తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అమలులో లోపాలే జీఎస్టీకి శాపాలు - ఐటీసీ మోసాలు

ఆగస్టులో వస్తుసేవల పన్ను వసూళ్లు రూ. 1.16 లక్షల కోట్లకు చేరాయి. ఇటీవలే కాలంలో ధరల పెరుగుదల, కరోనా ఆంక్షల సడలింపులతో సహజంగానే ఆదాయం పెరిగింది. అయితే జీఎస్టీలో మోసాలు లేకుంటే ఈ వసూళ్లు మరింత పెరిగేవని నిపుణులు అంటున్నారు. మరి ఈ మోసాలకు ఎలా అడ్డుకట్ట వేయాలంటే..

జీఎస్​టీ
gst

By

Published : Aug 10, 2021, 5:09 AM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఆగస్టు మొదటివారంలో విడుదలైన గణాంకాలను బట్టి రూ. 1.16 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో అతిపెద్ద జీఎస్టీ వసూళ్ల పర్వమిది. ఇటీవలి కాలంలో వస్తుసేవల ధరలు పెరిగినందువల్ల సహజంగానే వాటిపై పన్నుల ఆదాయమూ హెచ్చింది. దీనికితోడు కొవిడ్‌ లాక్‌డౌన్‌లను సడలించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని తద్వారా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. జీఎస్టీలో మోసాలు లేకుంటే ఈ వసూళ్లు మరింతగా ఉండేవని ఇక్కడ మనం గమనించాలి. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8,000 కేసుల్లో రూ.35,000 కోట్ల మేర నకిలీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)లను దాఖలు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కేంద్ర జీఎస్టీ మండలాలు, జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన కేసులివి. సరకుల సరఫరాదారులు, కంపెనీల డైరెక్టర్లు, చార్టర్డ్‌ ఎకౌంటెంట్లు, న్యాయవాదులు కలిసి చేస్తున్న మోసాలివి.

మోసాల మూలాలను గుర్తించడం కీలకం

జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నవారిపై అధికారులు దాడులు చేసి ఫలితాలు సాధిస్తున్నా, మొత్తం మోసాల్లో వారు పట్టుకుంటున్నవి చాలా స్వల్పమనే చెప్పాలి. జీఎస్టీ ఎగవేత దేశ ఆదాయానికి పెద్దయెత్తున గండి కొట్టి మన ఆర్థిక సుస్థిరతకు ముప్పుతెస్తోంది. దీన్ని నివారించాలంటే సమస్య మూలాల్లోకి వెళ్ళి తుదముట్టించాలి. అందుకు మొదట జీఎస్టీ మోసాలు ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవాలి. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ)లోనే అత్యధిక మోసాలు నమోదవుతున్నాయి. ఉత్పత్తి సాధనాల(ఇన్‌పుట్స్‌)పై అంతకుముందే చెల్లించిన పన్నులను మినహాయించిన తరవాతే ఉత్పత్తి మీద పన్ను కట్టే సౌలభ్యాన్ని జీఎస్టీ విధానంలో పొందుపరచారు. దీన్ని భారీయెత్తున దుర్వినియోగం చేస్తున్నారు. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ కట్టకుండానే దాని మీద మినహాయింపు పొందుతున్నారు. దీనికోసం మోసగాళ్లు వందలాది బోగస్‌ కంపెనీలు ప్రారంభించి, పాన్‌ కార్డులతో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. ఆ కంపెనీల నుంచి ఎటువంటి వస్తుసేవలు సరఫరా చేయకపోయినా కొనుగోలుదారులకు నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్‌లు ఇస్తున్నారు. ఈ ఇన్వాయిస్‌లను కొంత కమిషన్‌ మీద ఏజెంట్లకు విక్రయిస్తారు. వ్యాపారులు కమిషన్‌ ఏజెంట్ల నుంచి ఆ బోగస్‌ ఇన్వాయిస్‌లను కొనుక్కొని ప్రభుత్వం నుంచి ఐటీసీ రూపంలో పన్ను మినహాయింపు పొందుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది. ఇన్వాయిస్‌లను సరిపోల్చి చూడటం ద్వారా ప్రభుత్వం ఐటీసీ మోసాలను తగ్గించడానికి ప్రయత్నించినా, మోసాలను పూర్తిగా అరికట్టలేకపోయింది.

మరికొందరు వ్యాపారులు బోగస్‌ కంపెనీలను సృష్టించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుస్తూ టర్నోవరును పెంచి చూపిస్తున్నారు. దీన్ని అడ్డుపెట్టుకుని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేస్తున్నారు. ఈ రెండు రకాల మోసాలకు మూలం కొత్త సంస్థల రిజిస్ట్రేషన్‌లో, జీఎస్టీ నంబరు సంపాదించే పద్ధతిలో ఉంది. వ్యాపార సౌలభ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ పద్ధతిని సరళతరం చేసింది. అయితే, కొత్త కంపెనీల చిరునామాను భౌతికంగా ధ్రువీకరించే అవకాశం లేకపోవడం ప్రధాన లోపం. అందుకే పెద్దయెత్తున నకిలీ కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటి పేరుచెప్పి మోసగాళ్లు పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారు. దీన్ని నివారించాలంటే కొత్త కంపెనీల ఉనికిని నిర్ధారించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

పరిష్కారం ఏమిటి?

పన్ను కట్టవలసినవారు తప్పక చెల్లించేలా జాగ్రత్త పడుతూ మోసాలకు, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. పన్నులు కట్టాల్సి ఉన్నా రకరకాల కారణాల వల్ల ఆ పరిధిలోకి రానివారిని గుర్తించి, పన్ను చెల్లింపుదారులుగా మార్చడమూ అంతే కీలకం. దానికన్నా ముందు- కొవిడ్‌వల్ల పట్టాలు తప్పిన దేశార్థికాన్ని మళ్ళీ గాడినపెట్టి, ప్రజల ఆదాయాలు పెరిగేలా చూడాలి. ఆదాయాలు జోరందుకుంటే పన్నువసూళ్లూ పుంజుకొంటాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పడితే కానీ ప్రభుత్వ ఆదాయం పెరగదు. అభివృద్ధి పైన, సంక్షేమం పైన ఖర్చు చేసే సత్తా సమకూరదు. ఇది కేంద్రానికే కాదు, రాష్ట్రాలకు సైతం వర్తిస్తుంది. కేంద్రం ప్రధానంగా అబివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటే, రాష్ట్రాలు సంక్షేమంపై భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీనంతటికీ కావలసిన నిధులను పూర్తిస్థాయిలో సమకూర్చే సత్తా ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు లేదు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ల వల్ల ఆర్థిక కార్యకలాపాల జోరు తగ్గడం వల్ల పన్నుల ఆదాయమూ కుదించుకుపోవడం దీనికి ప్రధాన కారణం. ప్రజల ఆదాయాలు ఇనుమడిస్తేనే వస్తుసేవలకు గిరాకీ పెరుగుతుంది. గిరాకీతోపాటు ఉత్పత్తీ అధికమవుతుంది. ఉత్పత్తి, వినియోగాలు పెరిగితే వాటి మీద పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం విత్త లోటుకు వెరవకుండా తన వ్యయాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థలో అధిక గిరాకీ సృష్టించాలి. వ్యవస్థాపరంగా తగిన సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థికానికి కొత్త ఊపు ఇవ్వాలి. అది జరిగితే జీఎస్టీ ఆదాయమూ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.

వాస్తవాల ప్రాతిపదికనే అంచనాలు

నేరం జరగకుండా నివారించడం సహా నేరగాళ్లను తక్షణం శిక్షించడం కూడా ముఖ్యమే. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ వంటి అధునాతన మార్గాల్లో జీఎస్టీ ఎగవేతదారులను పట్టుకుని శిక్షించాలి. పన్ను ఎగవేతలను నివారించడానికి చట్టాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పుచేర్పులు చేయాలి. కాలంతోపాటు మన చట్టాలూ మారాలి. పన్ను ఎగవేతలను అడ్డుకుని దేశానికి భారీగా ఆదాయం పెంచాలి. జీఎస్టీ గురించి పన్ను చెల్లింపుదారులకు అవగాహన పెంచడమూ ముఖ్యమే. జీఎస్టీ పరిధిలోకి మరికొంతమంది పన్ను చెల్లింపుదారులను తీసుకురావాలి. ఈ-వే బిల్లుల ప్రామాణికతను ఎప్పటికప్పుడు నిర్ధారించుకోవాలి. అదే సమయంలో జీఎస్టీ వసూళ్ల గురించి బడ్జెట్‌లో అతిగా అంచనాలు వేసుకోవడం మానాలి. దేశంలో వ్యాపారాలు, పరిశ్రమలు నిజంగానే లాభాలు ఆర్జిస్తున్నాయా అనేది నిర్ధారించుకున్న తరవాతే పన్నుల ఆదాయాల గురించి అంచనాలు వేసుకోవాలి. స్థూల ఆర్థిక వ్యవస్థ దివ్యంగా ఉంటేనే వ్యాపారులు, ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వారు పన్నులు సక్రమంగా కట్టగలుగుతారు. ఈ వాస్తవాన్ని గమనించకుండా ఈ ఏడాది పన్ను వసూళ్లు గొప్పగా ఉంటాయని బడ్జెట్‌లో అంచనాలు వేసుకుంటే, చివరకు అంత ఆదాయం చేతికి రాక ప్రభుత్వం నానా పాట్లు పడవలసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలకూ నిధులు తగ్గించి, అన్ని రకాలుగా వ్యయాన్ని తెగ్గోయాల్సి ఉంటుంది. అటు ప్రభుత్వమూ ఖర్చు చేయక, ఇటు వ్యాపారులూ పెట్టుబడులు పెట్టలేకపోతే యావత్‌ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది.

-డాక్టర్ మహేంద్రబాబు కురవ

రచయిత, హెచ్​ఎన్​బీ గఢ్వాల్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ డీన్

ఇదీ చూడండి:గిఫ్ట్ కార్డులు, క్యాష్​ బ్యాక్​లకు జీఎస్​టీ వర్తింపు!

ABOUT THE AUTHOR

...view details