'కొవిడ్' ముమ్మరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పరిష్కారాలు అన్వేషిస్తున్నాయి. కరోనా నియంత్రణలో భౌతిక దూరాన్ని పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం. వీటితోపాటు ప్రజలకు సేవలందించడంలో సాంకేతిక అక్షరాస్యత, ఇ-గవర్నెన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015 మార్చి 25న ఇ-క్రాంతి ద్వారా ప్రారంభించిన ఈ భావనకు కొంతకాలంగా ప్రాధాన్యం పెరుగుతోంది. 'ఆన్‌లైన్' బోధనలను ప్రజలకు సమర్థంగా చేరవేయడాన్ని సాంకేతిక అక్షరాస్యతగా పేర్కొనవచ్చు. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ ప్రక్రియలో భాగంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పలు విభాగాలకు, ప్రజలకు సేవలు అందించే విధానాన్ని ఇ-గవర్నెన్స్‌గా పేర్కొంటారు.
సాంకేతికత వినియోగం అవసరం..
అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే భారత్‌లో వైద్యులు, పోలీసు సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అలాంటప్పుడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతికతను వినియోగించి ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని జాగృతం చేయడం అవసరం. దృశ్య, శ్రవణ మాధ్యమ సమావేశాల ద్వారా భారత ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడం, సూచనలు చేయడం, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమన్వయ సమావేశాలు నిర్వహించడం లాంటివి సాంకేతికత వినియోగ ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి.
తాజా సమాచారం కోసం..
వైద్య రంగానికి సవాలు విసురుతున్న కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు 'మైగావ్.ఇన్' అనే వెబ్‌సైట్‌కు అదనంగా 'ఆరోగ్యసేతు' యాప్‌ని పది దేశీయ బాషల్లో సమాచారాన్ని అందించడానికి, వైరస్ సోకిన వారిని గుర్తించడానికి ఉపయోగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 'టికొవిడ్-19' యాప్‌ని అందుబాటులోకి తెచ్చి పౌరులకు తాజా సమాచారాన్ని అందజేయడం వెనక సాంకేతికత పాత్ర కీలకం.
ఆన్‌లైన్ కోర్సులు..
అందరికీ నాణ్యమైన విద్యనందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ చొరవతో ప్రారంభమైన ‘స్వయం’ వేదిక ద్వారా ఎంతోమంది ఆన్‌లైన్ కోర్సులు చేస్తున్నారు. సంప్రదాయ విశ్వవిద్యాలయాలు ఈ సాంకేతికతను అందుకోవడంలో ఇంకా వెనకబడే ఉన్నాయి. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం సాంకేతిక బోధనలో ముందున్నాయి. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలు పాఠశాల విద్యాబోధనను టి-శాట్, ఇతర టీవీ ఛానళ్ల ద్వారా ప్రసారం చేయడం ఆహ్వానించదగ్గ విషయం. ప్రైవేటు విద్యాసంస్థలు ఇ-ప్రజ్ఞ వేదిక ద్వారా పాఠ్యాంశాలను విద్యార్థుల దరిజేరుస్తున్నాయి. న్యాయవ్యవస్థలో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదోపవాదాలు వినడం, తీర్పులివ్వడం సాంకేతికత ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. వ్యవసాయ రంగంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటున్నాయి.
ఇ-గవర్నెన్స్ ద్వారా..
భూరికార్డుల డిజిటలీకరణ, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా ఉత్పత్తి పెంచే మార్గాలు, తెగులు నివారణ సలహాలు, పర్యావరణ హిత సాంకేతిక పరిజ్ఞానం అందించడం రైతు సాధికారతకు దారితీస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షర అభియాన్’ ద్వారా కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికి సాంకేతిక అక్షరాస్యత అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆధార్ ప్రాతిపదికన చెల్లింపు విధానం (ఏఈపీఎస్), భీమ్-యూపీఐ, భారత్ క్యూ ఆర్ కోడ్, నేషనల్ ఎలెక్ట్రానిక్ టోల్ కలెక్షన్స్ వంటి వాటి ఆధారంగా అమలవుతున్న సేవలు ఇ-గవర్నెన్స్ దిశగా ప్రభుత్వాల చొరవకు దర్పణం పడుతున్నాయి. ఉమంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) ద్వారా దేశంలోని పదమూడు భాషల్లో సుమారు 490 కేంద్ర ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. డిజిటల్ ఇండియా నినాదం అయిన ‘అధికారం నుంచి సాధికారత’ సాకారం కావాలంటే ఇ-గవర్నన్స్ ద్వారా అందరికీ పౌర సేవలు అందుబాటులోకి రావాలి. అప్పుడే సుపరిపాలన దిశగా దేశం ముందడుగు వేస్తుంది.
(డాక్టర్ ఎం.బుచ్చయ్య, వాణిజ్య శాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యులు)
ఇదీ చదవండి:అంతర్జాతీయ స్థాయికి 'వైరస్ వార్'.. వ్యాప్తిపై దుమారం