తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సంస్కృతీ సంప్రదాయాల్లో విలువైన ఆరోగ్య సూత్రాలు!

శుచి శుభ్రతలను ఆచారాలుగా రూపొందించిన జాతి మనది. రకరకాల ఆభరణాలతో, లేపనాలతో దేహాన్ని ముస్తాబు చేయడం మన సంస్కృతి. సౌందర్య ఆపేక్ష ఒకటే కాదు- ఈ సంస్కృతీ సంప్రదాయాల (Indian Culture and Tradition) నడుమ విలువైన ఆరోగ్య సూత్రాలను, ఆధ్యాత్మిక సమన్వయాలను ఇమిడ్చింది.

indian culture
భారతీయ సంస్కృతి

By

Published : Oct 24, 2021, 5:47 AM IST

దేహాన్ని దేవాలయంగా నిర్వచించిన జాతి మనది. శుచి శుభ్రతలను ఆచారాలుగా రూపొందించింది. రకరకాల ఆభరణాలతో, లేపనాలతో దేహాన్ని ముస్తాబు చేయడం మన సంస్కృతి. సౌందర్య ఆపేక్ష ఒకటే కాదు- ఈ సంస్కృతీ సంప్రదాయాల (Indian Culture and Tradition) నడుమ విలువైన ఆరోగ్య సూత్రాలను, ఆధ్యాత్మిక సమన్వయాలను ఇమిడ్చింది. 'శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం.. ధర్మ నిర్వహణ కోసం దక్కిన అమూల్య సాధనమే ఈ దేహం' అని పెద్దలు మనకు నూరిపోశారు. సదాచారాల నీడలో నిండు నూరేళ్లు చల్లగా జీవించడానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించారు. అది కూడా ఏదో జీవచ్ఛవంలా కాదు, పరిపూర్ణ జీవకళతో- జీవేమ శరదశ్శతం మోదామ శరదశ్శతం.. అని చెబుతూ దుఃఖ రహిత జీవన కళ(ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌)ను ప్రబోధించారు. గడపడాన్ని కాదు- జీవించడాన్ని నేర్పించారు. 'క్షమయు సత్యంబు కృపయు శౌచమును(పరిశుభ్రత) ఆయువు పొలుపునిచ్చు...' ఆయుర్దాయాన్ని పెంచుతాయని భారతం ఆనుశాసనిక పర్వం (Indian Culture and Health) సూచించింది. 'అయుక్తమును, అపథ్యమునగు భోజనములు, అలుక బొంకు క్రూరత శుచితాపగమము...' ఆయువును క్షీణింపజేస్తాయి సుమా అని హెచ్చరించింది. శుచితాపగమమంటే- పరిశుభ్రతను పాటించకపోవడం. వీటివల్లే మనిషి అల్పాయుష్కుడు అవుతాడని మహాభారతం పేర్కొంది. పద్ధతిగా జీవించేవారికి అనారోగ్యం దరిచేరదు. వారికి శరీరంపై ధ్యాసే ఉండదు. అందుకే 'ఆరోగ్యం' అనే మాటకు శాస్త్రం- 'నీ ఒళ్లు నీకు తెలియకపోవడం' అని తేల్చి చెప్పింది. రోగం వస్తేనే ఒళ్లు తెలుస్తుంది.

భోజుడి రచనగా పండితులు భావిస్తున్న 'చారుచర్య' గ్రంథం- సదాచార విధానాలకు అద్దం పట్టింది. అన్నం తినడం ఎలాగో, స్నానం చేయడం ఎలాగో.. ఆఖరికి తిన్నాక చేతులు కడుక్కోవడం ఎలానో కూడా చెప్పిందా గ్రంథం. 'కుడిచిన పిమ్మట చేతులు తుడిచి నియతివార్చి.. భుక్త్యాతు మధితం సమ్యక్‌ కరాభ్యాం చ విశేషతః' శుభ్రం చేసుకొన్న రెండు చేతులను గట్టిగా రుద్దుకోవాలట. ఆ తడిని చిరు వెచ్చదనాన్ని కళ్లకు అదిమిపెడితే- 'పొడమగ రావు అక్షి(కంటి) రోగములు' అని సూత్రీకరించింది. 'ఉష్ణవారి చేయన్‌ కడు నొప్పు నాల్గు గడియల్‌ జలకంబు... 'హడావుడిగా నాలుగు చెంబులు దిమ్మరించుకోవడం కాదు- నాలుగు గడియల పాటు గోరువెచ్చని నీటిలో తృప్తిగా జలకాలాడాలి అన్నాడు భోజుడు. 'నదియందు గ్రుంకిన అత్యుత్తమోత్తమంబు.. నద జలంబునందు ఉత్తమంబు.. నదీ జలాల్లో స్నానం మేలు... పడమర దిశగా ప్రవహించే నదాలలో కన్నా- తూర్పుదిశగా పారే నదులలో స్నానం మరింత శ్రేష్ఠం' అంది శాస్త్రం. అంతే కాదు, నదీస్నానం చేసేటప్పుడు నిర్మల హృదయంతో ఆ జల ప్రవాహాన్ని 'విష్ణు రూపముగ భావన చేసి కృతావగాహ తత్పరుడగు పుణ్యపూరుషుడు ధన్యుడగున్‌' అని విష్ణుపురాణం చెబుతోంది. 'అత్యంత మలినః కాయో నవచ్ఛిద్ర సమన్వితః శరీరానికి గల తొమ్మిది రంధ్రాల నుంచీ మాలిన్యాలు రాత్రి అంతా స్రవిస్తూనే ఉంటాయి. 'ప్రాతఃస్నానమున చేసి తొమ్మిది చిల్లుల దొరగుచున్న ఏహ్యంబు పట్టగు ఈ మేను శుచియగు...' ఉదయ స్నానంతో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి అని చారుచర్య నిర్దేశించింది. స్నానం సంగతి అలా ఉంచి, ప్రపంచవ్యాప్తంగా 230 కోట్లమందికి- చేతులు శుభ్రం చేసుకొనేందుకు కనీస సౌకర్యాలైనా లేవని యునిసెఫ్‌ పరిశోధనలో తేలింది. కరోనా రోజుల్లో ఇది మరింత ప్రమాద హేతువని ఐరాస బాలల సంస్థ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీనాథుడు చెప్పినట్లు 'దోసెడు కొంపలో పసుల తొక్కిడి... దూడ రేణమున్‌(పేడ), పాసిన వంటకంబు, పసిబాలుర శౌచము...' తదితరాలతో కునారిల్లే వెనకబడిన దేశాల పూరికొంపల సంగతి ఇక చెప్పేదేముంది?

ఇదీ చూడండి:చేతుల్లోనే ఆరోగ్యం.. పరిశుభ్రతే దివ్య ఔషధం

ABOUT THE AUTHOR

...view details