రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ.200 కోట్లు పలికే ఒక ఆస్తిని కేవలం రూ.25 కోట్లకే తెగనమ్మడం వెనక మోసం ఉందంటూ, దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌధరిని బాధ్యుడిగా పేర్కొంటూ అరెస్టు చేయడం సంచలనం రేపింది. ప్రతీప్‌ను నవంబరు ఒకటి నుంచి 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, తొమ్మిదో తేదీన ఆయనకు జైసల్మేర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ప్రతీప్ అరెస్టు బ్యాంకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి రుణాలివ్వాలంటేనే జంకే పరిస్థితి కల్పిస్తోందని బ్యాంకర్లు, ఆర్థిక రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో సందేహాలు
జైసల్మేర్‌లో గొడావణ్ గ్రూపు చేపట్టిన గఢ్ రాజ్వాడా హోటల్ ప్రాజెక్టుకు ఎస్‌బీఐ 2008లో రూ.24 కోట్ల రుణం మంజూరు చేసింది. ఆ ప్రాజెక్టు అనుకున్న ప్రకారం పూర్తికాలేదు. యజమాని దిలీప్ సింగ్ రాఠోడ్ 2010లో మరణించాక బ్యాంకు రుణానికి గొడావణ్ గ్రూపు ఎగనామం పెట్టింది. ఎస్‌బీఐ ఆ రుణాన్ని 2013లో నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా ప్రకటించింది. రూ.24 కోట్ల రుణం 2014కల్లా వడ్డీతో కలుపుకొని రూ.40 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ ఛైర్మన్‌గా ప్రతీప్ 2013 సెప్టెంబరులో ఉద్యోగ విరమణ చేశారు. 2014 మార్చిలో గొడావణ్ ఆస్తిని ఎస్‌బీఐ రూ.25 కోట్లకు ఆల్కెమిస్ట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి విక్రయించింది. తద్వారా ఎస్‌బీఐ తన అసలును రాబట్టుకుని వడ్డీకి మాత్రం నీళ్లొదిలేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ఆల్కెమిస్ట్ డైరెక్టర్ల బోర్డులో ప్రతీప్ చేరారు. గొడావణ్ ఆస్తిని బ్యాంకు విక్రయించినప్పుడు ప్రతీప్ అటు ఎస్‌బీఐలో, ఇటు ఆల్కెమిస్ట్‌లో ఏ పదవిలోనూ లేరు. అయినా విక్రయంలో మోసం జరిగిందంటూ ఆయన్ను అరెస్టు చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గొడావణ్ గ్రూపు నిర్వాహకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ప్రతీప్‌ను చిక్కుల్లోకి నెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తమ హోటల్ ప్రాజెక్టు రూ.200 కోట్ల విలువ చేస్తుందంటున్న ప్రమోటర్లు అందులో సగం ధరకైనా హోటల్‌ను ఎందుకు అమ్ముకోలేకపోయారనేది కీలక ప్రశ్న. హోటల్ ప్రాజెక్టు వేలం గురించి ప్రసిద్ధ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా కొనడానికి ఇతర హోటళ్లు, పెట్టుబడిదారులు ఎందుకు ముందుకురాలేదన్న సందేహమూ వ్యక్తమవుతోంది. ఆస్తి విలువను తక్కువగా నిర్ణయించడంలో, దాన్ని ఎన్‌పీఏగా విక్రయించడంలో ఎక్కడా ప్రతీప్ పాత్ర లేదు. అయినా అదంతా పెద్ద కుట్ర అని ఆరోపిస్తూ గొడావణ్ గ్రూపు ప్రస్తుత ప్రమోటర్ హరేంద్ర రాఠోడ్ 2015లో కేసు పెట్టారు. అది సివిల్ వివాదం కాబట్టి తమకు ప్రమేయం లేదంటూ రాజస్థాన్ పోలీసులు కేసును మూసివేశారు. తరవాత ఆల్కెమిస్ట్ ఆ ఆస్తిని 2017లో ఓ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థకు విక్రయించింది. అది జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశాలకు అనుగుణంగా జరిగింది. అందులో మోసం, కుట్ర ఉన్నాయన్న హరేంద్ర ఆరోపణలను సుప్రీంకోర్టు సైతం తోసిపుచ్చింది. అంతకు ముందు రాజస్థాన్ పోలీసులు కేసును మూసివేయడాన్ని నిరసిస్తూ 2016లో హరేంద్ర స్థానిక కోర్టులో అర్జీ దాఖలు చేశారు. కోర్టు ఆదేశంపై గత నెల 31న పోలీసులు ప్రతీప్‌ను అరెస్టు చేశారు.
ప్రోత్సహించాల్సిన అవసరం