తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చైనాను నిలువరిస్తే.. ఐటీ అంకురాలకు మహర్దశ - IT startup companies

చైనా వైఖరిని చూసి.. ఆ దేశానికి చెందిన పలు యాప్​లపై ఇటీవల నిషేధం విధించింది కేంద్రం. అంతకముందే టిక్​టాక్​ సహా మరికొన్నింటిపై వేటు వేసింది. మన దేశంలో అన్ని ప్రదేశాలకూ వ్యాపించి లాభాలను అర్జిస్తోన్న చైనా కంపెనీలకు కేంద్ర నిర్ణయం పెద్ద దెబ్బే. తమ దేశంలో ప్రజాభిప్రాయాన్ని తొక్కిపెట్టిన ఆ దేశం.. ఇతర దేశాలకు మాత్రం యాప్​లను ఎరగా వేస్తూ సమాచారాన్ని సులభంగా తస్కరిస్తోంది.

It is right time to begin IT Startups and easy to hold China
ఐటీ అంకురాలకు మహర్దశ

By

Published : Sep 26, 2020, 8:15 AM IST

'మా దేశంలో ఏం జరుగుతుందో మీకెందుకు.. మీ దేశానికి సంబంధించిన సమస్త సమాచారం ఎప్పటికప్పుడు మాకు తెలియాలి!' అన్నట్లుగా ఉంది చైనా వ్యవహారం. చైనాకు చెందిన 118 యాప్‌లను కేంద్రం ఇటీవల నిషేధించింది. అంతక్రితమే టిక్‌టాక్‌తో సహా మరి కొన్ని యాప్‌లపైనా వేటువేశారు. భారత్‌లో మూలమూలకూ విస్తరించి వ్యాపారం చేస్తూ లాభాలు దండుకుంటున్న చైనా కంపెనీలకు కేంద్ర నిర్ణయం అతిపెద్ద దెబ్బ. స్వదేశంలో ప్రజాభిప్రాయాన్ని క్రూరంగా తొక్కిపెట్టిన చరిత్రను సొంతం చేసుకొన్న బీజింగ్‌ నాయకత్వం- బయటి దేశాలకు మాత్రం యాప్‌ల ఎరలు వేస్తూ సమాచార తస్కరణ కార్యక్రమాలను నిర్మొహమాటంగా సాగిస్తోంది.

గ్రేట్​ ఫైట్​ వార్​

దేశంలో ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు తొడగడం చైనా నాయకత్వానికి అలవాటు. 1989లో తియానన్మెన్‌ స్క్వేర్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను యుద్ధట్యాంకులతో తొక్కించిన విషాదఘట్టాన్ని యావత్‌ ప్రపంచం వీక్షించింది. అడ్డొచ్చినవారిని తొలగించుకుంటూ ముందుకు సాగిన చైనా నాయకత్వం తొలినాళ్లలో అంతర్జాలాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, 1999లో ఫాలున్‌గాంగ్‌ సంస్థ 'ఆన్‌లైన్‌' ద్వారా మద్దతుదారులను సమీకరించి కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడంతో చైనా నాయకత్వం ఉలిక్కిపడింది. దాంతో అంతర్జాలం ప్రజాందోళనలకు వేదికగా మారకుండా చర్యలు తీసుకోవడంపై శ్రద్ధపెట్టింది. అందులో భాగంగానే 'గ్రేట్‌ ఫైర్‌ వాల్‌'ను ఏర్పాటు చేసుకొంది. అంటే దేశ ప్రజలు ఏ వెబ్‌సైట్లు వీక్షించాలో ఏ యాప్‌లు చూడాలో పూర్తిగా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్న మాట!

ఆ యాప్​లు ఎందుకు లేవంటే?

'గోల్డెన్‌ షీల్డ్‌ ప్రాజెక్టు'లో భాగంగా గ్రేట్‌ ఫైర్‌ వాల్‌ ఆఫ్‌ చైనా విధులు నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే వివిధ వెబ్‌సైట్లు తమ దేశంలో తెరవడానికి వీలు లేకుండా అనేక పద్ధతులు అనుసరిస్తోంది. అందుకే చైనాలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వికీపీడీయా వంటివి ఉండవు. వీటి స్థానంలో ప్రత్యామ్నాయంగా చైనాకు చెందిన వెబ్‌సైట్లు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వేదికలు ఉంటాయి. గూగుల్‌ సెర్చింజిన్‌కు బదులుగా బైడు; ఫేస్‌బుక్‌, ట్విటర్ల స్థానంలో వెయిబో తదితర వేదికలు ఉన్నాయి. విదేశాలకు చెందిన సామాజిక మాధ్యమాల ద్వారా దేశంలో ప్రజలు ఎలాంటి భావజాల ప్రభావాలకూ లోనుకాకుండా చైనా నాయకత్వం ఈ చర్యలు చేపట్టింది. ఆ దేశంలోని పలు సంస్థలు 2015 అనంతరం భారత్‌పై దృష్టిపెట్టాయి.

అందుకే అంత ప్రజాదారణ

భారత్‌లో అనేక భాషలు ఉండటంతో వాటి ద్వారా ఆదాయం గడించేందుకు వ్యాపార వ్యూహాలు పన్నాయి. అందులో భాగంగానే టిక్‌టాక్‌, హలో వంటి యాప్‌లు వచ్చాయి. పాశ్చాత్య దేశాలకు చెందిన కంపెనీలు భారత్‌లోని మెట్రో నగరాల నెటిజన్లను లక్ష్యంగా చేసుకొని తమ కార్యకలాపాలు విస్తరించాయి. చైనా కంపెనీలు అందుకు భిన్నంగా గ్రామీణ భారతంపై కన్నేశాయి. స్థానిక భాషల్లోనే చాలా సులభరీతిలో యాప్స్‌ను తయారు చేయడంతో టిక్‌టాక్‌లాంటివి కొద్ది రోజుల్లోనే ప్రజాదరణ పొందాయి. తమ దేశంలోకి ప్రజాస్వామ్య, స్వేచ్ఛా భావనలు ప్రవేశించకుండా ఐటీ కంపెనీలపై పలు నియంత్రణలు విధించిన 'డ్రాగన్‌'- మరోవంక తమ కంపెనీలకు మాత్రం ప్రపంచమంతటా వ్యాపారం చేసుకొనే అవకాశాలు ఇవ్వాలని పట్టుపట్టడమే విడ్డూరం!

కేంద్ర నిర్ణయం కీలకమైందే

సాఫ్ట్‌వేర్‌ రంగంలో భారత్‌కు అద్వితీయమైన చరిత్ర ఉంది. మూడు దశాబ్దాలకు పైగా ఈ రంగంలో మన దేశానికి చెందిన ఐటీ నిపుణులు కీలకపాత్ర పోషిస్తున్నారు. చైనాకు చెందిన పెద్ద ఐటీ కంపెనీలు భారత మార్కెట్‌ను కొల్లగొట్టి గణనీయంగా లాభాలు వెనకేసుకొంటున్నాయి. భారత్‌లోని అంతర్జాల వ్యవస్థలను చేజిక్కించుకునేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ 2017లో జాతీయ భద్రతా బిల్లు ఆమోదించింది. దాని ప్రకారం చైనాకు చెందిన కంపెనీలు ఏ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా అక్కడి సమాచారాన్ని అవి తమ మాతృదేశమైన చైనాకు ఇవ్వవలసి ఉంటుంది. భారత డిజిటల్‌ రంగంలో లోతుగా పాతుకుపోయిన చైనా కంపెనీల చేతిలోని సమాచారం బయటకు పొక్కే ప్రమాదాన్ని సూచిస్తున్న పరిణామమిది. భారతీయ వినియోగదారులకు చెందిన సమాచారమంతా చైనా అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో చైనాకు చెందిన పలు యాప్‌లను కేంద్రం నిషేధించడం కీలక నిర్ణయమే!

చైనా యాప్స్‌ను భారత్‌ నిషేధించడంతో వాటి మార్కెట్‌ విలువ ఒక్కపెట్టున కోసుకుపోయింది. టిక్‌టాక్‌ను చూస్తే ఈ ఏడాది మేలో నిషేధానికి ముందు దాని విలువ 100 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లుగా ఉంటే- ఆ తరవాత అది 50 బిలియన్లకు పడిపోయింది. ఆర్థికంగా చైనాకు ఇలాంటి పరిణామాలు శరాఘాతాలుగా మారుతున్నాయి. చైనా రూపంలో మన సమాచార భద్రతకు పొంచి ఉన్న ముప్పును చాలావరకు తగ్గించుకున్నట్లయింది. మరోవంక ప్రత్యామ్నాయంగా దేశీయ ఐటీ రంగంలో నూతన అంకురాలు మోసులెత్తి, శాఖోపశాఖలుగా విస్తరించేందుకు విస్తృత అవకాశం ఏర్పడింది. దీనివల్ల దేశానికి సమాచార భద్రత లభించడంతోపాటు అంకురాల విస్తరణ రూపేణా ఆర్థిక వ్యవస్థ సైతం కొత్తపుంతలు తొక్కనుంది.

- కొలకలూరి శ్రీధర్‌

ఇదీ చదవండి:జీఎస్​టీ చట్టం ఉల్లంఘించిన కేంద్రం: కాగ్

ABOUT THE AUTHOR

...view details