కాళ్లాగజ్జా కంకాళమ్మా- వేగూచుక్క వెలగామొగ్గ- మొగ్గా కాదు మోదుగ నీరు.. తెలుగింటి ఆడపిల్లలు తరతరాలుగా ఆడుకుంటూ పాడుకునే ఈ పాట నిజానికి ఓ మందుల మూట! కచ్చూరాయి (కంకాళమ్మ), బావంచాలు (వేగులచుక్క), పాదరసం (వెలగ మొగ్గ) కలిపి చేసే లేపనంతో చర్మవ్యాధి చింతను బాపుకోవచ్చన్నది దాని అంతరార్థం. పాదరసానికి మారుగా మోదుగ మొదలైన నవవిధ మూలికలతోనూ మందును సిద్ధం చేసుకోవచ్చనే ఔషధ పాఠం ఈ గీతం!
'చెమ్మా చెక్కా చారడేసి మొగ్గా' వంటి ఆటలూ పాటల నుంచి 'పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డే మందు' లాంటి సామెతలతో ఎన్నో జబ్బులకు విరుగుళ్లను పండిత పామరులకు కంఠోపాఠం చేసిన ఘన వారసత్వం మనది. రెండున్నర వేల ఏళ్లకు పైబడిన భారతీయ వైద్య చరిత్ర ప్రపంచమంతటికీ దారిదీపమైంది. వ్యాధి నిర్ధారణ, నివారణలపై లోతైన చర్చ చేసిన 'చరక సంహిత'; 1120 వ్యాధులు, 700లకు పైగా మూలికలు, శస్త్రచికిత్సల సమాచారాన్ని గుదిగుచ్చిన 'సుశ్రుత సంహిత' వంటి వైద్యగ్రంథాలు జాతికి వెలకట్టలేని సంపదలయ్యాయి. విదేశీయులనూ అబ్బురపరచాయి.
భారత్ ప్రపంచానికే మార్గదర్శి
ఆయుర్వేదం, సిద్ధ, హోమియోపతి, యునాని తదితర చికిత్సావిధానాలు శతాబ్దాలుగా మన సమాజానికి స్వస్థత చేకూరుస్తున్నాయి. వాటి పరంపరను పుణికి పుచ్చుకొన్నట్లుగా పేర్కొంటున్న కృష్ణపట్నం ఔషధాన్ని ఆశాదీపంగా కళ్లకద్దుకుంటున్న కొవిడ్ బాధితులతో నెల్లూరు జిల్లాలోని చిన్న జనపదం జనసంద్రమవుతోంది. ఆ మందు హానికరం కాదని తేల్చిన నిపుణులు, దాని వినియోగంపై అభ్యంతరమేదీ లేదంటున్నారు. రోగులపై ఆ ఔషధ ప్రభావాన్ని శాస్త్రీయంగా నిగ్గు తేల్చి- మెరుగైన ఫలితాలొస్తే ప్రజలకు దాన్ని విరివిగా అందించడం ఇక ప్రభుత్వాల వంతు! 'సంప్రదాయ వైద్య పద్ధతుల దన్నుతో అతి తక్కువ వ్యయంతో సంపూర్ణ ఆరోగ్య సేవలందించడంలో భారత్ ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తుంది.. ప్రాచీన వైద్య విధానాలను ప్రోత్సహించడం మా ప్రభుత్వ ప్రాధాన్యాంశం' అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యల స్ఫూర్తి- కొవిడ్‌తో వ్యాకులభరితమైన భారతావని కోసం ప్రత్యామ్నాయ వైద్యవనరులను సిద్ధంచేయడంలో కొరవడటమే విస్మయపరుస్తోంది.