తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా కారుచీకట్లకు ఈ ఉద్దీపన సరిపోతుందా? - stimulus package news

ఆత్మ నిర్భర్​ భారత్​ అభియా​న్​ పేరిట ప్రకటించిన భారీ ప్యాకేజీ కొత్త ఆశలు మోసులెత్తించింది. ప్రస్తుత సంక్షోభాన్నే సావకాశంగా మలచుకొని స్వావలంబన సాధించడమే లక్ష్యంగా ఎకాయెకి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ రూపొందించినట్లు ఇటీవలే ప్రధాని మోదీ ప్రకటించారు. విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ ఐదు విడతలుగా వెలువరించిన ప్యాకేజీ- స్వావలంబన లక్ష్యాన్ని స్వప్నిస్తోందిగానీ, వర్తమాన సమస్యలకు దీటైన పరిష్కారాన్ని చూపలేకపోయింది. 130 కోట్ల జనావళి బతుకు, భవితలపై కరోనా కమ్మేసిన కారుచీకట్లను తాజా ఉద్దీపన ఏ విధంగా చెదరగొట్టగలదో చూడాలి!

AATM NIRBHAR BHARAT
ఈ ఉద్దీపన సరిపోతుందా?

By

Published : May 18, 2020, 6:47 AM IST

Updated : May 18, 2020, 6:54 AM IST

కొవిడ్‌ కాటుకు గురై దుర్భర క్లేశాల పాలైన దేశాన్ని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’గా తీర్చిదిద్దనున్నామన్న ప్రధాని మోదీ ప్రకటన కొత్త ఆశలు మోసులెత్తించింది. కరోనా కారణంగా సమస్త ఉపాధి, ఉత్పాదక వ్యవస్థలు సుప్తచేతనావస్థలోకి జారిపోయి, పెను మాంద్యంలోకి ప్రపంచం కూరుకుపోతున్న వేళ- ఆ మహా ఉత్పాతాన్ని అరికట్టి ఆర్థిక రంగ నవోత్తేజమే లక్ష్యంగా దేశదేశాలు అప్పటికే భారీ ఉద్దీపనలు ప్రకటించాయి. వర్తమాన సంక్షోభాన్ని ఒడుపుగా అధిగమించేలా భారత ప్రభుత్వం ప్రకటించే ప్యాకేజీ ఏ తీరుగా ఉండాలన్న దానిపై భిన్నవర్గాల ప్రముఖుల నుంచి విస్తృత సూచనలు వెలువడ్డాయి. ప్రస్తుత సంక్షోభాన్నే సావకాశంగా మలచుకొని స్వావలంబన సాధించడమే లక్ష్యంగా ఎకాయెకి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ రూపొందించినట్లు కొన్నాళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. సవిస్తృత ఆర్థిక, మౌలిక, వ్యవస్థాగత సంస్కరణలతోపాటు యువభారత్‌ శక్తి సామర్థ్యాల పెంపు, గిరాకీ- సరఫరా గొలుసును పటిష్ఠంగా తీర్చిదిద్దడమనే అయిదు స్తంభాలపై స్వావలంబన భారత్‌ నిర్మాణాన్ని ప్రస్తావించారు. అందుకనుగుణంగా విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ అయిదు విడతలుగా వెలువరించిన ప్యాకేజీ- స్వావలంబన లక్ష్యాన్ని స్వప్నిస్తోందిగానీ, వర్తమాన సమస్యలకు దీటైన పరిష్కారాన్ని చూపలేకపోయింది. స్థూల దేశీయోత్పత్తిలో పది శాతంగా- రూ.20 లక్షల 97 వేల కోట్ల ప్యాకేజీ చూపులకు ఏపుగా ఉన్నా దానిద్వారా కేంద్ర ఖజానాపై పడే వ్యయభారం కేవలం 1.1 శాతం; అంటే దాదాపు రెండు లక్షల 17 వేల కోట్లే! ఆర్థిక వ్యవస్థలోని పలు విభాగాలు పూర్తిగా తల వేలాడేసిన తరుణంలో ఎంఎస్‌ఎంఈలపై కొద్దిపాటి కరుణ చూపి పెద్ద పరిశ్రమలను పూర్తిగా విస్మరించడం దిగ్భ్రాంతపరచేదే. 130 కోట్ల జనావళి బతుకు, భవితలపై కరోనా కమ్మేసిన కారుచీకట్లను తాజా ఉద్దీపన ఏ విధంగా చెదరగొట్టగలదో చూడాలి!

ఎంఎస్​ఎంఈలపైనే దృష్టి..

ఎన్నో యుద్ధాల పెట్టుగా పెను విధ్వంసం సృష్టిస్తున్న కరోనా వల్ల ప్రపంచ జీడీపీలో పది శాతం దాకా కోసుకుపోనుందని, 24.2 కోట్ల ఉద్యోగాలకు ఎసరు రానుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు తాజాగా హెచ్చరించింది. కంటైన్‌మెంట్‌ కాలాన్ని కుదించి పటిష్ఠ విధానాలు అవలంబించిన పక్షంలో ఉత్పాదక నష్టాన్ని సగానికి తగ్గించగలమన్న అంచనాల నేపథ్యంలో- అసలే పరిమితుల చట్రంలో ఒదిగిన కేంద్రం ఆచితూచి స్పందించినట్లు తెలుస్తూనే ఉంది. విస్తృతంగా నగదు అందజేత(హెలికాప్టర్‌ మనీ), పరిమాణాత్మక ఆంక్షల సడలింపు(క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌) వంటి సూచనల్ని పట్టించుకోని కేంద్రం- సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణ వసతిని విస్తృతం చేయడం మీదే దృష్టిసారించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలే ఎంఎస్‌ఎంఈలకు అయిదు లక్షల కోట్ల రూపాయలకుపైగా బకాయి ఉన్నట్లు నితిన్‌ గడ్కరీ చెబుతున్నారు. ఆ మొత్తాలు సత్వరం అందేలా చూడాల్సింది పోయి, కొత్తగా మూడు లక్షల కోట్ల రూపాయల రుణ వసతికి కేంద్రం నూరుశాతం పూచీ పడింది. వడ్డీ రాయితీని విస్మరించి నాలుగేళ్ల కాలావధిలో ఆయా మొత్తాల్ని తీర్చాలంటున్న కేంద్రం- ప్రస్తుత దుస్థితిగతుల దృష్ట్యా గడువును పదేళ్లుగా నిర్ధారించాల్సింది!

ఏ మూలకు?

దేశవ్యాప్తంగా 11 కోట్ల 40 లక్షల మంది శ్రామికులకు గత నెలంతా పనే లేకపోయిందని, దానివల్ల వారు కోల్పోయింది రూ.90 వేల కోట్లని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ అధ్యయనం చాటింది. గత రెండు నెలలుగా కేంద్రం పేదల ఖాతాల్లోకి రూ.33,176 కోట్లు బదిలీ చేసిందంటున్నా- అది ఏ మూలకు? మద్యం దుకాణాలు తెరవడంతో ఆ సంక్షేమం కాస్తా చెల్లుకు చెల్లు! వలస కూలీలు స్వరాష్ట్రాలకు పోటెత్తడంతో ఉపాధి హామీ పనుల నిమిత్తం కేంద్రం అదనంగా రూ.40 వేల కోట్లు కేటాయించింది. రుణలభ్యత, ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించిన విత్తమంత్రి- సరఫరా గొలుసు, గిరాకీల పెంపును విస్మరించినట్లు స్థూల దృష్టికి గోచరిస్తోంది. దేశ స్వావలంబన లక్ష్యాలు సాధ్యపడాలంటే, విధాన రచన మరింత పటిష్ఠంగా బహుముఖంగా సాగాల్సింది!

Last Updated : May 18, 2020, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details