అత్యున్నత శాసన నిర్మాణ వేదిక మౌలిక లక్ష్యమేమిటో పూర్తిగా విస్మరించి పంతాలూ పట్టింపులకే ప్రాధాన్యమిచ్చిన పాలక, ప్రతిపక్షాల నిష్పూచీ ధోరణి- వర్షాకాల సమావేశాల్లో అపార కాలదహనాన్ని కళ్లకు కట్టింది. ఒకేఒక్క బిల్లుకు సంబంధించి ఎనలేని సంఘీభావ ప్రదర్శనలో పార్టీలన్నీ పోటీపడ్డాయి. వాటి సంఘటిత తోడ్పాటుతో 127వ రాజ్యాంగ సవరణ బిల్లు స్వల్ప వ్యవధిలోనే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందగలిగింది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక రిజర్వేషన్లను సర్వోన్నత న్యాయస్థానం మూడు నెలలక్రితం కొట్టేయడం తెలిసిందే. మరాఠాలు సామాజికంగా విద్యాపరంగా వెనకబడినట్లు గుర్తించే అధికారం రాష్ట్రసర్కారుకు లేదన్న వాదనను అప్పట్లో సుప్రీంకోర్టు సమర్థించింది. అది నూటరెండో రాజ్యాంగ సవరణ సందర్భంగా చోటుచేసుకున్న తప్పిదమని గ్రహించిన కేంద్రం దిద్దుబాటు చర్యగా చేపట్టిందే 127వ సవరణ బిల్లు. తద్వారా సొంతంగా ఓబీసీ(ఇతర వెనకబడిన వర్గా)ల జాబితాలను రూపొందించే అధికారం రాష్ట్రాలకు తిరిగి దఖలు పడుతుంది.
ఈ క్రతువును చురుగ్గా చక్కబెట్టడంలో పార్టీలు పోటాపోటీగా తమవంతు సహకారం అందించినప్పటికీ- బీసీ సంఘాలు భిన్నగళంతో స్పందిస్తున్నాయి. స్థానిక ఒత్తిళ్లకు రాష్ట్రప్రభుత్వాలు తలొగ్గి మరెన్నో కులాలు కోటా పరిధిలో చేరితే- మంది ఎక్కువై మజ్జిగ పలచనైన సామెత చందం కాదా అన్నది వాటి ప్రధాన అభ్యంతరం. ఎటూ ఓబీసీ జాబితాల సవరణాధికారం రాష్ట్రాలకు మళ్ళీ సంక్రమిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న డిమాండ్లకు కొత్త ఊపు వచ్చినట్లయింది. 2011 జనగణన సందర్భంగా సమీకరించిన కులాలవారీ సంఖ్యా వివరాలు ఇప్పటికీ బహిర్గతం కాలేదు. ఆనాటి సామాజికార్థిక కులగణన అనుసారం ఓబీసీల ఉపవర్గీకరణ కోసం 2017 అక్టోబరులో ఏర్పాటైన జస్టిస్ జి.రోహిణి కమిషన్‌ను ఇంతవరకు 11సార్లు పొడిగించారు. కేంద్రం ఇప్పుడు దేశంలో కుల గణన నిర్వహించేది లేదంటోంది. శాసనసభకు ఎన్నికలు జరగనున్న యూపీలో అగ్రవర్ణాల సెంటిమెంటు దెబ్బతినే ఏ పనీ తలపెట్టరాదన్న జాగ్రత్తే అందులో ప్రస్ఫుటమవుతోంది!