దేశవ్యాప్తంగా వివిధ అంచెల్లో ఏళ్లతరబడి లెక్కకు మిక్కిలి వ్యాజ్యాలు అపరిష్కృతంగా పోగుపడుతున్నాయి. వాటిలో సింహభాగం వాటా దిగువ న్యాయస్థానాలది. దేశంలోని 25 హైకోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 57.5 లక్షలకు చేరగా, జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో మోక్షానికి నోచక పేరుకుపోయినవి ఎకాయెకి మూడు కోట్ల 81లక్షలుగా లెక్క తేలుతున్నాయి. అసంఖ్యాక కక్షిదారుల జీవితాలను గరిష్ఠంగా ప్రభావితం చేస్తున్నవి దిగువ స్థాయి న్యాయస్థానాలేనని ఈ గణాంకాలు సోదాహరణంగా చాటుతున్నాయి. అంతటి కీలక భూమిక పోషిస్తున్న అంచెలో మౌలిక వసతుల అధ్వాన స్థితిగతులకు రెండేళ్లనాటి విస్తృత అధ్యయనం దర్పణం పట్టింది.
దిల్లీ, కేరళ టాప్
ఆ సర్వేలో దిల్లీ, కేరళ అత్యుత్తమ ర్యాంకులు పొందగా- బిహార్, మణిపూర్, నాగాలాండ్, పశ్చిమ్‌బంగా, ఝార్ఖండ్ ప్రభృత రాష్ట్రాల్లోని దిగువ కోర్టులు అరకొర వసతులతో నెట్టుకొస్తున్నట్లు నిగ్గుతేలింది. అధ్యయన వివరాలు వెలుగు చూడకముందే- కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం జారీచేసిన ఆదేశాల స్ఫూర్తికి ఇంకా సరైన మన్నన దక్కనే లేదు. న్యాయపాలిక అన్ని అంచెల్లోనూ కనీస వసతుల పరికల్పన అంశాన్ని గతంలోనే పలుమార్లు లేవనెత్తిన ప్రస్తుత సీజేఐ రమణ మానసపుత్రిక 'నేషనల్ జుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్' క్రియాశీలకమై గుణాత్మక పరివర్తనను కళ్లకు కట్టాల్సి ఉంది.
జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో మౌలిక వసతుల పెంపుదలను లక్షించిన కేంద్ర ప్రాయోజిత పథకాన్ని 2025-26 సంవత్సరం వరకు పొడిగిస్తూ మోదీ మంత్రిమండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత వ్యయం తొమ్మిది వేలకోట్ల రూపాయల్లో దాదాపు 60శాతం దాకా కేంద్రమే వెచ్చించి కోర్టుహాళ్లు, నివాస సముదాయాల నిర్మాణం కొనసాగిస్తానంటోంది. వ్యాజ్యాల సంఖ్య ఇంతలంతలవుతుండగా ఆ మేరకు దిగువ కోర్టుల్లో మౌలిక సదుపాయాల విస్తరణ అభిలషణీయమే. దాంతోనే వ్యాజ్యాల పరిష్కరణ వేగవంతం కాబోదన్నది విస్మరించరాని అంశం!