తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా వేళ దేశీయ ఫార్మాకు సువర్ణావకాశం - India's pharmaceutical industry is a key player in the war on corona

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుతం తరుణంలో ఔషధ రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.ఈ రంగంలో భారత్‌లో జరుగుతున్న కృషి ప్రపంచానికి ఆశాకిరణమవుతోంది. కరోనాతో భారత ఔషధ పరిశ్రమ ప్రాధాన్యం ప్రపంచానికి వెల్లడయింది. అయితే ఈ ప్రాణాధార పరిశ్రమకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

pharmaceutical
ప్రాణాధార పరిశ్రమకు ప్రోత్సాహం

By

Published : May 4, 2020, 9:32 AM IST

'భారతదేశం ప్రపంచ టీకాల తయారీ కేంద్రం(వ్యాక్సిన్‌ హబ్‌)గా అవతరించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఔషధ రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచాన్ని కరోనా రహితంగా మార్చడానికి, అతి తక్కువ ధరకు టీకాను రూపొందించడానికి మరింత త్వరితగతిన రోగనిర్ధారణ కిట్ల తయారీకి కృషి చేయడానికి ఔషధరంగం ఉపక్రమించాలి'

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఔషధ పరిశ్రమల అధిపతులు, ప్రతినిధులకు చేసిన సూచనలివి. ఈ రంగంలో భారత్‌లో జరుగుతున్న కృషి ప్రపంచానికి ఆశాకిరణమవుతోంది. మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అమెరికా సహా 50కి పైగా దేశాలకు పంపిణీ చేసి భారత్‌ తన ఔదార్యాన్ని చాటుకుంది. ఇప్పుడు కరోనాను అంతం చేసే సంజీవిని కోసం అనేక దేశాలకు దీటుగా భారత్‌ ప్రయత్నాలు సాగిస్తోంది. పరిశ్రమలకు అనుమతులు, ఏర్పాటు, నిర్మాణాలు, ఉత్పత్తుల విక్రయాలు, మార్కెట్లో నిలదొక్కుకోవడం, ఎగుమతుల సాధన, ఇతర దేశాల నుంచి పోటీ వంటివి ఔషధ రంగానికి సవాలుగా మారాయి. కాలుష్య సంబంధిత అనుమతులు, సమస్యలతో ఉన్నవాటిని నడపడం, కొత్తవి ప్రారంభించడం క్లిష్టమవుతోంది. గతంలో నగరాలు, పట్టణాలకు దూరంగా పరిశ్రమలు నెలకొల్పారు. వాటిచుట్టూ ఇప్పుడు నివాస ప్రాంతాలు ఏర్పడటంతో పరిశ్రమల తరలింపు అనివార్యంగా మారింది. మరోవైపు ఎగుమతుల పరంగానూ ఇబ్బందులు తప్పడం లేదు. నాణ్యతాప్రమాణాల్లో విదేశాల్లో పరీక్షలను ఎదుర్కొంటోంది. ముడిసరకుల లభ్యతా సమస్యగా ఉంది. ఇప్పటికీ వీటి కోసం చైనాపై ఆధారపడుతోంది. భారతదేశ ఔషధ ముడిసరకుల వార్షిక దిగుమతులు 350 కోట్ల డాలర్లు. ఇందులో 70 శాతం చైనా నుంచే వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల ముద్ర

కరోనాపై టీకాను తయారుచేయడానికి పోటీ పడుతున్న ఆరు కంపెనీల్లో మూడు తెలంగాణకు చెందినవి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఔషధ రంగంలో పురోగమిస్తోంది. తెలంగాణలో 800కు పైగా ఔషధ, బయోటెక్‌, వైద్య సాంకేతిక, పరికరాల తయారీ పరిశ్రమలున్నాయి. వీటి మొత్తం విలువ 5,000 కోట్ల డాలర్లు. రాబోయే దశాబ్దంలో 10 వేలకోట్ల డాలర్లకు పరిశ్రమను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జాతీయ ఔషధ ఉత్పత్తుల్లో 40శాతం వాటా కలిగి ఉన్న రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా టీకాల్లో మూడోవంతును ఇక్కడే ఉత్పత్తి చేస్తోంది. ఆసియాలోని అతిపెద్ద బయోటెక్‌ పరిశోధన, అభివృద్ధి కేంద్రమైన జినోమ్‌ వ్యాలీ హైదరాబాద్‌లోనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఔషధ ఉత్పత్తుల సముదాయం ఔషధనగరిని 19 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. సమస్త ఔషధ, వైద్య ఆరోగ్య ఉత్పత్తులు, పరికరాలు, సాంకేతికతలకు దీన్ని కేంద్రం చేయాలని భావిస్తోంది. దీంతో పాటు 270 ఎకరాల్లో జీనోమ్‌ వ్యాలీ2.0 రానుంది. వైద్య పరికరాల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన పార్కులో 19 సంస్థలు ఉత్పత్తులను ప్రారంభించాయి. కరోనా నేపథ్యంలోతెలంగాణ రాష్ట్రం మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు, వెంటిలేటర్ల తయారీని పెద్దయెత్తున ప్రోత్సహిస్తోంది. నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ జిల్లాలోని 1,531 ఎకరాల్లో గల జవహర్‌లాల్‌ నెహ్రూ ఔషధ నగరి ఈ రంగం అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. 60కి పైగా సంస్థలు ఇక్కడ ఉత్పత్తుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఔషధాల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోని మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ సైతం మాస్క్‌లు, వ్యక్తిగత రక్షణ కిట్లు, వెంటిలేటర్ల తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

అంతర్జాతీయ విపణిలో...

దేశీయ ఔషధ మార్కెట్‌ విలువ 2018లో రూ.1,29,015 కోట్లకు చేరుకుంది. హైదరాబాద్‌, ముంబయి, హిమాచల్‌ ప్రదేశ్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, వడోదర, అంకలేశ్వర్‌, సిక్కిమ్‌లు దేశంలో ప్రధాన ఔషధ ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి. ఐడీపీఎల్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలు మందుల ఉత్పత్తికి ఉపక్రమించాయి. ప్రపంచ ఔషధ రంగంలోనూ భారత్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. తక్కువ ఖర్చుతో అధికోత్పత్తులు సాధిస్తూ అంతర్జాతీయ విపణిలో సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది. యాంటీబయాటిక్స్‌, నొప్పి నివారణ మందులు, క్షయ ఔషధాలు, విటమిన్‌ బి12 వంటివాటికి గిరాకీ ఉంది. ప్రస్తుతం అతిపెద్ద ఔషధ, జనరిక్‌ సరఫరాదారుగా భారత్‌ గుర్తింపు పొందింది. అమెరికాలో 40 శాతం, బ్రిటన్‌లో 25 శాతం ఔషధాలు భారత్‌లో తయారైనవే. దక్షిణాఫ్రికా, రష్యా, నైజీరియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, జర్మనీ సహా 85 దేశాలకు మందులు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. ఈ రంగంలో నమోదైన 56,922 పరిశ్రమల ద్వారా మూడున్నర కోట్లమందికి ఉపాధి లభిస్తోంది.

కరోనాతో భారత ఔషధ పరిశ్రమ ప్రాధాన్యం ప్రపంచానికి వెల్లడయింది. ఇక్కడి ఔషధాలకు భారీగా గిరాకీ ఏర్పడింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, పారాసిటమాల్‌ వంటి ఔషధాలకు డిమాండ్‌ పెరిగింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ మొత్తంగా ఔషధాల అమ్మకాలు 8.9శాతం, హృద్రోగ మందులు 19.8శాతం, మధుమేహ మందులు 18.2శాతం వృద్ధిని నమోదు చేశాయి. కరోనా నేపథ్యంలో శ్వాసకోస మందుల అమ్మకాల్లో 23శాతం వృద్ధి నెలకొంది. ఔషధ పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి మినహాయించింది. పరిశ్రమల నిర్వహణ, ఉద్యోగుల సేవలు, వస్తు ఉత్పత్తుల రవాణాకు అవకాశాలు కల్పించింది. మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఔషధ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ముందుకొచ్చింది. దేశీయ ముడిపదార్థాల పెంపుదలకు అవసరమైన ప్రాజెక్టులో 25శాతం పెట్టుబడులకు అంగీకరించింది

టీకా తయారీ సన్నాహాల్లో...

ప్రపంచవ్యాప్తంగా 83 సంస్థలు కరోనా టీకా తయారీకి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో ఆరు భారత్‌కు చెందినవి. ‘భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఇ, ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌, జైడ్యూస్‌ క్యాడిల్లా, మైన్‌వాక్స్‌, సెరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ ఇప్పటికే సన్నాహాల్లో ఉన్నాయి. ప్రపంచానికి వీలైనంత త్వరగా టీకా అవసరం ఉంది. ఇది దేశీయ ఔషధ రంగానికి సువర్ణావకాశం. ఇప్పటికే భారత్‌ పోలియో, బీసీజీ, న్యుమోనియా, రోటావైరస్‌, రూబెల్లా తదితర టీకాల ఉత్పత్తితో ఖ్యాతి సాధించింది. కరోనా నివారణకే కాకుండా ఇతర ఔషధాల ఉత్పత్తిపై ఈ రంగం దృష్టి సారించాలి. నూతన పరిశోధనలు, ఆవిష్కరణలకు పెద్దపీట వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందించాలి. పన్ను మినహాయింపులతో పాటు ఇతర అంశాల్లోనూ సాయం అందించాలి. స్వల్పకాలిక చర్యలతో పాటు పరిశ్రమ స్వావలంబనకు కృషి చేయాలి. పర్యావరణ సమస్యలను పరిష్కరించాలి. కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు అవసరం. దేశీయంగా తయారు చేసే ముడి పదార్థాల పరిమాణం పెరగాల్సి ఉంది. ఆరోగ్య రంగంలో అపసవ్య పోకడలు ప్రజలకు శాపమవుతున్నాయి. జబ్బుపడితే చికిత్స ప్రియంగా మారింది. రుసుములకు తోడు రోగ నిర్ధారణ పరీక్షలు, ఔషధాల ఖర్చు తడిసిమోపెడవుతోంది. పేదవారి ఇల్లు గుల్లవుతోంది. ఔషధాలు తక్కువ ధరకే అందించేలా సాంకేతికతను వినియోగించి, ప్రజారోగ్య వ్యవస్థకు కొత్త ఊపిరులూదాలి.

- ఆకారపు మల్లేశం

ABOUT THE AUTHOR

...view details