తెలంగాణ

telangana

ETV Bharat / opinion

1947 నుంచి ఇప్పటివరకు స్వేచ్ఛాభారతంలో ఎన్ని మార్పులో - ఇండియా 1947

డెబ్భై ఐదేళ్ల స్వేచ్ఛాభారతం మనది. ఈ స్వేచ్ఛ విలువనీ అది సాధించిన ప్రగతినీ అర్థం చేసుకోవాలంటే దాన్ని పోగొట్టుకున్ననాటి పరిస్థితి ఏమిటో తెలియాలి. భారతదేశాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలించాయని చదువుకున్నాం. ఎక్కడ, ఎప్పుడు, ఏ వంశం అధికారంలో ఉన్నా అన్ని రాజ్యాలూ అంతిమంగా ప్రజాశ్రేయస్సుకీ స్వాతంత్య్రానికీ విలువ ఇచ్చాయి. కాబట్టే 1750లో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో 25శాతం వాటా భారత దేశానిదైంది. ప్రపంచదేశాలన్నీ ఈ దేశంతో వాణిజ్యం కోసం పోటీపడేవి. అంతటి అపారసంపదకు నెలవైన దేశం పరాయి పాలనలోకి వెళ్లిన ఫలితంగా స్వాతంత్య్రం వచ్చేనాటికి దాని వాటా కేవలం రెండు శాతానికి పడిపోయింది. వనరులన్నీ దోపిడీకి గురికాగా నాడు దుర్భర దారిద్య్రంలో మిగిలిన దేశమే నేడు ప్రపంచంలోనే కొనుగోలు శక్తిలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడింది. రండి ఆసక్తికరమైన ఆనాటి నేటి పరిస్థితులను ఓసారి పరిశీలిద్దాం.

changes-in-india-from-1947-to-2022
changes-in-india-from-1947-to-2022

By

Published : Aug 14, 2022, 7:53 AM IST

  • 1947... ఒకవైపు పోరాడి గెలుచుకున్న స్వాతంత్య్రం... మరోపక్క ఎటు చూసినా పేదరికం...
  • అది... గాలివానలో చిగురుటాకులా కంపిస్తున్న స్వేచ్ఛా భారతం.
  • 2022... ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం... ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి...
  • ఇది... విశ్వవేదిక మీద సుస్థిర స్థానాన్ని పదిలపరుచుకున్న ఆత్మనిర్భర భారతం.
  • ఏడున్నర దశాబ్దాల్లో ఎంత మార్పు..!

నిజానికి ఆనాడు ఈ దేశం ముందున్న సవాళ్లు ఎన్నో. పరిణతి గల విద్యావేత్తలూ దూరదృష్టి గల నేతలూ ప్రజావసరాలకు అనుగుణంగా పరిశ్రమలను నెలకొల్పిన వ్యాపారవేత్తలూ స్వావలంబనకు బాటవేసిన శాస్త్రవేత్తలూ... అందరూ కలిసి ఒక్కటొక్కటిగా సమస్యలను పరిష్కరించారు.

  • ఐదు వందలకు పైగా ఉన్న చిన్న రాజ్యాలన్నిటినీ కలిపేసి సువిశాల భారతావనికో చక్కని రూపమిచ్చారు.
  • ప్రచ్ఛన్నయుద్ధంతో కుతకుతలాడుతున్న అగ్రరాజ్యాల జోలికి పోకుండా అలీన విధానంతో ప్రపంచదేశాల మనసు దోచారు.
  • అణుపరీక్షలైనా అంతరిక్ష పరిశోధనలైనా ఆర్థిక సంస్కరణలైనా... ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగారు.
  • నాటి 36 కోట్ల జనాభా నేడు 138 కోట్లయింది. ఐదుకోట్ల టన్నులుగా ఉన్న ఆహారధాన్యాల ఉత్పత్తి 30 కోట్ల టన్నులు దాటింది.
  • స్వాతంత్య్రం వచ్చాక ప్రధాన రంగాల్లో మన ప్రయాణం ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే...

ఆకలి రాజ్యం నుంచి అన్నపూర్ణగా...
1974... స్వాతంత్య్రం వచ్చి పాతికేళ్లు దాటింది. అయినా 58 కోట్ల జనాభాకి చాలినంత ఆహారం దేశంలో లేదు. రుతుపవనాలు సహకరించలేదు, చమురు ధరలు పెరగడంతో ఎరువులూ లేవు... వెరసి ధాన్యం ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. మరి ప్రజల ఆకలి తీర్చేదెలా..? అప్పటికే బ్రిటన్‌, కెనడా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, సోవియట్‌ యూనియన్‌... ఇలా పలు దేశాలనుంచి ధాన్యం దిగుమతి చేసుకున్నాం. అమెరికా నుంచి అయితే 1950-70 మధ్య ఏకంగా పది బిలియన్‌ డాలర్ల(దాదాపు ఎనభై వేలకోట్ల రూపాయలు) సాయం అందింది. మళ్లీ ఆ దేశాన్నే అడగడానికి నోరు రాక... అడక్కుండా ఆకలి తీర్చడమెలాగో తెలియక... అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయింది ప్రభుత్వం. చివరికి అనధికారికంగా కబురంపితే... 'కష్టపడి పండించుకున్న పంటని ఎంతకాలమని ఆ పేదదేశం ఒళ్లో కుమ్మరించాలీ' అంటూ అక్కడివారు ఎదురుతిరుగుతున్నారని రాసింది న్యూయార్క్‌ టైమ్స్‌.

.

నిజానికి 1947లో కిలో బియ్యమైనా లీటరు పాలైనా పన్నెండు పైసలే. కానీ అసలు దిగుబడే చాలినంత లేదే. స్వాతంత్య్రం రాగానే మొదట తిండిగింజల దిగుబడిని పెంచడానికి భూ సంస్కరణల్ని అమలు చేశారు. ప్రాజెక్టులు కట్టారు. సొంతంగా ఎరువుల తయారీ మొదలెట్టారు. అయినా పెరుగుతూనే ఉన్న జనాభాకి ఉత్పత్తి ఏమాత్రం సరిపోయేది కాదు. ఇంతలో విదేశాల్లో హరిత విప్లవం ఊపందుకుంది. ఆ స్ఫూర్తితో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కూడా హైబ్రిడ్‌ వంగడాల తయారీలో నిమగ్నమైంది. మొట్టమొదట గోధుమ, తర్వాత వరి, జొన్న, మొక్కజొన్న... ఇలా అన్నిరకాల ధాన్యాల్లోనూ హైబ్రిడ్‌ వంగడాల్ని తేవడంతో క్రమంగా ధాన్యం ఉత్పత్తి పెరిగింది. అలా హరిత విప్లవం దేశాన్ని అన్నపూర్ణగా మార్చింది.

పాడి విషయంలోనూ అంతే. పాలనీ, పాల ఉత్పత్తుల్నీ టన్నుల కొద్దీ యూరప్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న రోజుల్లో తొలి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని గుజరాత్‌లోని ఆనంద్‌లో ప్రారంభించారు త్రిభువన్‌దాస్‌ పటేల్‌. వర్ఘీస్‌ కురియన్‌ 1950లో దాన్ని అమూల్‌ (ఆనంద్‌ మిల్క్‌ ఉత్పాదక్‌ లిమిటెడ్‌)గా మార్చారు. అయితే పాల దిగుబడి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిపోయిన పాలను పొడిగా మార్చే సాంకేతికత యూరప్‌ దేశాలకు మాత్రమే తెలుసు. దాన్ని మనతో పంచుకోడానికి వారు ఒప్పుకోలేదు. పైగా 'మీరు తాగేది గేదెపాలు. ఆవుపాలని తప్ప గేదెపాలని పొడిగా మార్చడం సాధ్యంకాద'న్నారు.

ఆ సమయంలో అమెరికా నుంచి తనను చూసిపోయేందుకు వచ్చిన డెయిరీ ఇంజినీర్‌ హెచ్‌ఎం దలాయాని అమూల్‌లో పనిచేసేందుకు ఒప్పించారు వర్ఘీస్‌. దలాయా పరిశోధన పుణ్యమా అని పాలపొడి సమస్య పరిష్కారమైంది. నెస్లే, గ్లాక్సోలకు దీటుగా పాల ఉత్పత్తులను తయారుచేయడం మొదలెట్టింది అమూల్‌. దేశంలో పాలవెల్లువకు స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు పాలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో, మసాలా దినుసుల ఉత్పత్తీ ఎగుమతుల్లోనూ మనదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా; వరి, గోధుమ, చెరకు, వేరుశనగ, పండ్లు తదితరాల దిగుబడిలో రెండోస్థానంలో ఉంది.

ఆరోగ్యమే మహాభాగ్యమని...
డెబ్భై ఐదేళ్ల క్రితం మన సగటు ఆయుష్షు 32 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత మెరుగైన వైద్య సౌకర్యాల వల్ల మరణాల రేటు బాగా తగ్గడంతో ఇప్పుడది దాదాపు డెబ్భైఏళ్లకు చేరింది. స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాల్లో ఆరోగ్య సేవల రంగం గణనీయంగా పురోగమించింది. మన శాస్త్రవేత్తలు మశూచి, ప్లేగు వ్యాధుల్ని నిర్మూలించగలిగారు. కలరా మరణాలను తగ్గించి, మలేరియాని అదుపులోకి తెచ్చారు. 1983లో మొదటిసారి జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించారు. ఆ తర్వాత పంచవర్ష ప్రణాళికల్లో ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చారు. 1990వ దశకం వరకూ కూడా పోలియో పీడిస్తూనే ఉంది. 1994 నాటికి ప్రపంచంలోని అరవై శాతం పోలియో కేసులు మనదేశంలోనే ఉండేవి. విస్తృత అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై దృష్టి పెట్టడంతో ఆ తర్వాత రెండు దశాబ్దాలకే 'పోలియో రహిత భారతం' సాకారమైంది.

ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం- కాన్పు సమయంలో తల్లీబిడ్డల మరణాలను బాగా తగ్గించగలగడం. ఆరోజుల్లో- వెయ్యి కాన్పులైతే అందులో 190 మంది పిల్లలు పురిట్లోనే కన్నుమూసేవారు. లక్ష ప్రసవాలు జరిగితే రెండువేల మంది తల్లులు ప్రాణాలు కోల్పోయేవారు. దాన్ని మెల్లమెల్లగా తగ్గిస్తూ పిల్లల మరణాలను వెయ్యి జననాల్లో 27కి, తల్లుల మరణాలను లక్షలో 103కీ తగ్గించగలిగాం.

ఆనాడు దేశమంతా కలిసి 50 వేలమంది డాక్టర్లు ఉంటే ఇప్పుడు 16 లక్షల మంది ఉన్నారు. 725 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుంటే ఇప్పుడు 30 వేలున్నాయి. 1948లో బీసీజీ వ్యాక్సిన్‌ తయారీ లేబొరేటరీని ప్రారంభించిన నాటి నుంచి నేటి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వరకూ ఎన్నో వ్యాక్సిన్లు స్వదేశంలో తయారుచేసుకోవడమే కాదు, ప్రపంచానికి 50 శాతం వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నది మన దేశమే. జనరిక్‌ ఔషధాల ఉత్పత్తిలో మొదటిస్థానం, మొత్తంగా మందుల తయారీలో మూడోస్థానం... మనదే. 80శాతం ఎయిడ్స్‌ మందుల్ని సరఫరా చేస్తున్నది భారతదేశమే. గతేడాది దాదాపు పాతిక బిలియన్‌ డాలర్ల విలువైన మందుల్ని ఎగుమతి చేశాం.

చదువుతో ప్రగతికి పునాది
విద్య లేనివాడు వింతపశువు అని నమ్మే సంస్కృతి మనది. అలాంటిచోట స్వాతంత్య్రం వచ్చినప్పుడు అక్షరాస్యత 12శాతమే ఉండటానికి కారణం... వలస పాలకులు బలవంతంగా రుద్దిన ఇంగ్లిష్‌ విద్యావిధానమే. నలందా, తక్షశిల లాంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు పరిఢవిల్లిన నేల ఇది. దేశాన్ని పాలించిన రాజులంతా పౌరులకు విద్యగరపడం ప్రభుత్వ బాధ్యతగా భావించినవారే. కానీ వలసపాలన మన విద్యావిధానాన్ని కూకటి వేళ్లతో కూల్చివేసింది.

ఇంగ్లిష్‌ విద్యను మన దేశానికి తెచ్చిన మెకాలే ఉద్దేశం- భారతీయుల్లో ఆత్మన్యూనతను పెంచడం. తెల్లవారు గొప్పవారనీ వారి విద్యలూ విలువలూ ఉన్నతమైనవనీ చెప్పడం ద్వారా భారతీయులను కించపరచడం. మొత్తం భారతీయ, అరేబియన్‌ సాహిత్యాన్నంతా కలిపినా తమ దేశ లైబ్రరీలోని ఒక అరలో పుస్తకాల పాటి చేయవని వ్యాఖ్యానించిన వ్యక్తి అతడు. ఇంగ్లిషువారి అభిరుచుల్నీ అభిప్రాయాల్నీ విలువల్నీ భారతీయులు అర్థం చేసుకుని బాధ్యతగల గుమస్తాలుగా పనిచేయాలన్న ఉద్దేశంతో వారు తమ విద్యావిధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. పాశ్చాత్యుల్ని అనుకరించడమే ఆధునికత అన్న అభిప్రాయాన్ని భారత సమాజంలో చొప్పించారు. మన వారసత్వాన్ని మనమే మర్చిపోయేలా చేశారు.

నిజానికి పైథాగరస్‌ సిద్ధాంతానికి మూలరూపాన్ని కనిపెట్టిన బౌధయాన(క్రీ.పూ.800) భారతీయుడు. 'ఫిబొనాచి సీక్వెన్స్‌'ని అతనికన్నా ఎంతో ముందే భారతీయులైన గోపాల, హేమచంద్రలు రాశారు. సున్నానీ దశాంశ విధానాన్నీ కనిపెట్టిందీ, 'పై' విలువను లెక్కించడమెలాగో చెప్పిందీ భారతీయులే. భూమి గుండ్రంగా ఉందని చెప్పి దాని వ్యాసార్థాన్ని లెక్కించిన ఆర్యభట్ట మనవాడే. సైన్సు మనదేశంలో ఐదువేల సంవత్సరాలనుంచే ఉంది. క్రీ.పూ.800లోనే సుశ్రుతుడు 300 శస్త్రచికిత్సల గురించి రాశాడు. ఆధునిక శస్త్రచికిత్స పరికరాలకు అతడు పేర్కొన్న పరికరాలే మూలం.

కానీ ఇలాంటివన్నీ విదేశీయుల పేరుమీద మనం చదువుకుంటున్నాం. అప్పుడెప్పుడో ఎందుకూ... తరతరాలుగా మనం వాడుతున్న పసుపూ వేపల్లో ఔషధ గుణాలను తామే గుర్తించినట్లు పాతికేళ్ల క్రితం అమెరికా పరిశోధకులు పేటెంట్లు తీసుకున్నారు.

ఈ పరిస్థితిని మార్చాలనే విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చుకున్నాం. మాతృభాషలో బోధనకి ప్రాధాన్యమిచ్చాం. స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలో 500 కాలేజీలు కూడా లేవు. మొత్తమ్మీద 20 యూనివర్సిటీలే ఉండేవి. ఇప్పుడు వెయ్యికి పైగా యూనివర్సిటీలూ యాభైవేల దాకా డిగ్రీ కాలేజీలున్నాయి. ఐఐటీలూ ఎయిమ్స్‌లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలున్నాయి. ప్రాథమిక విద్యకు ప్రథమ ప్రాధాన్యమివ్వడంతో అక్షరాస్యత 78 శాతానికి చేరింది. ఈ చదువు అన్ని రంగాల్లో అభివృద్ధికి పునాది వేసింది. ఫార్చూన్‌ 500 సంస్థల్లో దాదాపు మూడోవంతు భారతీయుల సారథ్యంలోనే పనిచేస్తుండడంతో ప్రపంచ వ్యాపారసంస్థలకి కావలసిన సీఈఓలను ఎగుమతి చేసే దేశంగా భారతదేశానికి పేరొచ్చింది.

సైన్యం సత్తా
దేశ విభజన తర్వాత మన దేశ వాటాగా వచ్చిన సైనికుల సంఖ్య 2లక్షల 60 వేలు. ఇప్పుడు 14 లక్షల 55 వేల సైనికులతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. నాటి రక్షణ వ్యయం రూ.93 కోట్లు. 2021లో 4.78లక్షల కోట్లతో ప్రపంచంలో మూడో స్థానం. యువత స్వచ్ఛందంగా సైన్యంలో చేరడం మన దేశ ప్రత్యేకత. భారత సైన్యం సామర్థ్యం ఏమిటో 1971లో పాకిస్తాన్‌ యుద్ధంలో తొలిసారి చూసింది ప్రపంచం. నాటినుంచి మన త్రివిధ దళాలు ఆధునిక హంగులెన్నో సమకూర్చుకున్నాయి.

గత ఏడాదే విక్రాంత్‌తో విమాన వాహక నౌకలు తయారుచేయగల సత్తా మాకూ ఉందని ప్రపంచానికి చాటింది. 136 దేశాల సైనిక శక్తిని విశ్లేషించిన గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ సంస్థ అమెరికా, రష్యా, చైనాల తర్వాత నాలుగో స్థానం భారత్‌దేనని తేల్చింది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధభూమి సియాచిన్‌ గ్లేసియర్‌ మనదే. భారతీయ సైన్యం నిర్వహిస్తున్న హై ఆల్టిట్యూడ్‌ వార్‌ ఫేర్‌ స్కూల్‌ ప్రపంచంలోని ప్రముఖ శిక్షణా సంస్థల్లో ఒకటి. డెహ్రాడూన్‌లోని భారతీయ మిలిటరీ అకాడమీలో, మిజోరంలోని జంగిల్‌ వార్‌ఫేర్‌ స్కూల్‌లో అమెరికా, రష్యా, ఇంగ్లాండ్‌ తదితర దేశాల సైనికులకు శిక్షణ ఇస్తోంది భారతీయ సైన్యం. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకదళంలో కీలక పాత్ర పోషిస్తున్న సైన్యాల్లో మన దేశానిది రెండోస్థానం. ఇప్పటివరకు దాదాపు రెండున్నర లక్షల మంది పలుదేశాల్లో సేవలందించారు.

అంతరిక్షంలో మన జెండా..!
ఏడు దశాబ్దాల క్రితం అసలు అంతరిక్ష యాత్ర ఊహల్లో కూడా లేదు. 1957లో రష్యా మొదటి శాటిలైట్‌ స్ఫుత్నిక్‌ని ప్రయోగించడం చూసిన భారతీయ శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌ కృత్రిమ ఉపగ్రహాలతో అద్భుతాలు చేయవచ్చని గ్రహించారు. సాంకేతికత ప్రయోజనాలను గ్రామీణ ప్రజలకు కూడా చేరువ చేయొచ్చని భావించారు. ఆయన కృషి ఫలితమే అంతరిక్ష పరిశోధనా రంగంలో నేటి మన ప్రగతి.

1969లో ఏర్పాటైన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రపంచంలోని పెద్ద సంస్థల్లో ఒకటి. విక్రమ్‌ సారాభాయ్‌, హోమీ భాభాల నేతృత్వంలో 1963లో తొలి రాకెట్‌ను ప్రయోగించినప్పుడు... తిరువనంతపురం నుంచి రాకెట్‌ ప్రయోగకేంద్రమైన తుంబకి ఆ రాకెట్‌ విడిభాగాలను సైకిళ్లూ, ఎడ్లబండ్లపైన తరలించారు. ఆనాటినుంచి నేటి వరకూ కూడా అదే ఒద్దికను ప్రదర్శించింది ఇస్రో. అతి తక్కువ ఖర్చుతో 'మంగళ్‌యాన్‌' నిర్వహించి ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఒకే రాకెట్‌ ద్వారా ఏకంగా 104 ఉపగ్రహాలను రోదసిలోకి పంపిన దేశం మనదే.

.

1975లో తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రవేశపెట్టాక మరి వెనుదిరిగి చూడలేదు. చంద్రయాన్‌, చంద్రయాన్‌-2, మంగళ్‌యాన్‌, మిషన్‌ శక్తి... అన్నీ ఒకదాన్ని మించి మరొకటిగా నిలిచాయి. అమెరికా, రష్యా, చైనాల పక్కన భారత్‌ని నిలబెట్టాయి. చంద్రుడిపై నీటి జాడను తొలిసారిగా కనుగొన్నది చంద్రయాన్‌ ఉపగ్రహమే. తొలిప్రయత్నంలోనే అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన ఏకైక దేశం భారత్‌. ప్రభుత్వ సంస్థలే కాకుండా ఇప్పుడు ప్రైవేటు రంగంలోనూ దాదాపు నూటపాతిక సంస్థలు అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాయి.

పరిశ్రమలతో ఆర్థిక పురోగతి
యూరప్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవానికి మూలం... గింజలనుంచి దూదిని తేలిగ్గా వేరుచేసే కాటన్‌ జిన్‌ యంత్రం. దాన్ని ఐదో శతాబ్దంనుంచే భారతీయులు ఉపయోగించేవారు. ఆ యంత్రాన్ని కాస్త మార్చి 1794లో పేటెంట్‌ పొందాడు అమెరికన్‌ ఆవిష్కర్త ఎలి విట్నీ. క్రీ.పూ.500 నాటికే మనదేశంలో ఉక్కు, జింక్‌ తయారుచేసిన ఆనవాళ్లున్నాయి. జాన్‌ డాల్టన్‌ కన్నా కొన్ని శతాబ్దాల ముందే క్రీ.పూ.600 కాలానికి చెందిన భారతీయ శాస్త్రవేత్త కానడ అణుసిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతుకుల్లేకుండా మొట్టమొదటి గ్లోబును రూపొందించింది కశ్మీరీ ఖగోళ శాస్త్రవేత్త.

.

ఇన్ని చేసినా మన ప్రతిభ ఇతర దేశాలకు ఎందుకు తెలియలేదూ అంటే- భారతదేశం ఏ దేశంమీదా దాడికి పాల్పడలేదు. ఎవరిమీదా తన ఆధిక్యాన్ని చూపలేదు. అలాంటి దేశాన్ని బ్రిటిష్‌వారు ఆక్రమించుకుని భారతీయ వారసత్వ సంపద ఆనవాళ్లను తుడిచేశారు. తమ యంత్ర ఉత్పత్తులను అమ్ముకోవడానికి మన కుటీర పరిశ్రమలనూ చేతి వృత్తులనూ సర్వనాశనం చేశారు. వారి కళ్లుగప్పి ఎవరైనా తమ ప్రతిభను ప్రదర్శిస్తే వాళ్ల చేతులు విరిచేయడానికీ వెనకాడని దౌర్జన్య పాలన వల్ల వంశపారం పర్యంగా తర్వాత తరాలకు అందే ఎన్నో వృత్తినైపుణ్యాలు కనుమరుగయ్యాయి. దేశంలో తయారైన వస్తువులను ఎగుమతి చేయాలంటే అధిక సుంకాలు చెల్లించాలి. దాంతో తయారీనే మానుకుని కేవలం ముడి సరకుల ఎగుమతిదారుగా మిగిలిపోయింది దేశం.

స్వాతంత్య్రం వచ్చిన ఏడాది మన దేశ బడ్జెట్‌ కేవలం రూ.171 కోట్లు. చిన్న పరిశ్రమలను సహకార సంఘాల తరహాలో అభివృద్ధిచేయాలనుకున్న ప్రభుత్వం 1948లో మొట్టమొదటి పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. సమయానుగుణంగా చేస్తూ వచ్చిన మార్పులకు తోడు 1990వ దశకంలో తెచ్చిన ఆర్థిక సంస్కరణలు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధిని పరుగులు తీయించాయి. తయారీ రంగమే దేశ ఆర్థిక వ్యవస్థకి సుస్థిరతను ఇవ్వడంలోనూ ఉద్యోగకల్పనలోనూ కీలక పాత్ర నిర్వహించగలదని భావించిన ప్రభుత్వాలు దానిమీదే దృష్టి పెట్టాయి. ఆటోమొబైల్స్‌ నుంచి ఆభరణాలవరకూ ఎన్నో వస్తువులు ఇక్కడ తయారై విదేశాలకు వెళ్తున్నాయి. ప్రస్తుతం కొనుగోలుశక్తిలో మూడోస్థానంలోనూ, జీడీపీ ప్రకారం ఐదో స్థానంలోనూ ఉన్న ఆర్థిక వ్యవస్థ- భారత్‌.

ఇంకా ఎన్నో..!
ఇవే కాదు... దాదాపుగా పల్లెలన్నీ విద్యుత్‌ వెలుగులకు నోచుకున్నాయి. కేవలం 1362 మెగావాట్లున్న కరెంటు ఉత్పాదన ఇప్పుడు నాలుగు లక్షలైంది. పర్యావరణహిత పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తినీ పెంచుకుంటున్నాం. రైల్వే లైన్లను దేశ మూల మూలలకూ విస్తరించి సామాన్యుల రవాణా సాధనంగా మార్చుకోవడమే కాక శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌ లాంటి పొరుగుదేశాలకూ రైల్వేల అభివృద్ధిలో తోడ్పాటునందిస్తోంది మన దేశం. ఇక, రహదారుల నిర్మాణం విషయానికి వస్తే సుదీర్ఘ నెట్‌వర్క్‌తో ప్రపంచంలో రెండోస్థానం మనదే. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశం మొత్తమ్మీద టెలిఫోన్‌ ఖాతాదారుల సంఖ్య 82 వేలు. ఇప్పుడు జనాభాలో మూడోవంతు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు.

.

నాలుగు మతాలు పుట్టిన దేశం... భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆచరణలో చూపే దేశం... ప్రపంచంలో ఇంకోటి లేదు. విద్యా పరిశ్రమలూ వ్యాపారమూ కళలూ... ఏ విషయం చూసినా గొప్ప వారసత్వ సంపద మన సొంతం. అలాంటి దేశాన్ని రెండు వందల ఏళ్లపాటు పట్టి పీడించిన గ్రహణం- పరాయిపాలన. ఏళ్ల తరబడి పోరాడి దాని నుంచి బయటపడ్డాం. పుల్లా పుడకా ముక్కున గరిచి పిట్ట గూడుకట్టుకున్నట్టుగా- దేశాన్ని పునర్నిర్మించుకుని ప్రగతి దారుల్లో కలిసి సాగుతున్నాం..!

దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే... అని పాడుకోవడానికి ఇదే కదా మరి సందర్భం..!

ABOUT THE AUTHOR

...view details