Israel Hamas War 2023 : మారణాయుధాలు మానవతా సంక్షోభాలను సృష్టిస్తాయే తప్ప సామరస్యాన్ని నెలకొల్పలేవు. అమాయకుల నెత్తుటితో నిత్యం తడిసిముద్దయ్యే నేలలో శాంతికి స్థానముండదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం- ప్రస్తుతం పశ్చిమాసియాను పట్టికుదిపేస్తున్న యుద్ధోన్మాదమే! హమాస్ సాయుధుల భీకర దాడికి బదులు తీర్చుకోవడంకోసం గాజాను ఇప్పుడు ఇజ్రాయెల్ నేలమట్టం చేస్తోంది. కేవలం 360 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 23 లక్షల మంది నివసిస్తున్న ఆ నగరంలో అది నెత్తుటేళ్లు పారిస్తోంది. 'గాజా ప్రజలపై మేము యుద్ధం చేయట్లేదు' అంటూనే చిన్నారులూ మహిళలతో పాటు ఎందరో అసహాయులను ఇజ్రాయెల్ దళాలు పొట్టన పెట్టుకుంటున్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే 24గంటల్లో ఉత్తర గాజాను ఖాళీచేయాలంటూ 11 లక్షల మంది మెడపై అవి కత్తి పెట్టాయి. సామాన్యులను దుర్భర అవస్థల పాల్జేశాయి.
కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్‌లో హమాస్ జరిపిన మారణహోమానికి, ఆపై దట్టంగా పరచుకొన్న యుద్ధమేఘాలకు ఆజ్యం పోసిందెవరు?
Hamas Israel Conflict :డిసెంబరు 2022లో మరోసారి ఇజ్రాయెల్ అధికార పీఠాన్ని బెంజమిన్ నెతన్యాహు అధిష్ఠించారు. ప్రధానమంత్రి పదవికోసం పరమ అతివాద పార్టీలతో జతకట్టిన ఆయన- స్వదేశ చరిత్రలోనే అత్యంత మతఛాందస ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. పాలస్తీనియన్ల పొడను చీదరించుకునే జాత్యహంకారులకు మంత్రి పదవులిచ్చారు. వారి అండదండలతో వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెమ్‌లలో ఇజ్రాయెలీ సెటిలర్లు అడ్డూఆపూ లేకుండా రెచ్చిపోయారు. మొన్న జూన్‌లోనే పాలస్తీనియన్లపై వాళ్లు 310 దాడులకు(ఇళ్లు తగలబెట్టడం వంటివి) తెగబడ్డారు. ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో వెస్ట్‌బ్యాంక్‌లోనే రెండొందల మంది పాలస్తీనియన్లను చంపేశారు.
Israel Attack On Gaza :యూదు జాతీయవాదంలోంచి బుసలుకొడుతున్న ప్రమాదకర ఉగ్రవాదంగా దీన్ని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్ సైతం ఛీత్కరించారు. నెతన్యాహు సర్కారు దన్నుతో పాలస్తీనియన్లపై విచ్చలవిడిగా సాగుతున్న అణచివేత తొందరలోనే తీవ్ర అనర్థానికి దారితీయవచ్చుననే హెచ్చరికలు కొన్నాళ్లుగా వినవస్తున్నాయి. చివరికి ఆ భయసందేహాలే నిజమయ్యాయి.. కదన రక్కసి కోరల్లో నేడు సామాన్యుల బతుకులు ఛిద్రమవుతున్నాయి!
ఇజ్రాయెల్‌లో నరమేధానికి పాల్పడి ఎంతోమందిని బందీలుగా పట్టుకెళ్లిన హమాస్‌కు అసలు ప్రాణం పోసిందెవరు?
Israel Attack On Palestine :అయిదున్నర దశాబ్దాల క్రితం వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెమ్, గాజా స్ట్రిప్‌లను ఇజ్రాయెల్ గుప్పిటపట్టింది. అందుకు ప్రతిగా యాసర్ అరాఫత్ నేతృత్వంలోని పాలస్తీనా విమోచన సంస్థ(పీఎల్‌ఓ) గెరిల్లా దాడులు ప్రారంభించింది. కానీ, దాని లౌకిక జాతీయవాదం పాలస్తీనాలోని ఛాందసులకు కంటగింపుగా మారింది. అరాఫత్‌కు వ్యతిరేకంగా అటువంటివారిని ఇజ్రాయెల్ చేరదీసింది. పాలస్తీనియన్లు వారిలోవారు కొట్టుకోవాలన్న ఆ దేశ వ్యూహంలోంచే హమాస్ పుట్టుకొచ్చింది. అరాఫత్ ఆయుధాలు వీడి పాలస్తీనా గొంతును ప్రపంచవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్న సమయంలో హమాస్ హింసోన్మాదాన్ని నమ్ముకొంది.