నిరుపేదల బతుకుల్ని కర్కశంగా చిదిమేసే క్రూరమైన పన్ను- ద్రవ్యోల్బణం. ఇండియాలాంటి దిగువ మధ్యాదాయ దేశంలో చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్న సగటు పౌరుల మీద ధరోల్బణ దుష్ప్రభావాలు- ఒక్క ముక్కలో చెప్పాలంటే, దుర్భరం. వరసగా రెండో ఏడాదీ కొవిడ్ సృష్టించిన సామాజికార్థిక కల్లోల పరిస్థితుల్లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణానికి రెక్కలు మొలవడం- కోట్లాది జనావళి బతుకులపై పిడుగుపాటే. ఏప్రిల్ నెలలో 4.2గా ఉన్న వినియోగ ధరోల్బణ సూచీ మే నెలలో 6.3గా నమోదైందని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ప్రకటించింది. పట్టుమని నెలరోజుల్లో ఆహార ధరల సూచీ రెండు నుంచి అయిదు శాతానికి పెరిగిందని, రిజర్వ్ బ్యాంకు నిర్దేశించుకొన్న గరిష్ఠ లక్ష్యాన్ని దాటేసి గ్రామీణ ద్రవ్యోల్బణం 6.5 శాతానికి ఎగబాకిందని సర్కారీ గణాంకాలు చాటుతున్నాయి.
ఇంధనం, వంటనూనెల రేట్ల పెరుగుదలే ఇటు చిల్లర, అటు టోకు ద్రవ్యోల్బణ ఉద్ధృతికి కారణమైంది. బడుగుల నిత్య జీవితాల్ని నేరుగా ప్రభావితం చేసే చిల్లర ద్రవ్యోల్బణం ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరి ఉరమడం తీవ్ర ఆందోళనకరమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.4 శాతానికి, వృద్ధిరేటు 9.5 శాతానికి పరిమితమవుతుందని ఆర్‌బీఐ ఇటీవల కట్టిన అంచనాల్ని క్షేత్రస్థాయి ధరాఘాతాలు బదాబదలు చేస్తున్నాయి. వంట నూనెలు మంట నూనెలై ఎగసిపడుతుంటే, అనేక చోట్ల లీటరు వంద రూపాయలు దాటిపోయిన పెట్రోఘాతాలకు జనం కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. రైతు అమ్మబోతే అడవి, వినియోగదారు కొనబోతే కొరివిగా దిగజారిన విపణి వ్యవస్థలో సరైన అదుపాజ్ఞలు లేక ద్రవ్యోల్బణం కట్లు తెంచుకోవడంలో వింతేముంది? వస్తూత్పత్తులకు గిరాకీ తక్కువగా ఉన్నప్పుడే ఇంతగా జూలు విదిలిస్తున్న ద్రవ్యోల్బణం వృద్ధిరేట్లనూ దిగలాగే ప్రమాదం ఉన్నందున- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి.
మూడు దశాబ్దాల క్రితమే..