మొదటి వరస సైనికులైన వైద్యవర్గం నిర్విరామంగా కొవిడ్ రోగులకు సేవలు అందిస్తూ- అదే జబ్బు బారిన పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తమ సహచరులు పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండటంతో వైద్య వర్గాల్లో తీవ్రమైన అభద్రతాభావం నెలకొంటోంది. దేశ ప్రజలందరూ లాక్‌డౌన్ సమయంలో నివాసాలకు పరిమితమై, బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నప్పుడు కరోనా బాధితులకు బాసటగా నిలిచిన వైద్యుల ప్రాణాలకు రక్షణ కరవైంది. 2021 ఫిబ్రవరి నాటికి భారత్‌లో 734 మంది వైద్యులు విధి నిర్వహణలో కొవిడ్ కోరలకు చిక్కి ప్రాణాలు కోల్పోయినట్లు- ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రికి రాసిన లేఖలో భారత వైద్య సంఘం (ఐఎంఏ) పేర్కొంది. కరోనా బాధితుల సేవలో అంకిత భావంతో పనిచేస్తున్న వైద్యుల పట్ల ప్రభుత్వం, ప్రజలు సహృదయంతో వ్యవహరించాలని ఐఎంఏ కోరింది. వివిధ దేశాల్లో వైద్య వృత్తిలో కొనసాగుతున్న వారు జనాభాలో కేవలం మూడు శాతం లోపే ఉంటారు. డబ్ల్యూహెచ్‌ఓకు అందిన సమాచారం మేరకు దాదాపు 14శాతం కొవిడ్ బాధితులు వైద్య సిబ్బందే కావడం గమనార్హం. కొవిడ్ మహమ్మారి వైద్య వృత్తిలో ఉన్నవారినే కాకుండా వారి కుటుంబాలనూ తీవ్రమైన అశాంతికి, మానసిక సంఘర్షణకు గురి చేస్తోంది.
నిరుపమాన సేవలు
చికిత్స సమయంలో సాంక్రామిక వ్యాధుల బారిన పడకుండా నేర్పుగా వ్యవహరిస్తూనే- రోగులకు సాంత్వన కలిగించే వైద్యనారాయణులు... కొవిడ్ దెబ్బకు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ బాధితుల సేవల్లో ఉన్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిలో ప్రతి నలుగురిలో ఒకరు కుంగుబాటుకు, ప్రతి ముగ్గురిలో ఒకరు నిద్రలేమికి గురవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. సమాజంలో సుఖసంతోషాలు వెల్లివిరియడంలో వైద్యులు కీలక భూమిక పోషిస్తున్నారు. వారి సేవలను గుర్తించి గౌరవించాల్సిన అవసరాన్ని మహమ్మారి మరోసారి గుర్తు చేసిందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అంటున్నారు. ప్రభుత్వాలు, ఆసుపత్రుల యాజమాన్యాలు- వైద్యుల సంక్షేమానికి పూర్తి బాధ్యత స్వీకరించాలని ఆయన స్పష్టీకరిస్తున్నారు. వైద్యులకు తగిన రక్షణ కల్పిస్తే వారు ప్రజలకు మరింత సంతోషంగా సేవలు అందించగలరని చెబుతున్నారు. ‘వైద్య సిబ్బంది ఆనందమే రోగుల పాలిట ఆరోగ్యం’ అంటూ... అదే మన అందరి నినాదం కావాలనీ ఆయన స్పష్టీకరిస్తున్నారు.
పెరిగిన పనిభారం, ఒత్తిడి
ఒక ఎంబీబీఎస్ వైద్యుడిని తయారు చేయాలంటే సగటున పాతిక లక్షల రూపాయల ప్రజాధనం వ్యయమవుతుంది. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యుల తయారీకి ఒక కోటి నుంచి కోటీ డెభ్భై లక్షల రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు ఎయిమ్స్ ఆసుపత్రి నిర్వాహకుల అంచనా. ప్రస్తుతం మన దేశంలోని 139 కోట్ల జనాభాకు సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది లేరు. కరోనా రెండోదశ విజృంభణలో రోగుల సంఖ్య పెచ్చు మీరుతుండటంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పెరిగి, ఒత్తిడి అధికం అవుతోంది. కరోనా వైరస్ పుట్టి ఏడాదిన్నర కావస్తున్నా, ఈనాటికీ వైద్య శాస్త్రానికి అది సరికొత్త సవాళ్లను విసురుతూనే ఉంది. అందుబాటులో ఉన్న పరిమితమైన వనరులతో ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న రోగులకు నాణ్యమైన చికిత్సను అందించడం వైద్యులకు సైతం తలకు మించిన భారంగా పరిణమించింది. నాణ్యమైన పీపీఈ కిట్లు సరిపడా సంఖ్యలో అందుబాటులో లేనందువల్ల హెచ్చు సంఖ్యలో వైద్యులు కరోనా బారిన పడుతున్నట్లు ఎయిమ్స్ వైద్య సంఘం ప్రతినిధి డాక్టర్ హర్జిత్ సింగ్ అంటున్నారు. పనిభారం, పని చేయాల్సిన సమయం పెరగడంతో వైద్యులకు కరోనా సోకే అవకాశాలూ పెచ్చుమీరాయని ఆయన స్పష్టీకరిస్తున్నారు.