తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా మహమ్మారిపై ముప్పేట దాడి!

మందులేని మహమ్మారిగా మన ముందున్న కరోనాను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎడతెగని పరిశోధనలు కొనసాగుతున్నాయి. కొవిడ్‌ చికిత్సకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ని ఉపయోగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించినప్పటి నుంచీ దానిమీద మేధోమథనం ప్రారంభమైంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ని అజిత్రోమైసిన్‌ అనే యాంటీబయాటిక్‌తో కలిపి అందించగా అది వ్యాధి లక్షణాలను సమర్థంగా అడ్డుకొందని ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలూ గమనించారు.

Is the hydroxy chloroquine drug appropriate for coronary pandemic?
మహమ్మారిపై ముప్పేట దాడి!

By

Published : Apr 23, 2020, 12:43 PM IST

క్లోరోక్విన్‌ లేదా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అనేది క్వినైన్‌ అనే రసాయనం ఆధారంగా రూపొందించిన కృత్రిమ ఔషధం. క్వినైన్‌ను సింకోనా చెట్టు బెరడు నుంచి సంగ్రహిస్తారు. మానవ శరీరంపై క్వినైన్‌ రసాయనం చూపే ప్రభావాల ఆధారంగానే హోమియోపతి వైద్య విధానాన్ని హానిమన్‌ రూపొందించారు. క్వినైన్‌ని కొన్ని దశాబ్దాలుగా మలేరియా వ్యాధి చికిత్సకోసం వాడుతున్నారు. మలేరియా అనేది ప్రోటోజోవా విభాగానికి సంబంధించిన పరాన్నజీవి వల్ల సంభవించే వ్యాధి. మలేరియా పరాన్నజీవి శరీరంలోనికి ప్రవేశించాక అది ఎర్ర రక్తకణాల్లోని హీమోగ్లోబిన్‌ మీద ఆధారపడి ఎదుగుతూ ఉంటుంది. ఎర్ర రక్తకణాల్లో చేరిన ప్రోటోజోవా పరాన్నజీవిపై హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ తన ప్రభావం చూపించి దాని విస్తృతిని అడ్డుకుంటుంది. కరోనా అన్నది శ్వాస వ్యవస్థపై దాడి చేసే వైరస్‌. ఎర్ర రక్త కణాల్లో చేరిన పరాన్నజీవిని దెబ్బకొట్టే ఔషధం శ్వాస వ్యవస్థకు సోకే అంటువ్యాధిని ఎలా నియంత్రించగలదన్నదే ఇక్కడ ప్రశ్న!

ఆశలు రేకెత్తిస్తున్న ప్లాస్మా చికిత్స

సాధారణంగా వైరస్‌లు శరీరకణాల్లో ప్రవేశించిన తరవాత అవి మనిషి దేహంలోని కొన్ని రకాల కణాంగాల్లో ఉన్న ఆమ్లత్వాన్ని ఆసరాగా చేసుకొని తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. క్లోరోక్విన్‌ మందు శరీరకణాల్లోకి ప్రవేశించినప్పుడు అది కణాంగాల్లోని ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారత్వాన్ని పెంచుతుంది. తద్వారా వైరస్‌ రేణువుల తయారీ మందగించడమో లేదా ఆగిపోవడమో జరుగుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్‌ తీవ్రత తగ్గి వ్యాధి నయమయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా ఈ ఔషధం కణాంతర్గతంగా రోగనిరోధక శక్తిని నియంత్రించే కొన్ని రకాల టీఎల్‌ఆర్‌ గ్రాహకాలు వైరస్‌ ఉనికిని గుర్తించి అతిగా ప్రతిస్పందించకుండా నిరోధిస్తుంది. నిజానికి వైరస్‌ సంక్రమణను సైతం క్లోరోక్విన్‌ అడ్డుకోగలదని 1986లోనే హెపటైటిస్‌ వ్యాధిగ్రస్తులపై చేసిన ప్రయోగంలో వెల్లడైంది.

ప్రకృతి సహజంగా

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ప్రకృతి సహజంగా సంగ్రహితమైన ఔషధరూపం. కాబట్టి, దీని ఫలితాలు మనుషుల శరీర ధర్మాలను బట్టి, జీవన విధానాలనుబట్టి మారుతూ ఉంటాయి. కిందటినెల అమెరికా, యూకే, ఫ్రాన్స్‌లలోని దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో కరోనా వైరస్‌ దాదాపు 332 రకాల మానవ ప్రోటీన్‌ అణువులతో సంయోగం చెందుతోందని వెల్లడైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కరోనా వైరస్‌, సిగ్మా-1 అనే మానవ ప్రోటీన్‌ అణువును తనకు అనుకూలంగా మార్చుకొని వృద్ధి చెందే అవకాశం ఉందని, సిగ్మా-1, కరోనా వైరస్‌ల మధ్య సంయోగ క్రియను క్లోరోక్విన్‌ అడ్డుకొంటోందని సైతం ఆ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఇప్పటికే క్లోరోక్విన్‌తో సహా మొత్తం మీద 90 రకాల ఔషధాలు, విటమిన్లు, ఖనిజ లవణాల సామర్థ్యంపై వివిధ దేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ (ఔషధ పరీక్షలు) నిర్వహిస్తున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వినియోగంపై భారతసైతం క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలుపెడుతోంది. ఇది శుభ పరిణామం.

శాస్త్రీయ మార్గాలు అన్వేషించాలి

కరోనా వైరస్‌ మహమ్మారి స్థాయికి చేరుకొని ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ దశలో దీని నిరోధానికిగల శాస్త్రీయ మార్గాలన్నింటినీ అన్వేషించాలి. ఆయా మార్గాల ఆచరణాత్మకతనూ నిశితంగా పరీక్షించాలి. 2018లో యేల్‌ విశ్వవిద్యాలయానికి స్మిత అనే పరిశోధకురాలు అమైనోగ్లైకోసైడ్‌ తరగతికి చెందిన బ్యాక్టీరియల్‌ యాంటీబయాటిక్స్‌ వివిధ రకాల వైరస్‌ ఇన్ఫెక్షన్లను సమర్థంగా నిరోధిస్తున్నాయని గమనించారు. మరీ ముఖ్యంగా ఎలుకలపై నిర్వహించిన ప్రయోగంలో, నియోమైసిన్‌ ద్రావణాన్ని నాసికా రంధ్రాల్లో ఇవ్వగా ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ వ్యాప్తిని అది సమర్థంగా నిరోధించింది. దీనికి కారణం నియోమైసిన్‌ యాంటీబయాటిక్‌ ఊపిరితిత్తుల్లో రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేయడమేనని స్మితతోపాటు ఆమె సహచర పరిశోధకులు కనుగొన్నారు. ఆ పరిశోధన విఖ్యాత జర్నల్‌ ‘నేచర్‌’లో ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌పై చేస్తున్న యుద్ధంలో- అజిత్రోమైసిన్‌ ఫలితాలను ప్రేరణగా తీసుకొని, నియోమైసిన్‌ సామర్థ్యాన్ని సైతం పరీక్షించేలా ప్రభుత్వం ముందుకు రావాలి.

దాతల నుంచి..

ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు ముందుకు వస్తున్న మరో చికిత్సా విధానం కన్వాలిసెంట్‌ ప్లాస్మా థెరపీ. ఇందులో రోగనిరోధక శక్తి సంతరించుకున్న దాతల నుంచి కరోనా వైరస్‌ని బంధించే ప్రతిరోధక (యాంటీబాడీస్‌) సహిత ప్లాస్మాను సేకరించి రోగి శరీరంలోనికి ప్రవేశపెడతారు. ఈ విధానాన్ని కొవిడ్‌ బాధితుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించగా కేవలం ఏడు రోజుల్లోనే కరోనా వైరస్‌ సమూల నిర్మూలన జరిగినట్లు చైనా శాస్త్రవేత్తలతోపాటు మరికొన్ని దేశాల పరిశోధనల్లోనూ వెల్లడైంది. దీనిపై భారత్‌ ఇప్పటికే ‘క్లినికల్‌ ట్రయల్స్‌’ ప్రారంభించింది. వీటితోపాటు క్షయ వ్యాధి నివారణకు ఉపయోగించే బీసీజీ టీకా కరోనాకు సైతం అడ్డుకట్ట వేయగలదన్న వార్త ఇటీవల జీవ వైద్య రంగంలో ఆసక్తి రేకెత్తించింది. ఈ టీకా వినియోగాన్ని కచ్చితంగా అమలు చేస్తున్న దేశాల్లో కొవిడ్‌ మరణాల రేటు తక్కువగా ఉండటాన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది ఇమ్యునాలజీ నిపుణులు దీని పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ ఈ విషయంలో స్పెయిన్‌ అనుభవాలు అంత ప్రోత్సాహకరంగా లేవు.

దేశీయ పరిష్కారాల అన్వేషణ

నిపుణులు పరిశీలిస్తున్న మరో ప్రత్యామ్నాయ మార్గం స్వీయ భక్షణను (ఆటోఫజీ) ప్రేరేపించే ఉపవాస పద్ధతి. శరీర కణాల్లో స్వీయభక్షణను (ఆటోఫజీ) ‘ఎమ్‌టోర్‌’ అనే ప్రోటీన్‌ నియంత్రిస్తుంటుంది. ఈ ప్రోటీన్‌ను కరోనా వైరస్‌ తనకు అనుకూలంగా మలచుకొంటుంది. తద్వారా కణాలు స్వీయభక్షణను మొదలుపెట్టకుండా చేస్తోంది. అయితే ‘ఎమ్‌టోర్‌’ ప్రోటీన్‌ను నిరుత్తేజితం చేసినప్పుడు కరోనా వైరస్‌ వృద్ధి నిలిచిపోతోందని పరిశోధనలో వెల్లడైంది. ఆసక్తికరమైన అంశమేమిటంటే- ఉపవాసం ఉన్నప్పుడు సైతం ‘ఎమ్‌టోర్‌’ ప్రోటీన్‌ నిరుత్తేజితమవుతోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివల్ల కణాలు స్వీయభక్షణ వ్యవస్థలను ఉత్తేజితం చేస్తాయి. ఫలితంగా కొత్త వైరస్‌ కణాలకు కావలసిన ముడిసరకు సైతం భక్షణకు గురవుతోంది. స్వీయభక్షణ, ఉపవాసం, ప్రయోజనాలపై జరిగిన పరిశోధనలకే 2016లో నోబెల్‌ బహుమతి లభించిన విషయం గమనార్హం. కాబట్టి ప్రోటీన్‌ అధికంగా ఉన్న ఆహారం శరీరంలోని స్వీయభక్షణ యంత్రాంగాన్ని నిరోధిస్తుంది. అందువల్ల ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. కొవిడ్‌పై పోరాటంలో కొంతకాలంపాటు గరిష్ఠ ప్రోటీన్‌ ఉన్న ఆహారపదార్థాలకు దూరంగా ఉండటమే మంచిదన్నది కొందరు పరిశోధకుల అభిప్రాయం.

వైద్య విధానానికే పునాది

హోమియోపతి వైద్య విధానానికి పునాది వేసిన క్వినైన్‌లోని కరోనా వైరస్‌ని నిరోధించే సామర్థ్యంపై మరింత పరిశోధన అవసరం. భారతీయ ఆయుష్‌’ విభాగం ఈ మందును హోమియో వైద్య సూత్రాల ప్రకారం ఉపయోగించే అవకాశాలను వెలికితీయాలి. ఇది ఎంతమేరకు పని చేస్తుందో ఇదమిత్థంగా తేల్చే పరీక్షలకూ చొరవ చూపాలి. కొవిడ్‌ వల్ల ఇప్పటిదాకా సంభవించిన మరణాలు- ఊపిరితిత్తుల్లో కఫం లేదా శ్లేష్మం అధికంకావడం వల్లే! కాబట్టి, ఆయుర్వేద విజ్ఞానం ప్రకారం కఫం లేదా శ్లేష్మాలను పెంచే ఆహారపదార్థాలపై ప్రజల్లో అవగాహన కలిగించే బాధ్యతను ఆయుష్‌ విభాగం తీసుకోవాలి. అలాగే ఆయా ఆహార పదార్థాలను వదులుకొంటే కోల్పోయే పోషణను భర్తీ చేసేందుకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఆహారాలపైనా స్పష్టతను ఇవ్వాలి.

ఉప్పునీటిని ఉపయోగించి చేసే జలనేతి, వెచ్చగా ఉన్న ఉప్పు నీటిని అంగిట పట్టడం (గార్గిలింగ్‌) మొదలైన ఆయుర్వేద విధానాలవల్ల శ్వాస వ్యవస్థలోని ఉపరితల కణాలు(ఎపిథీలియల్‌) యాంటీ-వైరల్‌ గుణాలు సంతరించుకొని- వైరస్‌ దాడిని సమర్థంగా ఎదుర్కోవడాన్ని 2019లో ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే నిర్దిష్ట ఔషధం ఇంకా తయారు కానందువల్ల- ఆ మహమ్మారిపై ముప్పేట దాడి చేయక తప్పదు!

(డాక్టర్ అమరేంద్ర వర్మ, వ్యాధి నిరోధక శాస్త్ర పరిశోధకులు-జర్మనీ)

ఇదీ చదవండి:ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా మృతదేహాలు

ABOUT THE AUTHOR

...view details