International Mother Language Day: అమ్మభాషలో సాగే భావ వ్యక్తీకరణ హృదయాలను తాకుతుందని నా విశ్వాసం. సాంఘిక జీవన క్రమంలో, సాంస్కృతికంగా ప్రజలను ఏకం చేయడంలోనూ మాతృభాష కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాచీన కాలంనుంచి భారతదేశం వందలాది భాషలు, వేలాది మాండలికాలకు నిలయంగా భాసిల్లుతోంది. ఈ భాషా సాంస్కృతిక వైవిధ్యమే ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టింది. నిజానికి మన భాషా వైవిధ్యం ప్రాచీన నాగరికత మూలస్తంభాల్లో ఒకటి. మన దృష్టి, ఆకాంక్షలు, విలువలు, ఆదర్శాలు, సృజనాత్మకతవంటి అనేక అంశాలకు ఓ సానుకూల వ్యక్తీకరణను అందించే సాధనం మాతృభాష అని అనేక సందర్భాల్లో నేను ఉద్ఘాటించాను. ఒక దేశ సాంస్కృతిక, నాగరికతల అభివృద్ధి క్రమంలో తరాల మధ్య భాషలే ప్రధాన వారధులు. ప్రపంచీకరణ, పాశ్చాత్యీకరణతో మన సంస్కృతి, భాషలతో పాటు అనేక మాండలికాలు ప్రభావితమయ్యాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం భారతీయులకు మరింత ప్రత్యేకమైనది, ప్రాముఖ్యం కలిగినది.
ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో 1999 నవంబర్‌లో ఫిబ్రవరి 21వ తేదీని 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా యునెస్కో ప్రకటించింది. సభ్యదేశాల భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని రక్షించేందుకు యునెస్కో కృషి చేస్తోంది. 'బహుళ భాషా అభ్యసనానికి సాంకేతికత వినియోగం: సవాళ్లు, అవకాశాలు' అనేది 2022 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ఇతివృత్తం. బహుళ భాషా అభ్యసనాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంలో సాంకేతికత పాత్రను చర్చించడం ఈ ఇతివృత్తంలోని అంతర్లీన భావన. బహుళ భాషా బోధన, అభ్యసనాన్ని మరింత మెరుగుపరచేందుకు సాంకేతికత వినియోగం కీలకమన్నది ప్రధాన ఆలోచన. ఒకరి మాతృభాష వినియోగంలో పెరుగుదలను అంచనా వేసి, బహుళ భాషావిద్యలో చేర్చడం ఇందులో కీలకాంశం. భారతీయ తరగతి గదులకు దీన్ని వర్తింపజేసినప్పుడు- ప్రాంతీయ, ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందుతున్న సవాళ్లను పరిష్కరించడం ద్వారా ఇది నూతన అభ్యసన మార్గాలను సృష్టించింది. మొత్తంగా ఇది ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్న 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' దార్శనికతను ప్రతిబింబిస్తుంది.
విద్యార్థుల ఆసక్తి
Mother Language Uses: జాతీయ విద్యావిధానం, 2020- ప్రాథమిక స్థాయిలో కనీసం అయిదో తరగతి వరకు మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రోత్సహించే దార్శనిక పత్రం. అయితే దీన్ని అయిదో తరగతితో ఆపకుండా, కనీసం ఎనిమిదో తరగతి వరకు, ఆపైతరగతులకూ వినియోగించడం ఉత్తమమైన పద్ధతి అనేది నా ఆలోచన. భారతీయ భాషల్లో శాస్త్రీయ, సాంకేతిక పరిభాషలను రూపొందించడం, మెరుగుపరచడం అత్యంత ఆవశ్యకం. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సముచితంగా ఉంటుంది. 'మన మాతృభాషల్లో విజ్ఞానాన్ని అభ్యసించాలి. లేదంటే విజ్ఞానం కేవలం ప్రత్యేక వర్గాలకు చెందినది మాత్రమే అనే అపోహ మొదలై, విజ్ఞానశాస్త్రం ప్రజలకు దూరమయ్యే ప్రమాదం ఉంది' అని ఆయన స్పష్టం చేశారు. వైద్య, ఇంజినీరింగ్ విద్యలో ఉన్నతమైన ఆంగ్ల ఆధారిత విద్యా వ్యవస్థను మాత్రమే మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తే సి.వి.రామన్ మాటల్లోని అంతర్లీన సందేశం మనకు అవగతమవుతుంది. ఈ తరహా వ్యవస్థతో మన దేశంలో అత్యధిక శాతం ప్రజలు ఉన్నత విద్యకు మరింత దూరమయ్యారు. అందుకే భిన్న విభాగాల్లో, విభిన్న రంగాల్లో సమర్థమైన బహుళ భాషా విద్యా వ్యవస్థను నిర్మించడం అత్యంత ఆవశ్యకం. 2020 ఫిబ్రవరిలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్వహించిన ఓ సర్వేలో 83 వేల మంది విద్యార్థుల్లో దాదాపు 44శాతం తమ మాతృభాషలో ఇంజినీరింగ్ చదివేందుకు ఆసక్తి చూపుతూ ఓటు వేశారు. సాంకేతిక విద్యలో మాతృభాష అత్యంత కీలకమని ఈ సర్వే చాటి చెప్పింది. ఈ సందర్భంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, గుజరాతీ వంటి ఎనిమిది భారతీయ భాషల్లోకి పలు కోర్సులను అనువదించడానికి ఏఐసీటీఈ, ఐఐటీ-చెన్నై మధ్య సహకారం అభినందనీయం. జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా 11 భారతీయ భాషల్లో ఇంజినీరింగ్ విద్యను అనుమతించాలనే ఏఐసీటీఈ నిర్ణయం- తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులకు విస్తృత అవకాశాలు కల్పించే ఓ చరిత్రాత్మక చర్య.
అన్నింటికీ సమ గౌరవం