తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రాలు- రుణ భారం ప్రజలపైనే

Indian states debt: దేశంలోని పెద్ద రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోయాయి. కొవిడ్ అనంతరం వ్యయాలు భారీగా పెంచాల్సి రావడం అప్పులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే, పెరిగిన వ్యయంలో వైద్య రంగంపై వెచ్చిన మొత్తం స్వల్పమే అని స్పష్టమవుతోంది. జనాకర్షక పథకాలపై ఖర్చు చేస్తే, తీసుకున్న అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురవుతుంది. ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎగవేస్తే, అంతిమంగా నష్టపోయేది ప్రజలే.

indian states debt 2021
పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రాలు- రుణ భారం ప్రజలపైనే

By

Published : Dec 15, 2021, 6:43 AM IST

Indian states debt:దేశంలో పది పెద్ద రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయని వాటి ఆర్థిక స్థితిగతులపై రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన రెండు నివేదికలు వెల్లడించాయి. పెద్ద రాష్ట్రాలు ఆర్థికంగా చిక్కుల్లో పడితే దాని ప్రభావం పొరుగు రాష్ట్రాల మీద, చివరకు యావత్‌ దేశంపైనా పడుతుందని గుర్తుంచుకోవాలి. రాష్ట్రాల సమాఖ్యే భారతదేశం. కొవిడ్‌ మహమ్మారి రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసిన మాట నిజం. కరోనా తొలి, మలి దశల వ్యాప్తివల్ల లాక్‌డౌన్‌లతో సహా, పలు ఆంక్షలు అమలై... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు గండి పడింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదాయ నష్టం అనుకున్నంత భారీగా లేకపోవడం. వీటి ఆదాయం 2019-20లో రూ.26.70 లక్షల కోట్లు; కరోనా సంక్షోభం తలెత్తిన 2020-21లో రూ.26.25 లక్షల కోట్లు. అంటే, కొవిడ్‌ వల్ల రూ.45,000 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయాయి. ఇది సంబరపడాల్సిన విషయం కాకపోయినా- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పన్నులను, పన్నేతర ఆదాయాలను పెంచుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోగలిగాయి.

Debt of indian states 2021 list

Top 10 debt states in india 2021

గడచిన రెండేళ్లలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఎక్కువ ఆర్థిక సహాయం లభించింది. దీనివల్ల కేంద్రానికి ఆదాయంకన్నా ఖర్చులు ఎక్కువయ్యాయి. ఫలితంగా విత్తలోటు, రెవిన్యూ లోటు, ప్రాథమిక లోటు పెరిగిపోయాయి. 2019-20లో రూ.5.24 లక్షల కోట్లుగా ఉన్న స్థూల విత్తలోటు 2020-21 వచ్చేసరికి రూ.8.18 లక్షల కోట్లకు పెరిగింది. మరో విధంగా చెప్పాలంటే 5.25శాతం నుంచి 8.19 శాతానికి పెరిగింది. 2007-12 మధ్యకాలంలో స్థూల విత్తలోటు సగటున 1.48 శాతం; 2012-17 మధ్య అది 3.47 శాతానికి హెచ్చింది. ఇప్పుడది ఏకంగా ఎనిమిది శాతాన్ని దాటిపోయింది. కొవిడ్‌ మహమ్మారి సంక్షోభం ముగిసిన తరవాత ఈ లోటును అధిగమించడానికి ప్రభుత్వం ప్రజల మీద పన్నులు పెంచడం, సంక్షేమ, అభివృద్ధి వ్యయాలను తగ్గించుకోవడం వంటివి తప్పవు. కొవిడ్‌ వల్ల ప్రజల ఆదాయాలు పడిపోయి వస్తుసేవల వినియోగం తగ్గింది. దాంతో గిరాకీ లేక పెట్టుబడులూ తగ్గి ఉపాధి అవకాశాలు అడుగంటాయి. ఈ చిక్కు స్థితిని అధిగమించడానికి ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచక తప్పలేదు. 2019-20లో రూ.32.52 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల వ్యయం 2020-21లో రూ.42.95 లక్షల కోట్లకు పెరిగినట్లు అంచనా. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ వ్యయం రూ.26.85 లక్షల కోట్ల నుంచి రూ.34.83 లక్షల కోట్లకు పెరిగింది. అంటే కేంద్రం కన్నా రాష్ట్రాల వ్యయమే ఎక్కువైంది. కొవిడ్‌ కాలంలో రాష్ట్రాలు ప్రజారోగ్యంపైన ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడమే దీనికి కారణమనుకుంటే పొరపాటు. 2019-20లో వైద్యం, ప్రజారోగ్య రంగాలపై రాష్ట్రాల వ్యయం 12.5శాతం; 2020-21లో అది స్వల్పంగా పెరిగి 13శాతానికి చేరుతుందని అంచనా. కొవిడ్‌ వల్ల కుదేలైన కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్రాలు చేసింది స్వల్పమేనని దీన్నిబట్టి అర్థమవుతోంది.

fiscal deficit of indian states

fiscal deficit india

కొవిడ్‌వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దయెత్తున అప్పు చేసి తెచ్చిన డబ్బు మౌలిక వసతుల కల్పనకు కానీ, అభివృద్ధి పథకాలకు కానీ వెచ్చించలేకపోయాయి. ఫలితంగా ఆస్తుల సృష్టికి బదులు అప్పుల కొండ మరింత పెరిగిపోయింది. 2019 మార్చిలో రాష్ట్రాలు చెల్లించాల్సిన రుణ బకాయిలు రూ.47.86 లక్షల కోట్లు; 2022 మార్చికల్లా అవి రూ.69.47 లక్షల కోట్లకు పెరగనున్నాయి. దీనికి తగ్గట్లు పన్నుల ద్వారా రాష్ట్రాల ఆదాయం పెరగకపోవడం ఆందోళనకరం. మరోవైపు పాత, కొత్త రుణాలపై వడ్డీ భారం నానాటికీ పెరిగిపోతోంది. 2019-20తో పోలిస్తే 2020-21లో పెద్ద రాష్ట్రాల్లో వెనకబడిన జాబితాలోని బిహార్‌, ఒడిశాలకు మాత్రమే వడ్డీ భారం తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలపై వడ్డీ భారం తడిసి మోపెడు కానుంది. నిర్ణీత వ్యవధిలో రుణ చెల్లింపులు జరుపుతామని రాష్ట్రాలు హామీ ఇస్తుంటాయి. 2019తో పోలిస్తే 2022లో అలాంటి హామీల భారం పంజాబ్‌, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చాలా ఎక్కువ కానున్నది. పంజాబ్‌ విషయంలో ఈ భారం రూ.4,778 కోట్ల నుంచి రూ.28,217 కోట్లకు, బిహార్‌ విషయంలో రూ.5,397 కోట్ల నుంచి రూ.20,733 కోట్లకు, ఆంధ్రప్రదేశ్‌ విషయంలో రూ.54,252 కోట్ల నుంచి రూ.91,330 కోట్లకు పెరుగుతుంది. రాష్ట్రాలు- బ్యాంకులు, బీమా సంస్థలు, భవిష్య నిధి, మ్యూచువల్‌ ఫండ్‌ల నుంచి రుణాలు తీసుకొంటాయి. ఈ సంస్థల వద్ద ఉన్న ప్రజల సొమ్ము రాష్ట్ర ప్రభుత్వాలకు రుణ రూపంలో అందుతోంది. ప్రభుత్వాలు ఈ అప్పులతో ఆస్తులు సృష్టించి, ఉత్పత్తి పెంచినంత వరకు రుణ చెల్లింపులు కష్టం కాబోవు. అలాకాకుండా జనాకర్షక పథకాలపై ఖర్చు చేస్తే, తీసుకున్న అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురవుతుంది. ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎగవేస్తే, అంతిమంగా నష్టపోయేది ప్రజలే. దీన్ని నివారించడానికి కేంద్రం నిధులు సమకూర్చినా, చివరకు ఆ నిధులను అధిక పన్నుల రూపంలో మళ్ళీ ప్రజల నుంచే వసూలు చేయకతప్పదు. ఇలా ఎటు చూసినా నష్టపోయేది ప్రజలే. కాబట్టి రాష్ట్రాలు తీసుకునే రుణాలపైన, తీర్చాల్సిన రుణ బకాయిలపైన కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అనుసరించాలి. ఇవాళ సబ్సిడీలు అందుతున్నాయని పౌరులు సంబరపడితే, రేపు ఆ సబ్సిడీలకు అధిక పన్నుల రూపంలో మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.

దీర్ఘకాలంలో ఎదురయ్యే సమస్యలివే...

కొవిడ్‌ ముందుకాలం(2018-19)తో పోలిస్తే తరవాతి సంవత్సరంలో అభివృద్ధేతర వ్యయం భారీగా పెరగడం దీర్ఘకాలంలో పెను సమస్యలు తెచ్చిపెట్టనుంది. పాత రుణాలపై వడ్డీ చెల్లింపులు 23శాతం పెరిగితే, పౌరులకు ప్రభుత్వ సేవలు అందించడానికయ్యే ఖర్చు 35శాతం, రాష్ట్రాలకు పెన్షన్‌ చెల్లింపుల వ్యయం 23శాతం చొప్పున పెరిగాయి. కొవిడ్‌ వచ్చినా రాకున్నా రుణాలపై వడ్డీ చెల్లింపుల నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. ఉద్యోగులకు జీతాలు, పింఛన్ల చెల్లింపు తప్పనిసరి. రుణాలపై వడ్డీ చెల్లింపు రుణ ఒప్పందం ప్రకారం నెరవేర్చాల్సిన బాధ్యత. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు పొందడం ఒక హక్కు తప్ప, ప్రభుత్వం ఉదారంగా చేసే సహాయం కాదు.

(డాక్టర్ ఎస్ అనంత్; రచయిత- ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details