కొవిడ్ మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రపంచమంతా స్తంభించిన స్థితికి చేరింది. ఫలితంగా, అన్ని వ్యవస్థలూ ఎక్కడిక్కడే ఆగిపోయాయి. ఇందులో న్యాయవ్యవస్థ సైతం ఉంది. మిగతా అన్ని వ్యవస్థల్లాగే న్యాయస్థానాలకూ అవాంతరాలు తప్పడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్నే దన్నుగా మార్చుకుని ముందడుగు వేసేందుకు అన్ని వ్యవస్థలు కృషి చేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ కూడా ఆ దిశగా అడుగులు వేయడానికి ఇదే సరైన సందర్భమని చెప్పవచ్చు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను ఉపయోగించుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మలచుకొని నవ్య సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
దృశ్య మాధ్యమం ద్వారా..
ఈ క్రమంలో కక్షిదారుగానీ, న్యాయవాదిగానీ కోర్టు మెట్లు ఎక్కకుండానే చరవాణి ద్వారా కేసులను నడిపించే అవకాశం ఉంది. దానికి కావాల్సిన యంత్రాంగాన్ని, వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి కోర్టులో, అనుమతి పొందిన న్యాయవాది ఇంట్లో దృశ్యమాధ్యమ సమావేశం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించాలి. సాక్షులను దృశ్యమాధ్యమ సమావేశం ద్వారానే ప్రశ్నించే అవకాశాలను పరిశీలించాలి. ఇది సాధ్యంకాని పక్షంలో, సాక్షులతో అవసరం లేకుండా జరిగే కోర్టు కార్యక్రమాలను దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా నిర్వహించవచ్చు. దీనివల్ల దూర ప్రాంతంలో ఉన్న కక్షిదారులు లాక్‌డౌన్ సమయంలో కోర్టుకి ప్రత్యక్షంగా రావాల్సిన అవసరం లేకుండా కేసు విచారణ కొనసాగించవచ్చు. న్యాయవాది ఏదైనా పరిస్థితిలో కోర్టుకు రాలేకపోయినా దృశ్యమాధ్యమ సమావేశం ద్వారా విచారణలో పాల్గొనవచ్చు. సుప్రీంకోర్టులోని కొన్ని ధర్మాసనాలు, పలు హైకోర్టులు, కొన్ని జిల్లాల్లోని దిగువ కోర్టుల్లో బెయిల్ పిటిషన్లు వంటి అత్యవసర విచారణలు చాలా వరకు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే జరుగుతున్నాయి.
డిజిటల్ వ్యవస్థ వైపుగా..
వీడియో కాన్పరెన్స్, భౌతిక దూరం పాటించడం వంటి వాటిద్వారా ఇప్పటికే పరిమిత స్థాయిలో సాంకేతికపరంగా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణంగా న్యాయస్థాన సముదాయాల్లో జనం గుంపులుగా చేరడం పరిపాటి. ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు పత్రాలను ఈ-ఫైలింగ్ ద్వారా సమర్పించడం, కోర్టు రూముల కార్యక్రమావళిని వెబ్‌క్యాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం, సాధారణ కేసుల్లో సాక్ష్యాలను ఆన్‌లైన్‌లో రికార్డు చేయడం వంటి చర్యల ద్వారా సమస్యలను కొంతమేర అధిగమించవచ్చు. ఇదే క్రమంలో పూర్తిస్థాయిలో డిజిటల్ వ్యవస్థ వైపు నడిచే దిశగా పలు చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. అందులో పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కోర్టు సిబ్బందికి సాంకేతిక శిక్షణ, ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, పోలీసులు, పిటిషన్‌దారులందరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేలా చేయడం వంటివన్నీ పెద్ద సవాలే.