్రకారం అత్యధికంగా కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గత ఏడాది కాలంలో పలువురు ఖైదీలు ఆస్పత్రుల పాలు కావడం అక్కడి దుర్భర పరిస్థితులను ఎత్తిచూపుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఖైదీలకు సరైన సమయంలో చికిత్స అందించక పోవడంతో అకాల మరణం చెందుతున్నారనేది నిష్ఠుర సత్యం.
గడిచిన మూడేళ్ళ కాలంలో ఏకంగా సుమారు 5 వేలకుపైగా ఖైదీలు పలు కారణాలతో మృత్యువాత పడటం అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. ఖైదీల సంక్షేమం కోసం 2014-19 మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన బడ్జెట్‌లో ఖర్చు చేసిన నిధులు పదిశాతం లోపే. ఖైదీల సంక్షేమంపై అధికారుల చిత్తశుద్ధి అంతంత మాత్రమేనని దీనిద్వారా స్పష్టమవుతోంది.
అందుబాటులో ఉన్న నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకొని ఖైదీల సంక్షేమానికి పాటు పడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదే. గతంలో బెంగళూరు కేంద్ర కారాగారంలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఇద్దరు సీనియర్ అధికారులు బదిలీ కావడంతో దేశంలోని జైళ్ల పరిస్థితిపై చర్చ జరిగింది. ఆ సంఘటన జైళ్ల శాఖలో పేరుకుపోయిన అవినీతికి నిదర్శనంగా నిలిచింది.
మహిళా ఖైదీలకు రక్షణ..
ప్రస్తుతం దేశంలో మహిళా ఖైదీలకు సరిపడా ప్రత్యేక జైళ్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. మహిళా ఖైదీలు ఉండే ప్రదేశాల్లో పురుష సిబ్బంది విధులు నిర్వహించకూడదనే నిబంధనలు ఉన్నా పట్టించుకునేవారే కరవయ్యారు. ఇది మహిళా ఖైదీల హక్కులను కాలరాయడమే. మహిళా ఖైదీల కోసం మహిళా సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది.