తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'అతివ'ను వీడని అసమానతలు.. అన్నింటా అంతంత మాత్రమే! - ఉమెన్స్ డే

Women's Day: మహిళ సమానత్వమే లక్ష్యంగా ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే లింగ సమానత్వంలో భారత్​ సహా పలు దేశాలు ఇంకా వెనకబడే ఉన్నాయని విశ్లేషకులు వెల్లడించారు. గతేడాది అంతర్జాతీయ లింగ సమానత్వ సూచీలే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.

womens day
ఉమెన్స్​డే

By

Published : Mar 8, 2022, 9:20 AM IST

Updated : Mar 8, 2022, 9:36 AM IST

Women's Day: వేగంగా మహిళా సమానత్వం సాధించే లక్ష్యంతో ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది మహిళా దినోత్సవాన రూపొందించిన 'పక్షపాతాన్ని ఛేదించండి' అనే నినాదం- సమాజంలో, విద్యాలయాల్లో, పని స్థలాల్లో మహిళల పట్ల దుర్విచక్షణను రూపుమాపి, సమానత్వం సాధించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. 'ఈనాటి లింగ సమానత్వం సుస్థిర భవిష్యత్తుకు సోపానం' అనేది ఐక్యరాజ్యసమితి నినాదం. ప్రపంచమంతటా వాతావరణ మార్పుల నిరోధానికి కృషి చేస్తూ మానవాళి భవితను సుస్థిరం చేయడానికి ఉద్యమించిన మహిళలు, యువతులు, బాలికల కృషిని సమితి ఈ విధంగా గౌరవిస్తోంది. ఈ సందర్భంలో మహిళా సమానత్వానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాల పురోగతిని ఒకసారి సమీక్షించుకోవడం సముచితంగా ఉంటుంది.

అన్నింటా ప్రాతినిధ్యం అంతంతే...

నిరుడు ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన 2021 అంతర్జాతీయ లింగ సమానత్వ సూచీలో 156 దేశాలున్నాయి. అందులో భారత్‌ స్థానం 140. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సూచీలో భారత్‌ 28 మెట్లు దిగజారింది. 2021 సూచీ ప్రకారం లింగ సమానత్వంలో 10 అగ్రగామి దేశాలు- ఐస్‌లాండ్‌, ఫిన్లాండ్‌, నార్వే, న్యూజిలాండ్‌, స్వీడన్‌, నమీబియా, రువాండా, లిథువేనియా, ఐర్లాండ్‌, స్విట్జర్లాండ్‌. కొవిడ్‌వల్ల ప్రపంచమంతటా లింగ సమానత్వ సాధనకు తీవ్ర విఘాతం కలిగింది. తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సైతం మహిళా హక్కులను హరిస్తోంది. కొవిడ్‌ తెచ్చిపెట్టిన లాక్‌డౌన్‌లు, డిజిటలీకరణల వల్ల మహిళా సిబ్బంది ఎక్కువగా కలిగిన రంగాలు దెబ్బతిని, వారి ఉద్యోగాలకు ఎసరు వచ్చింది. మహిళా సమానత్వ సాధనకు కొవిడ్‌వల్ల కలిగిన నష్టాల్లో కొన్ని శాశ్వతంగా కొనసాగనూవచ్చు. ఈ పరిస్థితిని మార్చడానికి సత్వరం ప్రాధాన్యమివ్వాలని ప్రపంచ ఆర్థిక వేదిక మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాదియా జహీదీ పిలుపిచ్చారు. లింగ సమానత్వ సూచీ ప్రకారం దక్షిణాసియాలో బంగ్లాదేశ్‌ అగ్ర స్థానంలో నిలిచింది. భారత్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ ఎంతో వెనకబడిపోయాయి.

రాజకీయ, సాంకేతిక రంగాల నాయకత్వ స్థానాల్లో మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువ కావడం భారత్‌ వెనకబాటుకు ప్రధాన కారణం. మహిళా కార్మిక భాగస్వామ్య రేటు, ఆరోగ్యం గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. మహిళా సాధికారత సూచీలో భారత్‌ ఎక్కడో అడుగున ఉంది. స్త్రీల విద్యలో 114వ స్థానంతో సరిపెట్టుకొంటోంది. కేంద్ర ప్రభుత్వ 'బేటీ బచావో బేటీ పఢావో' పథకం కింద మహిళా ఖాతాలో నేరుగా రూ.500 జమచేయడం, ఉజ్జ్వల, ఒన్‌ స్టాప్‌ సెంటర్‌, సుకన్య సమృద్ధి పథకాలను చేపట్టడం.. సరైన దిశగా పడిన అడుగులు. వీటితోపాటు ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయడమూ అవసరమే. మహిళలను ఎక్కువగా నియమించుకునే సూక్ష్మ పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు ఆర్థికంగా మరింత ఊతమివ్వాలి. ప్రత్యక్ష నగదు బదిలీ చేపట్టాలి. మహిళలు నడిపే సంస్థలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలి. మహిళా వ్యాపార సంస్థలకు బడా ప్రైవేటు కంపెనీల సరఫరా గొలుసులలో ప్రాధాన్యం కల్పించి వ్యాపార వృద్ధికి తోడ్పడాలి. పెద్ద కంపెనీల డైరెక్టర్ల బోర్డుల్లో స్వతంత్ర మహిళా డైరెక్టర్లను నియమించడం ఇప్పటికీ అరుదే. దాదాపు అన్ని జాతీయ పార్టీలూ ఆమోదించినా మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటు సమ్మతికి నోచుకోలేదు.

పెరుగుతున్న 'నిష్పత్తి'

ఇటీవల విడుదలైన అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే (2019-20)లో మహిళా ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సానుకూల అంశాలు ఉండటం ఊరటనిస్తోంది. భారత్‌లో సంపూర్ణ సంతాన సాఫల్య రేటు తగ్గడం, ఆస్పత్రి ప్రసవాలు పెరగడాన్ని ఇక్కడ ఉదాహరించాలి. భారత్‌లో మరణాలకన్నా జననాలు తగ్గడం మున్ముందు జనాభా తగ్గుదలకు కారణమవుతుంది. 15 ఏళ్లలో తొలిసారి లింగ నిష్పత్తి మెరుగుపడినట్లు కుటుంబ ఆరోగ్య సర్వే నిర్ధారించింది. 2015-16లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 919 మంది స్త్రీలు ఉండగా, తాజా సర్వే ప్రకారం నిష్పత్తి 1000:929కి చేరింది. మహిళల్లో అక్షరాస్యత పెరిగినప్పుడు ఆరోగ్యం, సంతానం విషయంలో వారు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు పోషకాహారం అందించడంలో భారత్‌ ఇంకా వెనకబడి ఉండటం విచారించాల్సిన అంశం. 2015-16 నాటి కుటుంబ ఆరోగ్య సర్వే ప్రపంచవ్యాప్తంగా రక్తహీనత భారత్‌లోనే అత్యధికమని తేల్చింది.

భారతీయ మానవ వనరుల్లో దాదాపు సగంమంది ఐరన్‌ లోపంతో వచ్చే రక్తహీనతతో బాధపడుతున్నవారే. వాతావరణ మార్పుల దుష్ప్రభావం మహిళలపై చాలా ఎక్కువగా ఉండబోతోంది. పేదరికానికి తోడు వాతావరణ మార్పులు వారి జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. అదే సమయంలో వాతావరణ మార్పులను అరికట్టి పర్యావరణాన్ని రక్షించుకునే ఉద్యమంలో మహిళలు, యువతులు ముందుంటున్నారు. మెక్సికోలో 17వేల మంది స్థానిక కార్యకర్తలను సమీకరించి సియెర్రా గోర్దా ప్రాంతాన్ని హరిత జీవ మండలంగా పునరుద్ధరించిన ఘనురాలు మార్తా ఇసబెల్‌ రుయిజ్‌ కోర్జోను ఇక్కడ ప్రస్తావించాలి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) నిరుడు ఆమెకు ఈక్వేటర్‌ బహుమతి ప్రదానం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవంతోపాటు త్వరలో జరగనున్న 66వ మహిళా హోదా ఉద్ధరణ సంఘ సమావేశాలు సైతం మహిళా సాధికారత, లింగ సమానత్వానికి ప్రాధాన్యమివ్వనున్నాయి.

బంగ్లాదేశ్‌ ఆదర్శం

బంగ్లాదేశ్‌ను గడచిన 20 ఏళ్లలో ఇద్దరు మహిళా ప్రధానమంత్రులు ఏలారు. మహిళా సాధికారత, లింగ సమానత్వంలో వారు సాధించిన విజయాలు అసమానం. బంగ్లా ప్రభుత్వం చేపట్టిన మహిళా సంక్షేమ విధానాలు, పౌర సమాజంతో కలిసి అమలు చేసిన కార్యక్రమాల నుంచి భారత్‌తో సహా పొరుగు దేశాలు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. బంగ్లా మహిళాభ్యుదయంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అంతాయింతా కాదు. మహిళల స్థితిగతులను మెరుగుపరచడానికి బంగ్లా ప్రభుత్వం 1990ల నుంచే కృషి ప్రారంభించింది.

మహిళా భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదని, సమ్మిళిత అభివృద్ధీ సిద్ధించదని బంగ్లా సర్కారుకు తెలుసు. రాజ్యాంగానికి అనుగుణంగా బంగ్లా ప్రభుత్వం మహిళా ప్రయోజనాలను కాపాడటానికి పలు చట్టాలను సవరించింది. మహిళాభ్యుదయానికి సరైన విధానాలు చేపట్టింది. వాటి అమలుకు సరైన సంస్థలను స్థాపించింది. మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది. సమాచార, సాంకేతిక పరిజ్ఞానాలను నేర్పి ఉపాధి మార్కెట్‌లో మంచి అవకాశాలు పొందే వీలు కల్పించింది. గడచిన రెండు దశాబ్దాల్లో మహిళలకు ఉద్యోగావకాశాలు పెరగడమే కాదు- పురుషులకు మహిళలకు మధ్య వేతన వ్యత్యాసం తగ్గుతూ వచ్చింది. నేడు విదేశీ మార్కెట్లకు రెడీమేడ్‌ దుస్తులు అందించడంలో బంగ్లాదేశ్‌ అగ్రగామి. ఈ రంగంలోని 40 లక్షలమంది సిబ్బందిలో మహిళలే ఎక్కువ. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో మహిళా సమానత్వ సాధన బంగ్లాదేశ్‌లో మహిళా సాధికారతకు గట్టి పునాదులను ఏర్పరచింది.

ఇదీ చూడండి :'మినీ టీచర్' మెగా సాహసం.. పాఠాలు చెప్పేందుకు రోజూ అడవిలో 16కి.మీ నడక

Last Updated : Mar 8, 2022, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details