తెలంగాణ

telangana

ETV Bharat / opinion

లంచంపై పోరుకు ఆన్‌లైన్‌ ఆయుధం

International Anti Corruption Day: ప్రజాస్వామ్య పునాదులను, న్యాయ పాలనను అవినీతి మహమ్మారి బలహీనపరుస్తోంది. రాజకీయ అవినీతి.. ప్రభుత్వ సిబ్బందిలో లంచగొండితనం పేట్రేగడానికి కారణమవుతోంది. ఆసియాలో అత్యంత లంచగొండితనం ఉన్నది భారతదేశంలోనే అని అధ్యయనాలు చాటుతున్నాయి. అయితే, ఆన్​లైన్ విధానం పుణ్యమా అని సాధారణ పౌరులకు అవినీతి పీడ ఎంతో కొంత తగ్గినట్లే కనిపిస్తోంది.

International Anti Corruption Day
International Anti Corruption Day

By

Published : Dec 9, 2021, 8:16 AM IST

International Anti Corruption Day: 'మీ హక్కును నిలబెట్టుకోండి, మీ పాత్ర పోషించండి, అవినీతిపై పోరాడండి' అనే నినాదంతో ఈ సంవత్సరం డిసెంబరు తొమ్మిదో తేదీన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం జరుపుకొంటున్నాం. 2003 అక్టోబరు 31నాడు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం అవినీతి నిరోధక ఒప్పందాన్ని ఆమోదించింది. అవినీతిని ఎండగట్టే ప్రజా వేగులకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని ఆ ఒప్పందం పేర్కొంది. 2005 డిసెంబరులో ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది. అవినీతిపై పోరాడటం ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, సమాచార సాధనాలు, పౌరుల కర్తవ్యమని ఈ ఏటి అవినీతి వ్యతిరేక దినం ప్రబోధిస్తోంది. ఈ సందర్భంగా పండోరా కుంభకోణాన్ని బయటపెట్టిన 600మందికిపైగా పాత్రికేయులను మనమంతా అభినందించాలి. అవినీతిపై పోరులో వారు తమ వంతు పాత్రను సమర్థంగా పోషించారు. దాదాపు డజను మంది దేశాధినేతలు తమ అక్రమార్జనను విదేశాల్లోని పన్ను స్వర్గాల్లో దాచుకున్నట్లు పండోరా పత్రాలు బయటపెట్టాయి. వెయ్యి కంపెనీలు, 336 మంది రాజకీయ నేతలు, మంత్రులు, రాయబారులు, ఉన్నత స్థాయి అధికారులకు పన్ను స్వర్గాలతో ఉన్న అవినీతి లంకెను పండోరా పరిశోధన బయటపెట్టింది.

Online tools for reducing corruption

కొవిడ్‌ వల్ల అతలాకుతలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా కోలుకోవాలంటే- ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, ఉద్యోగులు, అధికారుల అవినీతి, అత్యాశలకు కళ్లెం వేయాల్సిందే. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కృషికి కొవిడ్‌ ఇప్పటికే తీవ్ర విఘాతం కలిగించింది. అభివృద్ధి, సంక్షేమాలు చెట్టపట్టాల్‌గా సాగే నవ ప్రపంచ సాధన పట్టాలు తప్పకుండా ఉండాలంటే- అవినీతిని నిర్మూలించడం తమ బాధ్యత అని అన్ని వర్గాలూ గుర్తించాలి. అవినీతి మార్గాల్లో ఆర్జించిన నల్లధనం ఓట్ల కొనుగోలుకు ఇంధనమై ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల కొనుగోలుకూ అవినీతి సొమ్మే ఆధారం. పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులను కొనుగోలు చేసి ప్రభుత్వాలను మార్చేయడం భారత రాజకీయాల్లో ఆనవాయితీ అయిపోయింది. అవినీతిపరులు ప్రజాస్వామ్య పునాదులను, న్యాయ పాలనను బలహీనపరుస్తారు. రాజకీయ అవినీతి ప్రభుత్వ సిబ్బందిలో లంచగొండితనం పేట్రేగడానికి కారణమవుతుంది. దీనివల్ల చిన్న వ్యాపారుల మనుగడకు ముప్పు వాటిల్లడమే కాదు... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ అవకాశం తగ్గుతుంది. వ్యాపార సౌలభ్య సూచీలో దేశం అడుగుకు జారిపోయి ఆర్థికాభివృద్ధి కుంటువడుతుంది.

transparency international corruption:

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ 2020లో జరిపిన అధ్యయనం ప్రకారం, ఆసియాలో అత్యంత లంచగొండితనం ఉన్నది భారతదేశంలోనే. లంచాలు ఇచ్చినవారిలో సగం మంది వ్యక్తులు తమను ప్రభుత్వోద్యోగులు డిమాండ్‌ చేయడంవల్లే అలా చేశామని చెప్పారు. 32శాతం పలుకుబడిని ఉపయోగించి పనులు చేయించుకున్నామని తెలిపారు. భారతదేశంలో దర్యాప్తు జరుగుతున్న 90శాతం లంచగొండి కేసులు ప్రభుత్వోద్యోగులకు సంబంధించినవే. ఈ కేసుల్లో శిక్షలు పడుతున్నవారు చాలా తక్కువ. అవినీతికి చట్టాల్లో ఇచ్చిన నిర్వచనంలోని లోపాల వల్ల నిందితులు తప్పించుకోగలుగుతున్నారు. ఇటీవల వెలువడిన రెండు అంతర్జాతీయ అవినీతి సూచికల ప్రకారం భారత్‌లో 2013-20 మధ్యకాలంలో అవినీతి కాస్త తగ్గుముఖం పట్టింది. 194 దేశాల్లో లంచగొండితనం గురించి విదేశీ మదుపరులు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం 2014లో లంచగొండి సూచీలో 185వ స్థానంలో ఉన్న భారత్‌ 2020 వచ్చేసరికి తన ర్యాంకును 77కి మెరుగుపరచుకొంది. అంతర్జాతీయ వ్యాపార సంస్థల సంఘం 'ట్రేస్‌' అధ్యయనం ఈ సంగతి తెలిపింది. 180 దేశాల్లో అవినీతిపై స్థానిక వ్యాపారుల అభిప్రాయాలను సేకరించే 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌' సూచిక ప్రకారం 2013లో 94వ ర్యాంకులో ఉన్న భారత్‌ 2020నాటికి 86వ ర్యాంకుకు చేరుకుంది. అయితే, ఈ రెండు అధ్యయనాలు బహుళజాతి, బడా స్థానిక కార్పొరేట్‌ సంస్థల అభిప్రాయాలపై ఆధారపడినవి. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నేరుగా సంప్రతింపులు జరిపి విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలవని మరచిపోకూడదు. దిగువ స్థాయి రాజకీయ నాయకులతో, ప్రభుత్వ సిబ్బందితో సంబంధాలు నెరిపే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు లంచగొండుల వల్ల వచ్చిపడుతున్న బాధలు 'ట్రేస్‌, ట్రాన్స్‌పరెన్సీ'ల అధ్యయనాల్లో ప్రతిఫలించడం లేదు.

కొన్ని ఆశారేఖలు

సాధారణ పౌరులకు మాత్రం అవినీతి పీడ ఎంతో కొంత తగ్గినట్లే కనిపిస్తోంది. ఆన్‌లైన్‌ పన్ను చెల్లింపు విధానం వల్ల వారు ఇదివరకటిలా ఆదాయపన్ను అంచనా, పన్ను వాపసులకు లంచాలు ఇవ్వాల్సిన అగత్యం తప్పింది. ఇవాళ రైళ్లలో బెర్తుల రిజర్వేషన్‌కూ లంచం ముట్టజెప్పనక్కర్లేదు. ఇది ఆదాయ పన్ను, రైల్వే శాఖల్లో కంప్యూటరీకరణ చలవే. పైస్థాయి అవినీతి మాత్రం రూపాలు మార్చుకొంది. సహజ వనరుల అమ్మకం, లీజులకు బహిరంగ వేలం ప్రక్రియను చేపట్టాలని స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణాల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశించినా బొగ్గు, ఇసుక, ఖనిజాలు, అటవీ ఉత్పత్తుల అక్రమ అమ్మకాలు, లీజులు యథాతథంగా కొనసాగుతున్నాయి. రాజకీయ నాయకులు, వ్యాపారులు, ప్రభుత్వ సిబ్బంది మిలాఖత్‌ కావడమే దీనికి మూలకారణం. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల కేటాయింపు, అధికారులు, ఉద్యోగుల బదిలీలకు డబ్బు చేతులు మారడం కొనసాగుతూనే ఉంది. కోర్టు తీర్పులు, చట్టాలు అవినీతిని నిర్మూలించలేక పోతున్నాయి. కొవిడ్‌ అనంతర ప్రపంచంలో అభివృద్ధి శిఖరాలను అందుకునే యజ్ఞంలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పాల్గొంటేనే అవినీతిని అంతమొందించడం సాధ్యమవుతుంది. అవినీతి సర్వవ్యాప్తం కావడంతో దాని నిర్మూలన కష్టసాధ్యమవుతోంది. ప్రజా జీవనంలో నిజాయతీ, సత్యనిష్ఠల ఆవశ్యకత గురించి మహాత్మాగాంధీ పదేపదే చెప్పేవారు. నాయకుడికి సొంత ఆస్తి ఉండకూడదని, ప్రజల ఆస్తులకు ధర్మకర్తలా వ్యవహరించాలని ప్రబోధించేవారు. ప్రజల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ నైతిక విలువలను శిరసావహిస్తే తప్ప అవినీతిపై పోరులో సఫలం కాలేం.

విధానాల్లో లొసుగులు

ప్రభుత్వ విధానాల్లో లొసుగులవల్లే రాజకీయ నాయకులు, బడా కార్పొరేట్‌ సంస్థల మధ్య అవినీతి బంధం వర్ధిల్లుతోంది. టెలికాం, గనుల రంగాల్లో చోటుచేసుకున్న భారీ అవినీతి కుంభకోణాలు దీనికి నిదర్శనం. ఆర్థికాభివృద్ధి పేరిట బడా వ్యాపారవేత్తలు ప్రభుత్వ విధానాలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. నియంత్రణలను సడలింపజేస్తారు. పన్ను, కార్మిక చట్టాలను మార్చేట్లు పురిగొల్పుతారు. చిన్న వ్యాపారులకు ఈ సౌలభ్యం ఉండదు కాబట్టి వారు నిర్ణీత గడువులో లంచాలు ముట్టజెప్పాల్సిందే. ఈ మొత్తాలను స్థానిక రాజకీయ నాయకులు, పోలీసులు పంచుకుంటారు.

-ప్రసాద్‌

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details