మందులేని కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే లక్షణం ఉండటంతో ప్రజలూ భయోత్పాతానికి గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఆందోళన అంతా ఇంతా కాదు. దీని ప్రభావం విద్యారంగంపై ప్రసరించి, ఆన్‌లైన్ చదువుల విధానం ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చింది. ఇది కూడా అంతసాఫీగా జరగడం లేదు. సాధకబాధకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, చివరికి ఉపాధ్యాయులను కూడా విద్యాసంస్థలు మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఆన్‌లైన్ చదువులైనా అందరికీ అందుతున్నాయా అంటే గ్రామీణ, గిరిజన విద్యార్థులు వీటికి దూరంగా ఉన్నారు. ఇప్పటికే దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. సాంకేతిక అసమానత సమాజంలో కొత్తగా ప్రవేశించింది.
ఎదురుచూపులు
సాధారణంగా ఏటా జూన్ రెండోవారంలో విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. జులై చివరి వారం వచ్యినా ప్రత్నామాయ మార్గదర్శకాలూ ప్రభుత్వాలు విడుదల చేయలేదు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం తల్లిదండ్రుల ఉత్సుకతను ఆసరా చేసుకుని ఆన్‌లైన్ క్లాసులు అంటూ అధిక రుసుములు వసూలు చేస్తున్నారు. వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఎలాంటి తరగతులు లేక అయోమయంలో పడ్డారు. వారికి అకడమిక్ క్యాలెండర్ సైతం ఇంకా విడుదల చేయలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ పాఠశాలలు నడిపించే పరిస్థితి లేదు. సగం తరగతులను ఆన్‌లైన్‌లో బోధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు విద్యార్థులు, ఉపాధ్యాయుల సాంకేతిక సంసిద్ధత ప్రశ్నార్థకంగా ఉంది. ఆన్‌లైన్ బోధనకు వీలైన పాఠ్యాంశాలు, వ్యూహాలు, నైపుణ్యాలు ఉన్నాయా అన్నదీ సందేహమే. ఎల్‌కేజీ నుంచి అయిదో తరగతి వరకు పిల్లలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్‌ల ముందు కూర్చోవడానికి సంసిద్ధంగా లేరన్నది వాస్తవం. వీటివల్ల అంతగా ఉపయోగం లేకపోయినా పాఠశాలల ఒత్తిడి వల్ల తల్లిదండ్రులు ఆన్‌లైన్ పాఠాలకు అంగీకరిస్తున్నారు. పెద్ద తరగతులు, కళాశాల స్థాయి విద్యార్థులకు మాత్రం కొంతవరకు ఆన్‌లైన్ క్లాసుల వల్ల ఉపయోగాలు ఉంటాయి కాని, వీటివల్ల చిన్న పిల్లల కంటిచూపు దెబ్బతిని, బుద్ధిమాంద్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్న వైద్య నిపుణుల హెచ్చరికలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందువల్లే కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎల్‌కేజీ నుంచి ఏడో తరగతి వరకు ఆన్‌లైన్ పాఠాలను నిషేధించాయి. పాఠశాల స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు అందించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ ఇటీవల ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకంలో ప్రధాని ఈ-విద్య కార్యక్రమానికి నిధులు కేటాయించింది. ఒక్కో తరగతికి ఒక్కో టీవీ ఛానల్, యూట్యూబ్ తదితర ప్రసార సాధనాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినా అవేవీ నేటికీ అమలులోకి రానేలేదు. అదే విధంగా సీబీఎస్‌ఈ ‘ఒకే దేశం- ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాం- ఒకే తరగతి- ఒకే ఛానల్’ నినాదంతో ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రతి తరగతికి ఒక ఛానల్ చొప్పున ప్రవేశపెట్టాలని, దాని ద్వారా దేశంలోని 33 కోట్ల విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు అందిస్తామని వెల్లడించింది. ఆ ఛానల్స్ కూడా మొదలుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థులకు ఇంటర్నెట్ సహాయం లేకుండా టీవీ, కమ్యూనిటి రేడియో, ఎడ్యుశాట్, ఇతర శాటిలైట్స్, శిక్షావాణి, స్వయంప్రభ, కిశోర్‌మంచ్, డీడీ, దిశ టీవీ, జియో యాప్స్, వృత్తి విద్యార్థులకు బోధించే కోర్సులను ‘ముక్తి’ విద్యావాణి ద్వారా కార్యక్రమాలు అందించాలి.