'భారత్- చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు దేశంలో శాంతికి, స్థిరత్వానికి భంగం కలిగించడమే కాకుండా- అభివృద్ధి, ఆధునికీకరణ లక్ష్యాలనూ దెబ్బతీస్తాయి. అధిక సామర్థ్యం, వనరులు కలిగిన ఈ రెండు దేశాలూ ఇప్పటివరకు కలిసి పనిచేయడమే కాదు... సరిహద్దుల్లో సహకారమూ అందించుకున్నాయి. భారత-చైనా భాగస్వామ్యం వల్ల ఈ శతాబ్దం ఆసియాదే... అన్న వాదానికి ప్రస్తుత పరిస్థితి అవరోధంగా మారుతోంది' అని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యావిభాగంలో చైనా స్టడీస్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అల్కా ఆచార్య అభిప్రాయపడ్డారు. 70 ఏళ్ల భారత్-చైనా సంబంధాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన ఆమె 'చైనా రిపోర్టు' మేగజైన్‌కు ఎడిటర్‌గా, ఇండియా-చైనా ఎమినెంట్ పర్సన్స్ గ్రూప్, నేషనల్ సెక్యూరిటీ డ్వయిజరీ గ్రూప్‌లలో సభ్యురాలిగా పని చేశారు. ప్రస్తుతం చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి ఎం.ఎల్.నరసింహారెడ్డికి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
ప్రశ్న: ఇటీవల గల్వాన్ వ్యాలీలో సంభవించిన ఉదంతం తీవ్రతను ఎలా అంచనా వేస్తున్నారు?
జవాబు: గత 45 సంవత్సరాల్లో జరిగిన అతి తీవ్రమైన సంఘటన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సైనికులు పరస్పరం తలపడటం వల్ల రెండువైపులా అధిక సంఖ్యలో మరణాలు సంభవించడం ఇది మొదటి సారి. సరిహద్దులకు సంబంధించి గత మూడు దశాబ్దాలుగా భారత్, చైనాలు అనేక ఒప్పందాలు కుదుర్చుకుని, ప్రొటోకాల్స్ ఏర్పాటు చేసుకున్నాయి. వాస్తవానికి ఇది ప్రపంచంలోనే సుధీర్ఘ, శాంతియుతమైన సరిహద్దు వివాదం. గత మూడు దశాబ్దాల్లో ఒక్కసారి కూడా ఈ సరిహద్దుల్లో కాల్పులు జరగలేదు. మే ఆరంభం నుంచి తూర్పు లద్దాఖ్‌లోని పలు ప్రాంతాల్లో రెండు దేశాల సైనికుల మధ్య తోపులాటలు, స్వల్ప ఘర్షణలు పెరుగుతున్నా అధికారికంగా ఒక్క ప్రకటనా విడుదల కాలేదు. శాటిలైట్ చిత్రాలు కమర్షియల్ ఆపరేటర్లకు, విదేశీ నిఘావర్గాలకు అందుబాటులో ఉన్నాయి. ఇది మరింత గందరగోళానికి దారి తీసింది. వాస్తవాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయం కలగడానికి కారణమైంది. ఈ కారణంగానే ప్రభుత్వం నుంచి కొందరు వివరణ కోరే పరిస్థితి వచ్చింది.
చైనా వస్తువులను బహిష్కరించాలని అనేక మంది పిలుపిస్తున్నారు. ఇది ఆచరణ సాధ్యమేనా? దీన్ని అవకాశంగా తీసుకొని భారత్ ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి వీలుంటుందా?
సరిహద్దు వివాదం పెరిగినప్పుడల్లా ఈ నినాదం ముందుకొస్తుంది. డోక్లాంలో 72 రోజుల ప్రతిష్ఠంభన సమయంలోనూ వచ్చింది. వినియోగం, కొనుగోలుపై దీని ప్రభావం చాలా తక్కువ కాలమే ఉంటుంది. గల్వాన్ సంఘటన ఆవేశాన్ని మరింత పెంచింది. సాధారణ ప్రజల్లోనే కాదు, కొన్ని వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీలు సైతం వాణిజ్యాన్ని నిలిపివేయాలన్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చైనా సంస్థలు చేస్తున్న ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టాయి. 5జి నెట్‌వర్క్‌కు హువావై బిడ్‌ను నిలిపివేయాలనీ డిమాండ్‌లు వచ్చాయి. ఇవన్నీ చైనా దిగుమతులపై అంత ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు బలంగా పెనవేసుకుపోయాయి భారతదేశానికి వస్తున్న విదేశీపెట్టుబడు(ఎఫ్‌డిఐ)లలో చైనా నుంచి ఎక్కువ భాగం ఉన్నాయి. దీన్ని కాదనుకుంటే... ఓ అంచనా ప్రకారం భారత వృద్ధిరేటు అర దశాబ్దం వెనక్కుపోతుంది. మరోవైపు ఆసియాలో అతి పెద్ద మార్కెట్ భారత్. దీన్ని కోల్పోతే చైనాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. భారతదేశం తన జాతీయవాదాన్ని వదులుకోకూడదు. అదే సమయంలో గుడ్డిగా చైనాకు వ్యతిరేకంగా వెళ్లకూడదు. సంప్రదింపులతో పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. గల్వాన్ ఘర్షణ చైనా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశాలు తక్కువే. స్వల్ప లేదా మద్యస్థ కాలం భారత్-చైనా ఆర్థిక కార్యకలాపాలపైన ప్రభావం చూపొచ్చు.
అనేక అభివృద్ధి కార్యక్రమాలను(బెల్ట్‌తో సహా) పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్‌లలో చేపట్టడం వెనక చైనా ఎత్తుగడ ఏమిటి? సరిహద్దు దేశాలతో భారత్ వైఖరి ఎలా ఉంది?