తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వయోవృద్ధుల సంక్షేమంలో వెనుకంజలో భారత్! - వయోవృద్ధులు

రెండు మూడు దశాబ్దాలుగా కార్పొరేట్‌ చదువులు, సాఫ్ట్‌వేర్‌ కొలువులు, భారీ ఆదాయాలు అంటూ అమ్మానాన్నలను(International day of Older persons) వదిలి విదేశాలకు ఎగిరిపోతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. వాళ్లు ఎప్పుడు వస్తారో తెలియక, అమ్మానాన్నలు వెళ్లి వారితో ఉండలేక, మనవళ్లు మనవరాళ్లను సైతం కళ్లారా చూసుకొనే భాగ్యం కరవై ఎందరో పండుటాకులు వేదనాభరితంగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. మలిదశలోను వేదన అనుభవిస్తున్నారు.

old age people
వయోవృద్ధులు

By

Published : Oct 1, 2021, 6:50 AM IST

జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసి అనంత అనుభవాల జ్ఞానంతో ప్రయాణం మలిసంజెలోకి చేరితే.. అది వృద్ధాప్యం(international day of older persons). సమాజంలో వృద్ధులంటే గతంలో మంచి గౌరవం ఉండేది. కుటుంబంలో వారి అభిప్రాయాలకు మన్నన దక్కేది. నైతిక విలువలు లోపించడంతో పాటు ఆర్థికప్రయోజనాలకే ఎత్తుపీట దక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక, మానసిక, ఆరోగ్య సమస్యలు వయోధికులను(international day of older persons 2021) చుట్టుముడుతున్నాయి. గతంలో సమాజం పట్ల భయంవల్లనో, గౌరవభావంతోనో చాలా మంది పిల్లలు మలిదశలో తల్లిదండ్రులను కనిపెట్టుకొని ఉండేవారు. రెండు మూడు దశాబ్దాలుగా కార్పొరేట్‌ చదువులు, సాఫ్ట్‌వేర్‌ కొలువులు, భారీ ఆదాయాలు అంటూ అమ్మానాన్నలను వదిలి విదేశాలకు ఎరిగిపోతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. వాళ్లు ఎప్పుడు వస్తారో తెలియక, అమ్మానాన్నలు వెళ్ళి వారితో ఉండలేక, మనవళ్లు మనవరాళ్లను సైతం కళ్లారా చూసుకొనే భాగ్యం కరవై ఎందరో పండుటాకులు వేదనాభరితంగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. కనీసం నలుగురితో కలిసి ఉండవచ్చన్న భావనతో ఎంతో మంది స్వయంగా వృద్ధాశ్రమాల్లో(Old Age Homes) చేరుతున్నారు. చాలా సందర్భాల్లో పిల్లలే కన్నవాళ్లను వాటిపరం చేస్తున్నారు.

పెరిగిన నేరాలు..

ప్రస్తుతం దేశంలో అరవై ఏళ్లు పైబడిన వారి జనాభా 13.8కోట్లుగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) పేర్కొంది. 2031 నాటికి ఈ సంఖ్య 19.4 కోట్లకు, 2050 నాటికి 30 కోట్లకు చేరుతుందని అంచనా. వీరి సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. కొన్నేళ్లుగా వృద్ధులపై దాడులు, దౌర్జన్యాలు సైతం పెరిగాయి. జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం గతేడాది ఇండియాలో వృద్ధులపై నేరాలకు సంబంధించి 24వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. డిజిటల్‌ ప్రపంచంలో వయోధికుల భాగస్వామ్యం పెంచడానికి ఈ ఏడాది 'అన్నివయసుల వారికీ డిజిటల్‌ సమానత్వం' అంశాన్ని నినాదంగా ఎంచుకున్నారు.

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ మోసాల్లో వృద్ధులు సైతం అధికంగా బాధితులవుతున్నారు. ఆరుపదులు పైబడిన వయసులో తేలిగ్గా మాయ చేయవచ్చని సైబర్‌ అక్రమాసురులు వారిని లక్ష్యంగా ఎంచుకొంటున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే వయోవృద్ధుల సంక్షేమం పరంగా భారత్‌ ఒకింత వెనకంజలోనే ఉందనే చెప్పుకోవాలి. చాలా దేశాలు దశాబ్దాల క్రితమే వారి సంక్షేమం కోసం పటిష్ఠ చట్టాలను రూపొందించాయి. ఆలస్యంగా మేల్కొన్న భారత్‌ 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం తెచ్చింది. చాలామందికి దీనిపై కనీస అవగాహన లేదన్నది కాదనలేని సత్యం.

ప్రతి ఐదుగురిలో ఒకరు..

దేశంలో ప్రతి అయిదుగురు వృద్ధుల్లో ఒకరు ఒంటరితనంలో మగ్గిపోతున్నారని, ముగ్గురిలో ఒకరు వేధింపుల బారిన పడుతున్నారని 'హెల్పేజ్‌' ఇండియా అధ్యయనం చెబుతోంది. కరోనా మహమ్మారి లాక్‌డౌన్లు, భౌతిక దూరం వంటి వాటి వల్ల వారి సమస్యలు మరింత పెరిగినట్లు ఏజ్‌వెల్‌ స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో తేలింది. వృద్ధుల సహాయం కోసం కేంద్రం ఇటీవల అఖిలభారత టోల్‌ఫ్రీ నంబర్‌- 14567ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరించి, విస్తృత ప్రచారం చేయాలి. పెన్షన్‌, న్యాయపరమైన అంశాలు, దౌర్జన్యాలు వంటి వాటికి సంబంధించి ఉచిత సమాచారం, సలహాలను దీని ద్వారా పొందవచ్చు. ఆస్తిపాస్తులు, పెన్షన్‌ సౌకర్యం ఉన్న వారితో పోలిస్తే ఎలాంటి ఆదాయ మార్గాలూ లేని వయోవృద్ధులది తీరని వ్యధ. రెండు పూటలా పట్టెడన్నం పెట్టడమే భారంగా భావించి కడుపున పుట్టిన బిడ్డలే కర్కశంగా తల్లిదండ్రులను రోడ్లపాలు చేస్తున్న ఘటనలు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిత్యం చోటుచేసుకొంటున్నాయి. మరోదారిలేక వీరిలో చాలామంది భిక్షాటనతో పొట్టపోసుకొంటున్నారు. వీరందరినీ గుర్తించి ఆదరువు కల్పించాలి.

అవసరమైతే ప్రభుత్వాలే వృద్ధాప్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో లెక్కకు మిక్కిలిగా పింఛన్లు రద్దయ్యాయి. ఆ డబ్బుతోనే బతుకు వెళ్లదీస్తున్న వృద్ధులకు ఇది అశనిపాతమే. ప్రభుత్వం అర్హులైన వృద్ధులందరికీ పింఛన్లు అందేలా చూడాలి. వయోధికుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి వయ వందన పథకం, జన్‌ ఆరోగ్య యోజన, ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్‌ పథకం, వరిష్ఠ పింఛన్‌ బీమా యోజన తదితర పథకాలున్నా వాటి గురించి చాలా మందికి అవగాహన ఉండటంలేదు. వాటిపై విస్తృత ప్రచారం కల్పించాలి. పింఛన్‌ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేసి మలిదశ వయసులో ఆర్థిక భరోసా దక్కేలా చూడాలి. అనారోగ్యం బారిన పడిన వారికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడటం తప్పనిసరి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పింఛన్‌ను పెంచాలి. కన్నబిడ్డలు సైతం తల్లిదండ్రుల సంక్షేమాన్ని తమ బాధ్యతగా భావించాలి. అప్పుడే వయోవృద్ధులను సముచితంగా గుర్తించి గౌరవించినట్లవుతుంది.

- ఎం.అక్షర

ఇదీ చదవండి:చట్టసభల్లో 'ఆమె' ప్రాతినిధ్యం అరకొరే!

ABOUT THE AUTHOR

...view details