కోటి పరీక్షల మైలురాయి దాటిన ఇండియాలో కరోనా మహమ్మారి రోజూ దాదాపు పాతిక వేల కొత్త కేసులతో బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికి రమారమి ఏడు లక్షల కేసులు, 20 వేల మరణాలతో దేశవ్యాప్తంగా కొవిడ్ మృత్యుఘంటికలు మోగిస్తున్నా- కరోనా కోరలకు చిక్కి కోలుకొన్న వారి సంఖ్య 60 శాతానికి పైబడిన వైనమే సాంత్వన కలిగిస్తోంది. 14 రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య తలా పదివేలు దాటిపోగా, మహారాష్ట్ర ఒక్కటే రెండు లక్షల పైచిలుకు బాధితులతో పెను సంక్షోభ కేంద్రంగా మారింది. తమిళనాడు లక్ష కేసుల మార్కు దాటడం, దేశ రాజధాని సైతం దాని వెన్నంటే ఉండటం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు జోరెత్తుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఉరుములేని పిడుగులా ఊడిపడి మానవాళి బతుకును, భవితను దుర్భర దుఃఖభాజనం చేస్తున్న కరోనాను మట్టుపెట్టే మందూమాకూ కోసం దేశదేశాల్లో ప్రయోగాలు విస్తృతంగా సాగుతున్నాయి.
సోమవారం నుంచి క్లినికల్ ట్రయల్స్..
ఫ్లూ నివారణకు జపాన్ ఔషధం ఫాబీఫ్లూ, ఎబోలా కట్టడి కోసమంటూ కనిపెట్టిన రెమ్‌డెసివిర్, మలేరియా బాధితులకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందులతో కరోనా బాధితులకు సాంత్వన కలిగించే ప్రయత్నాలు సాగుతున్న వేళ- ఇండియాలో కొవిడ్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరాయి. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవ్యాక్సిన్‌కు సంబంధించిన మానవ క్లినికల్ పరీక్షల్ని సోమవారం నుంచి చేపట్టనున్నట్లు నిమ్స్ ప్రకటించింది. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)ల సహకారంతో అభివృద్ధి చేసిన కొవ్యాక్సిన్‌ను అన్ని పరీక్షలూ పూర్తిచేసి ఆగస్టు 15కల్లా సిద్ధం చేయాలని ఐసీఎంఆర్ లేఖ రాయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సురక్షిత, ప్రభావాన్విత వ్యాక్సిన్ సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి రావాలనడంలో మరోమాట లేకపోయినా- శాస్త్రీయ పరీక్షా ప్రమాణాల విషయంలో రాజీ అనర్థదాయకమవుతుంది!
ఏడాది ఆగాల్సిందేనా..
కొవిడ్‌కు కొరత వేసే వ్యాక్సిన్ల తయారీకి ఏడు భారతీయ సంస్థలు పరిశ్రమిస్తుండగా- భారత్ బయోటెక్, జైడస్ క్లాడిలా సంస్థల పరిశోధనలే మనుషుల్లో వాటి పనితీరు పరీక్షలకు అనుమతులు పొందాయి. ప్రపంచవ్యాప్తంగా పన్నెండుకుపైగా వ్యాక్సిన్లు మనుషులపై వివిధ ప్రయోగదశల్లో ఉన్నాయని, వాటిలో కొన్ని ప్రాథమిక దశల్లో రాణించినా, వాణిజ్యపర వినియోగానికి అనుమతులు దక్కలేదని వార్తాకథనాలు చాటుతున్నాయి. చైనా తాను అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లలో ఒకదాన్ని తొలి రెండుదశల పరీక్షలు పూర్తికాగానే- ఒక ఏడాదిపాటు ప్రత్యేకంగా సైన్యం వినియోగానికే దాన్ని పరిమితం చేసిందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చెబుతున్నారు. మూడోదశ పరీక్షలూ పూర్తి అయ్యాకే వ్యాక్సిన్‌ను ప్రజా వినియోగానికి తీసుకురావాల్సి ఉంటుందన్న శాస్త్రవేత్తలు- మొత్తమ్మీద కనీసం 12-18 నెలల సమయం పడుతుందని స్పష్టీకరిస్తున్నారు.
జాప్యం నివారించి.. ముందుకు సాగాలి
మనుషుల్లో మూడు దశల ప్రయోగాల పరిపూర్తికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయమన్నా ఉండితీరాలన్న దానికి సీసీఎంబీ సంచాలకులూ ఓటేస్తున్నారు. వ్యాక్సిన్ సామర్థ్యం దాని సురక్షిత స్థాయి నిగ్గుతేలేలా వైరస్ సోకే అవకాశం ప్రబలంగా ఉన్న ప్రాంతాలు, బృందాల్లో పరీక్షలు చేసి తక్కువ సమయంలో అవసరమైన సమాచారాన్ని సమీకరించాలంటున్న శాస్త్రవేత్తలు- అది విజయవంతమయ్యాక తయారీ పంపిణీ వంటి తదుపరి చర్యల్ని ముందస్తు ప్రణాళికతో వేగవంతం చెయ్యాలంటున్నారు! వివిధ దశల్లో అనుమతుల జాప్యాన్ని నివారించి, త్వరితగతిన పరీక్షల దశను పూర్తికావించాలన్న ఉద్దేశంతోనే హడావుడి పెట్టినట్లు మాటమార్చిన ఐసీఎంఆర్- కొవిడ్‌పై పోరాటంలో తన సారథ్య బాధ్యతను మరింత జాగ్రత్తగా నిర్వర్తించాలి. వ్యాక్సిన్‌పై ఆశే మానవాళి శ్వాసగా మారిన వేళ- భారతావని పరిశోధనలకు సరైన మార్గ నిర్దేశం చేయాలి!
ఇదీ చూడండి:ఖలిస్థాన్ వేర్పాటు వాదంపై కేంద్రం కన్నెర్ర