ప్రైవేటీకరణ దిశగా భారతీయ రైల్వే జులై 1న కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 109 జతల మార్గాల్లో 151 ప్యాసెంజర్ రైళ్లు నడిపేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఫలితంగా రూ. 30 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు రైల్వేలోకి రానున్నాయి.
"ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రవాణా సమయాన్ని తగ్గించడం, ఉద్యోగ కల్పనను పెంచడం, మెరుగైన భద్రత, ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించడం, రవాణా రంగంలో డిమాండ్ సరఫరా లోటును తగ్గించడం సహా నిర్వహణ భారాన్ని తగ్గించుకోవడమే దీని(ప్రైవేటీకరణ) ప్రధాన లక్ష్యం."
-రైల్వే శాఖ
సవాళ్లతో ముడిపడి..
కానీ రైల్వే ప్రైవేటీకరణ సంక్లిష్టమైన ప్రక్రియ అని బ్రిటన్ సహా ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలోని అన్ని రైల్వేలను తన అధీనంలో ఉంచుకున్న బ్రిటీష్ రైల్వే.. 1993లో పూర్తిగా ప్రైవేటీకరణ బాటపట్టింది. రైల్వే లైన్లలో సర్వీసులను నడిపేందుకు ప్రైవేటు కంపెనీలకు అనుమతిచ్చింది. కానీ రైల్వే మౌలిక సదుపాయాలు, కార్యకలాపాల విభజన విషయంలో దారుణంగా విఫలమైంది. అనంతరం మౌలిక సదుపాయాలు కల్పించే రైల్‌ట్రాక్ సంస్థను జాతీయం చేసింది. అయితే ఇప్పటికీ చాలావరకు లైన్లలో ప్రైవేటు సంస్థలు తమ రైలు సర్వీసులను నడుపుతున్నాయి.
పోలికలు వేరైనా
బ్రిటన్‌తో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు పూర్తిగా భిన్నమనే వాదన ఉంది. బ్రిటన్ తరహాలో పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. 'ప్యాసెంజర్ రైళ్లలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం... మొత్తం రైల్వే కార్యకలాపాల్లో కేవలం 5 శాతమే' అని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
అయినా సమస్యలే..!
అయినప్పటీకీ అంతర్లీనంగా కొన్ని ఆందోళనలు మెదులుతూనే ఉన్నాయి. ప్రైవేటు రైళ్లు అనుమతిస్తే.. ఈ సంస్థలు భారతీయ రైల్వేతో పాటు ఒకే మౌలిక సదుపాయాల(ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థల)ను ఉపయోగించుకుంటాయి.
తీవ్రమైన పని భారంతో ప్రస్తుతమున్న రైల్వే నెట్వర్క్ ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు 12 క్లస్టర్లలో 2023 నుంచి ప్రైవేటు రైళ్లు ప్రారంభమవుతాయి. బెంగళూరు, ఛండీగఢ్, జైపుర్, దిల్లీ, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, సికింద్రాబాద్, హావ్‌డా, చెన్నై నగరాల్లో వీటిని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.