'కరోనావల్ల నెలకొన్న పరిస్థితులతో దేశంలోని లక్షలాది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సరైన సౌకర్యాలు, ఆశ్రయం, ప్రయాణం, ఆహారం అందించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లోపాలు ఉన్నాయి.' దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల చేసిన వ్యాఖ్యానమిది. ఉపాధి కోసం ఊరుగాని ఊరు వెళ్లి పడరాని పాట్లు పడిన కూలీల ఉదంతం దేశాన్ని కుదిపేసింది. హృదయమున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. వాస్తవానికి వలస కూలీలు అనేక ఏళ్లుగా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొంటున్నారు. వలస కార్మికుల అంశం ప్రాధాన్యం దృష్ట్యా చట్టపరమైన రక్షణకు పూనుకొన్నా అది వారిని ఆదుకోవడం లేదు. 1979లో రూపొందించిన అంతర్ రాష్ట్ర వలస కార్మికులు (ఉపాధి క్రమబద్ధీకరణ, సేవల స్థితిగతులు) చట్టం ఉన్నా... అది ఎందుకూ ఉపయోగపడటంలేదు.
దశాబ్దాలుగా వెతల బాటలో...
ఉన్న చోట జీవితం సరిగా లేక పొట్ట నింపుకోవడానికి మరో చోటుకి వెళ్లడం దశాబ్దాలుగా జరుగున్నదే. మన దేశంలో ఈ సమస్య తీవ్రస్థాయిలో ఉంది. భూములు ఉన్నా నీటి వసతి లేక కరవు కాటకాలు ఏర్పడడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, స్థిరమైన ఉపాధి లేకపోవడంవల్ల ఒక చోటు నుంచి మరో చోటుకు పని వెదుక్కుంటూ వెళ్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా వలసలు ఇంకా పెద్దయెత్తున కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తరలించే విధానం ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. వలస కూలీల వ్యవస్థ మొదలైన తరవాత ఒడిశా తదితర రాష్ట్రాల్లో వలస కూలీలు- ఏజెంట్లు, గుత్తేదారులు, యజమానుల చేతుల్లో దోపిడీకి గురైన ఉదంతాలు వెలుగు చూడటంతో దేశమంతటా దీనిపై చర్చ మొదలైంది. 1976 అక్టోబరు 21న జరిగిన రాష్ట్ర కార్మిక మంత్రుల సమావేశంలో దీన్ని ప్రధానాంశంగా చర్చించారు. వలస కార్మికుల కోసం ప్రత్యేక చట్టం రూపొందించాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సమావేశం తీర్మానించింది. దీనిపై స్పందించిన కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 'ఒప్పంద కార్మికులు, క్రమబద్ధీకరణ, తొలగింపు-1970' చట్టాన్ని అనుసరించి పలు సిఫార్సులు చేసింది. దీని ఆధారంగా 1979 జూన్‌లో అంతర్రాష్ట్ర వలస కార్మికులు (ఉపాధి క్రమబద్ధీకరణ, సేవల స్థితిగతులు) చట్టం చేసింది. పార్లమెంటు తీర్మానం అనంతరం భారత రాష్ట్రపతి ఆమోదముద్రతో 1979 జూన్ 11 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. చట్టంలో కార్మికులకు హక్కులను నిర్దేశించారు. గుత్తేదారులు, యాజమాన్యాలు, ప్రభుత్వాల బాధ్యతను చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికుల తాత్కాలిక కొరత ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి కార్మికుల సేవలను పొందడానికి ఇందులో వీలు కల్పించారు. స్థానిక కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల నుంచి వలసలను ప్రోత్సహించరాదని పేర్కొన్నారు. దీంతో పాటు కార్మికుల హక్కులను నిర్దేశించారు. సాధారణ కార్మికులందరికీ ఉద్దేశించిన చట్టాలు సైతం వీరికి వర్తిస్తాయి. 1948 కనీస వేతన చట్టం కింద స్థానిక కార్మికుల మాదిరే పనికి తగిన వేతనాలు చెల్లించాలి. స్వరాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలో పనిచేస్తున్నందుకు భత్యం చెల్లించాలి. ప్రయాణ సమయంలో వేతనాల చెల్లింపుతో సహా గృహ ప్రయాణ భత్యం ఉచితంగా తగిన నివాస వసతి, వైద్య సౌకర్యాలు తప్పనిసరి. కాంట్రాక్ట్ వ్యవధి, ఉపాధిని రద్దు చేయడంతో పాటు ఏదైనా సంఘటన, ప్రమాదం జరిగితే మూడు నెలల్లోపు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు అనుమతి ఇవ్వాలి. అంతర్రాష్ట్ర కూలీల పేర్లు, వివరాలు రిజిస్టర్లలో నమోదు ఏయాలి. అధికారుల పరిశీలనకు, తనిఖీలకు అవి అందుబాటులో ఉండాలి కాంట్రాక్టర్ వల్ల ప్రమాదానికి గురైతే రెండు రాష్ట్రాల నిర్దేశిత అధికారులకు, కూలీల బంధువులకు నివేదించాలి.ఈ చట్టం అమలును పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షణాధికారులను నియమించాలి. యజమానులు, గుత్తేదార్ల వివరాలను నమోదు చేయాలి. సంస్థల నమోదు, అనుమతుల మంజూరు, రద్దు అధికారం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. చట్టం ఉన్నా దానివల్ల కార్మికులకు ఎలాంటి రక్షణ కలగలేదు. కేవలం కాగితాలకే అది పరిమితమయింది. ప్రయోజనాలు దాదాపు శూన్యమే.
చట్టం ఉన్నా... తప్పని కష్టం