జనాభా పెరుగుదల కట్టలు తెంచుకున్నప్పుడు నగరాలు, పట్టణాలు కిక్కిరిసిపోయి మౌలిక వసతులపై అమిత భారం పడుతుంది. జనసమ్మర్దం మితిమీరితే పారిశుద్ధ్యం దెబ్బతిని కొవిడ్ వంటి మహమ్మారులు పేట్రేగి, వాటిని కట్టడి చేయడం ఆరోగ్య సంరక్షణ యంత్రాంగానికి అలవి కాకుండా పోతుంది. కరోనా వంటి తక్షణ సమస్యలు అటుంచితే, ప్రపంచ జనాభా అడ్డూఆపూ లేకుండా పెరిగిపోతే ఆకలి కేకలు, పర్యావరణ నష్టాలు పెచ్చుమీరి మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. అధిక జనాభా వల్ల అనర్థాల గురించి హెచ్చరిస్తూ, పరిష్కారాలను ప్రతిపాదించడానికి ఐక్యరాజ్యసమితి ఏటా ప్రపంచ జనాభా దినం నిర్వహిస్తోంది. 1987 జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిన దరిమిలా, ఏటా అదే తేదీన జనాభా దినం జరపాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. అతి సర్వత్ర వర్జయేత్ అనే పెద్దల మాట నీటి మూట కారాదన్న అవగాహన ఆ నిర్ణయంలో ఇమిడి ఉంది.
అందుకే అవాంఛిత గర్భధారణలు..
అధిక జనాభాతో అభివృద్ధి కుంటువడి, ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటుందనే వాస్తవాన్ని అందరూ మననం చేసుకోవాలన్న ఉద్దేశంతో జనాభా దినం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ప్రపంచ జనాభా 780 కోట్లకు చేరిందని, 2050కల్లా 960 కోట్లకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుత కరోనా కల్లోలంలో కుటుంబ నియంత్రణ వీలుకాక అవాంఛిత గర్భధారణలు ఎక్కువై జనాభా వృద్ధి రేటు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలు, బాలికల హక్కులు, ఆరోగ్య సంరక్షణను ఈ ఏడాది జనాభా దిన ఇతివృత్తంగా తీసుకున్నారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఈ ఇతివృత్తమే సరైనదనడంలో మరో మాట లేదు. కరోనావల్ల లాక్‌డౌన్ ఆరు నెలలు కొనసాగితే ఆరోగ్య సంరక్షణ సేవలు దెబ్బతిని, పేద, మధ్యాదాయ దేశాల్లో 4.7 కోట్ల స్త్రీలు, బాలికలకు గర్భనిరోధక సాధనాలు అందుబాటులో లేకుండా పోతాయని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ (యూఎన్‌ఎఫ్‌పీఏ) హెచ్చరించింది. ఈ పరిస్థితి 70లక్షల అవాంఛిత గర్భధారణలకు దారి తీయవచ్చుననీ తెలిపింది.
బాల్య వివాహాల అడ్డా
పేద దేశాల్లో బాల్య వివాహాలు బాలికల గర్భధారణకు దారితీయడం చాలా ఆందోళనకర అంశం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారత్‌లో 2015-16 సంవత్సరంలో 15-19 ఏళ్ల ప్రాయంలోని 86లక్షల మంది బాలికలకు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు అయ్యాయి. వారిలో 45 లక్షలమంది కౌమారం తీరకముందే గర్భవతులయ్యారు. చిన్నవయసులో గర్భం దాలిస్తే ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి, చదువు కొనసాగించలేక, ఆర్థిక స్వశక్తి కొరవడి శాశ్వతంగా భర్తమీద, కుటుంబం మీద ఆధారపడుతూ నిరంతరం ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. తమ హక్కులను కాపాడుకోలేకపోతారు. భారతీయులకు మగబిడ్డే ముద్దు కాబట్టి మగ సంతానం కలిగేవరకు మహిళ పిల్లలను కంటూ ఉండాల్సిన దుస్థితి పలుచోట్ల ఉంది. దీనివల్ల భారత్‌లో 2.1 కోట్లమంది అవాంఛిత ఆడ శిశువులు జన్మించారని 2018 ఆర్థిక సర్వే వెల్లడించింది.
వనితలు విద్యావంతులైతే..
వర్ధమాన దేశాల్లో మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం, మగ పిల్లల్నే కనాలన్న సామాజిక, సాంస్కృతిక నిర్బంధాలు అధిక సంతానోత్పత్తికి, తద్వారా అధిక జనాభాకు దారితీస్తున్నాయి. దీనికి విరుగుడుగా కుటుంబ నియంత్రణను నిర్బంధంగా అమలుచేస్తే, మళ్లీ మహిళలే బాధితులుగా మిగులుతున్నారు. మహిళలకు సాధికారత సమకూర్చడంలో విద్యకు ఉన్నత స్థానం ఉంది. వనితలు విద్యావంతులైతే వరస గర్భాల వల్ల వాటిల్లే అనర్థాలను గ్రహించి, ఆధునిక గర్భనిరోధక పద్ధతులను అవలంబిస్తారు. మగ బిడ్డల కోసం పిల్లలను కనే యంత్రాలుగా మారాలన్న కుటుంబ ఒత్తిళ్లను అధిగమించడంలో విద్యతోపాటు ఆర్థిక స్వశక్తీ ముఖ్య పాత్ర వహిస్తుంది. స్త్రీపురుష సమానత్వాన్ని సమాజం మనసావాచాకర్మణా అంగీకరించడమూ ముఖ్యమే. చదువు, స్వీయసంపాదన, సామాజిక ధోరణుల్లో మార్పు మహిళా సాధికారతకు దారితీసి, స్త్రీలు వ్యక్తిగత, కుటుంబ నిర్ణయ ప్రక్రియలో తమ వంతు పాత్రను సమర్థంగా నిర్వహించగలుగుతారు.