ఏ భాషకైనా వ్యవహారం, సాహిత్యం వంటి రెండు స్వరూపాలు ఉంటాయి. ఇందులో మొదటి దానికి నిత్య వ్యవహారంలో విస్తృతి ఎక్కువ. రెండోదానికి తక్కువ. కానీ ఇదే- భాషకు జీవాన్నివ్వడంలోను, స్థిరీకరించడంలోను, భావితరాలకు అందించడంలోను కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని బట్టి భాష, సాహిత్యాలు రెండూ ప్రధానమైనవే. ఒక భాష స్థితిగతుల్ని, ఉత్థాన పతనాల్ని అంచనా వేయడానికి ఈ రెండింటినీ పరిశీలించాల్సి ఉంటుంది. భాషను పరిరక్షించి, ముందుతరాలకు అందించడం అందరి బాధ్యత. అది వారసత్వంలో ఒక భాగం. ప్రజల ద్వారా సంక్రమించే భాష ఐచ్ఛికం. అందుకే భాష ఇలా ఉంటుందని సాహిత్యం ప్రయోగించి చూపుతుంది. వీటి ఆధారంగా వ్యాకరణాలు భాషను తీర్చిదిద్దుతాయి. వీటన్నింటినీ ఒక సంపదలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. ఈ క్రమంలోనే భాషా సాహిత్యాల అభివృద్ధికి అకాడమీల స్థాపన జరుగుతుంది. భారత్‌లోనూ అలాగే జరిగింది. అంతకు పూర్వం కొన్ని సంస్థానాలే అనధికార అకాడమీలుగా వ్యవహరించేవి. తెలుగు భాష విషయానికి వస్తే తెలుగు అకాడమీ, సాహిత్య అకాడమీ పూర్వం నుంచి ఉండేవి. అవి ఇప్పుడు స్వరూపరీత్యా అలాగే ఉన్నా, స్వభావరీత్యా తమ పంథా మార్చుకున్నాయి. ఈ రెండు అకాడమీలూ తెలుగు భాషకు రెండు కళ్ల వంటివి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన ఈ రెండూ భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశాయి. పరిస్థితులు, అవసరాలు, పాలకుల ఆలోచనతీరు తదితర కారణాలతో ఒడుదొడుకులనూ ఎదుర్కొన్నాయి.
అపారమైన విజ్ఞానం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో తెలుగు అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. విధివిధానాలూ రూపొందించింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో మాతృభాష మాధ్యమం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే తీరుతామంటోంది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితిలో తెలుగు అకాడమీ స్థాపన తెరమీదికి రావడం- అసంతృప్తితో ఉన్నవారికి కొంత ఊరటను కలిగించేదే. అయితే, అకాడమీలను స్థాపించినప్పుడుగానీ, పునరుద్ధరించినప్పుడు కానీ, పునర్ వ్యవస్థీకరించుకోవాల్సి వచ్చినప్పుడుగానీ చాలా జాగ్రత్తగా, దార్శనికతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆధునిక అవసరాలను గుర్తించి, అన్ని వర్గాలకు, భాషా సాహిత్యాల విషయంలో అన్ని అంశాలకు మేలు కలిగేలా రూపకల్పన జరగాలి.
తెలుగు సాహిత్యానికి ఘనమైన చరిత్ర ఉంది. కానీ, కవిత్రయం కావ్యాలకే పూర్తిగా వ్యాఖ్యానాలు లేవు. చాలా కావ్యాలకు ఉన్న వ్యాఖ్యానాలు ఇప్పటివారు చదవాలంటే మళ్ళీ దానికి వ్యాఖ్యానం ఉండాలి. వ్యాకరణాల జోలికి ఎవరూ వెళ్ళరు. శాస్త్ర గ్రంథాలను పట్టించుకోరు. ప్రాచీన సాహిత్యం రూపంలో అపారమైన సంపద ఉంది. ప్రపంచంలో ఏ భాషకూ లేనంత వర్ణన... 'రత్నాకరము, ప్రబంధ పారిజాతము' వంటి సంకలన గ్రంథాలు ఉన్నాయి. వాటి గురించే చాలామందికి తెలియదు. తెలుగులో అపారమైన విజ్ఞానం ఉంది. అది ఉందన్న విషయం తెలియని అజ్ఞానం మనల్ని కప్పివేసింది.