ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక రంగంలో పురోగతి సాధించాల్సిందే. ఈ అభివృద్ధి పర్యావరణహితంగా, ప్రమాదాలకు ఆస్కారమివ్వకుండా ఉండాలి. పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకోవడం సర్వసాధారణమైన విషయంగా మారింది. ప్రమాదాలు ఎక్కువగా సాంకేతిక లోపాలవల్ల చోటు చేసుకున్నాయి. షార్ట్‌సర్క్యూట్, పేలుడు, లీకేజిల వల్లా సంభవిస్తున్నాయి. వీటి వల్ల ధన, ప్రాణ నష్టాలతో పాటు, పర్యావరణానికీ ఎంతో చేటు కలుగుతోంది. ఉదాహరణకు- భోపాల్ గ్యాస్ విషాదం (1984), జైపూర్ చమురు మంటలు (2009), విశాఖపట్టణం గ్యాస్ లీక్ (2020)... ఈ కోవలోకే వస్తాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (1996-2020) నివేదిక ప్రకారం పరిశ్రమల్లో ఏడాదికి 37 కోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి కారణంగా 23 లక్షల మంది వరకు చనిపోతున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ (2019) నివేదిక ప్రకారం భారత్‌లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న మొదటి అయిదు రాష్ట్రాలు వరసగా- గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్!
సాంకేతిక లోపాలెన్నో...
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారని, క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు తీవ్రంగానే వినిపిస్తున్నాయి. పరిశ్రమల్లో సాంకేతిక నిపుణులతో కూడిన భద్రతా విభాగంలో సరిపడినంత మంది సిబ్బంది లేకపోవడం, అనుభవం లేనివారే ఎక్కువగా ఉండటం వంటివీ దుర్ఘటనలకు దారి తీస్తున్నాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని తరచూ పరిశ్రమల లోపల, పరిసర గ్రామాల్లో మాక్ డ్రిల్‌ను నిర్వహించాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించి లోపాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని, అవసరమైన జాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా నష్టాల తీవ్రతను తగ్గించవచ్చు. ఆ మాక్‌డ్రిల్స్ తరచుగా జరుగుతున్నాయా, లేదా అనేది అనుమానమే.
ఇలాంటి జాగ్రత్తలను పాటిస్తూ, నిబంధనలను అనుసరిస్తున్నా... అనుకోని పరిణామాలతో ఏమైనా ప్రమాదాలు చోటుచేసుకుంటే, సాధారణంగా తక్కువ స్థాయి తీవ్రతతోనే ఉంటాయి. ప్రమాదాలు తీవ్రస్థాయిలో ఉంటేమాత్రం వాటిని ముమ్మాటికీ క్షేత్రస్థాయిలో భద్రత లోపాలుగానే పరిగణించాలి. ప్రమాదం సంభవించిన తక్షణమే పరిశ్రమల్లో సిబ్బందికి, పరిసర గ్రామాల్లో ఉండే ప్రజలకు హెచ్చరిక సంకేతం అందించేలా సైరన్ మోగుతుంది. దీన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రమాద సమయంలో ఒకవేళ సైరన్ మోగలేదంటే, ముమ్మాటికీ అది సాంకేతిక లోపం కిందకే వస్తుంది.
భద్రతా చర్యలు పాటిస్తేనే..