నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి రాకముందే ఎన్నో భయాలు, అనుమానాలు పట్టిపీడిస్తాయి. 5జీ (5G in India) విషయంలోనూ ఇదే జరిగింది. అనుమానాల కారణంగా దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను అడ్డుకోవాలని కొంతమంది ఇప్పటికే కోర్టును సైతం ఆశ్రయించారు. వాస్తవానికి 5జీ సాంకేతికతను (5G Technology) అందిపుచ్చుకోవడంలో దేశం వెనకబడింది. 3జీ స్పెక్ట్రమ్ కోసం ఉన్నదంతా గుమ్మరించడంతో టెలికాం సంస్థలపై అప్పుల భారం పడింది. వాటిని భరించలేక ఇప్పటికే అనేక టెలికాం సంస్థలు చేతులెత్తేశాయి. దేశంలో దశాబ్దం ముందు 11 టెలికాం సంస్థలు ఉండగా, ఇప్పుడా సంఖ్య నాలుగుకు పడిపోయింది. అటు ప్రపంచవ్యాప్తంగా 5జీ ప్రక్రియ నెమ్మదించింది. ప్రస్తుతం 100 దేశాల్లోనే 5జీ అందుబాటులో ఉంది. అందులోనూ కొన్ని ప్రాంతాలకే 5జీ సేవలు పరిమితమయ్యాయి. 5జీని ఎంత త్వరగా అమలులోకి తీసుకొస్తే, అంత ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయనడంలో సందేహం లేదు.
'అంతర్జాలం'తో అద్భుతాలు..
ఇంటర్నెట్ 1994లో పుట్టుకొచ్చింది. ఇప్పుడు మనిషి జీవితాన్ని శాసిస్తోంది. జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. అంతర్జాలం ప్రభావం ముఖ్యంగా నగరాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కొవిడ్ పుణ్యమా అని ఇంటర్నెట్‌ను ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు. కొవిడ్ తొలిదశ(2020 జూన్)లో 42శాతం అమెరికా ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసినట్లు అంచనా. అంతర్జాలంవల్లే ఇది సాధ్యమయింది. భారత్‌లోనూ ‘ఇంటి నుంచే పని’ సంస్కృతి ఊపందుకుంది. సమీప భవిష్యత్తులో ఇదే ఒరవడి కొనసాగే అవకాశం ఉంది. దేశంలో 2012లో మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2.3కోట్లు. ప్రస్తుతం అది 82.53కోట్లకు చేరింది. వీరిలో 79.9కోట్ల మంది సెల్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద 40శాతం ఇంటర్నెట్ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. సగటు డేటా వినియోగమూ వృద్ధిచెంది, 2015 మార్చిలో 100ఎంబీ నుంచి 2021 మార్చి నాటికి 12.33 జీబీకి హెచ్చింది. అందరికీ సులభంగా అందుబాటులో ఉండటంతో ఇంటర్నెట్ వినియోగం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో డేటా వినియోగం పెరుగుతున్న కొద్దీ.. వేగం తగ్గకుండా ఉండేందుకు బ్యాండ్‌విడ్త్‌ను పెంచడం టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల బాధ్యత. ఇక్కడే భారత్ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. దేశంలో ఇంటర్నెట్ వేగం ఇంకా 2జీ-4జీ మధ్యలోనే ఉండిపోయింది. పరికరాల సంఖ్య పెరిగితే ఇప్పుడున్న నెట్‌వర్క్‌ల వేగం తగ్గిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకే ప్రపంచ దేశాల్లోని టెలికాం కంపెనీలు 5జీ వైపు అడుగులు వేస్తున్నాయి. 5జీతో ఇంటర్నెట్ వేగం పెరుగుతుందనే ఆశాభావంతో ఉన్నారు.
సమాచారాన్ని రూపాంతరీకరించడంలో వేగమే అంతర్జాలంతో ఒనగూడే అతిపెద్ద లాభం. సమాచారం ఎక్కడుంటే అక్కడ వినియోగదారులుంటారు. కస్టమర్లు ఎక్కడుంటే అక్కడ ప్రకటనలు ఉంటాయి. వాటి ద్వారా సంపాదన పెరుగుతుంది. వీక్షణలతో ఏ విధంగా డబ్బు ఆర్జించవచ్చనేది గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు ఇప్పటికే నిరూపించాయి. వీటన్నింటికీ మూలం ఇంటర్నెట్ అనడం నిస్సందేహం. ఫోన్ పే లావాదేవీలు ఎక్కువ శాతం ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి నగరాలు, పట్టణాల నుంచే జరుగుతున్నట్లు సంస్థ వెల్లడించింది. వ్యాపారాలు, గృహాల్లో సులభంగా ఉపయోగించే స్థాయికి అంతర్జాలం చేరడంతోనే ఇది సాధ్యపడింది. సాంకేతికతను ఉపయోగించుకుంటే లావాదేవీలు, ఖర్చులు ఆదా అవుతాయి. ఖర్చులు తగ్గితే ఎంఎస్‌ఎమ్‌ఈలు బలపడతాయి. కొవిడ్ అనంతర పరిణామాలతో సేవా రంగంలో ఇంటర్నెట్ రాజ్యమేలుతోంది. ఒకరకంగా ఎంఎస్‌ఎమ్‌ఈల మనుగడ అంతర్జాలంపైనే ఆధారపడే స్థాయికి చేరింది. ప్రజల పనితీరును ఇంటర్నెట్ పూర్తిగా మార్చేసింది. ఏడాదిగా కార్పొరేట్ సంస్థల బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తే అంతర్జాలం వినియోగంతో అవి ఎంత లబ్ధి పొందాయనేదీ అర్థమవుతుంది. దేశంలో 5జీ రాకతో పరిస్థితులు ఇంకా మెరుగుపడతాయి.
గణనీయమైన మార్పులు..