‘ప్రపంచాన్ని నాయకత్వ శూన్యత ఆవరించనుంది. మధ్యాదాయ దేశాలకు, ఒకమాదిరి శక్తి సామర్థ్యాలున్న రాజ్యాలకు నాయకత్వ స్థానం అందుకునే అవకాశాలు బార్లా తెరచుకోనున్నాయి. జపాన్, జర్మనీ, ఇండియా, దక్షిణాఫ్రికా వంటివి ఒకే తాటి మీదకు వచ్చి సంకీర్ణంగా ఆవిర్భవించే వాతావరణం కనిపిస్తోంది. చైనా, పాకిస్థాన్‌లకు భారత రాయబారిగా పనిచేసిన గౌతమ్ బంబవాలే వ్యాఖ్యలవి. కరోనా అనంతర పరిస్థితుల్లో కొత్త సభ్య రాజ్యాలతో కొలువుదీరే సంకీర్ణం అమెరికా, చైనాలకూ దిశానిర్దేశం చేసి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందిస్తున్నది ఆయన అభిప్రాయం. 1930ల్లో మహా మాంద్యం ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ తరవాత తిరిగి 2008లో ‘సబ్ ప్రైమ్’ సంక్షోభం మాంద్యానికి అంటుకట్టింది. పన్నెండేళ్ల క్రితం తలెత్తిన ఆ మాంద్యం దేశాల మధ్య సంకీర్ణ సంబంధాలను ఒక్క పెట్టున మార్చేసింది. ప్రపంచ ఆర్థిక దౌత్యానికి అప్పటివరకూ ఆధారశిలగా కొనసాగిన జి-8 కూటమి ప్రాధాన్యం జి-20 రాకతో మలిగిపోయింది. చైనాలాంటి దేశాలు ఆసియా మౌలిక సౌకర్యాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) వంటి వ్యవస్థలకు భారీగా నిధులు అందజేశాయి. గడచిన దశాబ్దంలో దాని ప్రాధాన్యం శాఖోపశాఖలుగా విస్తరించింది. దేశాలు ఒకదానిమీద మరొకటి ఆధారపడకపోతే వాటికి మనుగడ లేదన్న విషయాన్ని కొవిడ్ నేపథ్యంలో తలెత్తిన పరిణామాలు మరోమారు చాటిచెబుతున్నాయి.
దక్షతకు పరీక్ష
సంక్షోభం కారణంగా అందివచ్చిన అవకాశాలను భారత్ అందిపుచ్చుకుని- ప్రపంచ సంకీర్ణానికి నాయకత్వం వహించగలదా అన్నది ప్రశ్న. భారత తయారీ రంగం అనేక సవాళ్ల మధ్య ప్రస్థానిస్తోంది. పరిమిత విస్తృతి, నాణ్యత లేమి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబాటు వంటి సమస్యలు భారతీయ ఉత్పత్తి రంగాన్ని ఐరోపా, అమెరికాలతో పోల్చినప్పుడు దిగనాసిగా తేల్చేస్తున్నాయి. వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యం చైనా ప్రతిష్ఠను దారుణంగా దిగజార్చింది. కాబట్టి, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ప్రత్యామ్నాయ ఆలోచనలతో ముందుకు రావడం ఖాయం. ప్రపంచ కార్ఖానాగా పేరొందిన చైనాతో అమెరికా, ఐరోపాల్లోని బడా సంస్థలు ఉన్నపళంగా సంబంధాలు తెగతెంపులు చేసుకునే అవకాశాలు లేవు. ఆయా కంపెనీలు ప్రత్యామ్నాయాలను అన్వేషించి తమ కార్యకలాపాలను ఒకవైపు చైనాలో కొనసాగిస్తూనే మరోవంక వియత్నాం, మలేసియా, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు విస్తరించే అవకాశాలు కొట్టిపారేయలేనివి. ఇక్కడే భారత్ కొత్త అవకాశాలు ఒడిసిపట్టాల్సి ఉంది. చైనానుంచి తరలిపోవాల్సి వస్తే బహుళ జాతి కంపెనీలు ఆ స్థాయి మార్కెట్, విస్తృతి ఉన్న భారత్ వంటి దేశాలవైపే మొగ్గుచూపుతాయి. బహుళజాతి కంపెనీలకు ఆహ్వానం పలికి, వాటి కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వాలు కల్పించబోయే వెసలుబాట్లే అంతర్జాతీయ వాణిజ్య వేదికపై భారత్ స్థానాన్ని నిర్దేశించనున్నాయి. మోదీ ప్రభుత్వ దక్షతకు ఇది పరీక్ష.
కీలకం కానున్న భారత్ పాత్ర