తెలంగాణ

telangana

ETV Bharat / opinion

హమారా క్రీడా మహాన్‌, ఆటల్లో దూకుడు కొనసాగిస్తే భవిష్యత్ మనదే - క్రీడల్లో ఇండియా ఘనతలు

దేశ క్రీడాకారులు మన సత్తాను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా ఓ సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటివరకు క్రీడల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. అయినా సాగించాల్సిన ప్రయాణం.. చేరాల్సిన గమ్యం ఇంకా ఎంతో దూరం ఉంది. 21వ శతాబ్దం ఆరంభం నుంచి ఆటల్లో మన దూకుడు పెరిగింది.. ఇదే జోరు కొనసాగిస్తే భవిష్యత్‌ మనదే!

india sports achievements since independence
india sports achievements since independence

By

Published : Aug 15, 2022, 6:41 AM IST

1952 ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో కె.డి.జాదవ్‌ కాంస్యం నుంచి.. గతేడాది జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా స్వర్ణం వరకు! ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ప్రకాశ్‌ పదుకొనే విజయం నుంచి.. ప్రపంచ ఛాంపియన్‌గా సింధు ఎదిగే వరకు! చదరంగ విశ్వవిజేతగా నిలిచిన విశ్వనాథన్‌ ఆనంద్‌ నుంచి.. ఇటీవల చెస్‌ ఒలింపియాడ్‌లో రెండు కాంస్యాలు దక్కే వరకు!

క్రికెట్లో మూడు ప్రపంచకప్‌లు.. హాకీలో ఒలింపిక్‌ స్వర్ణాలు.. ట్రాక్‌పై మిల్కాసింగ్‌, పీటీ ఉష మెరుపులు.. బాక్సింగ్‌, రెజ్లింగ్‌, షూటింగ్‌, బ్యాడ్మింటన్‌లో ఆధిపత్యం.. ఇలా స్వాతంత్య్రం సాధించిన తర్వాత క్రీడా రంగంలో భారత్‌ ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో చారిత్రక విజయాలు.. ప్రతిష్ఠాత్మక పతకాలు.. భరతమాత మెడలో చేరాయి.

దేశ క్రీడాకారులు మన సత్తాను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా ఓ సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటివరకు క్రీడల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. అయినా సాగించాల్సిన ప్రయాణం.. చేరాల్సిన గమ్యం ఇంకా ఎంతో దూరం ఉంది. 21వ శతాబ్దం ఆరంభం నుంచి ఆటల్లో మన దూకుడు పెరిగింది.. ఇదే జోరు కొనసాగిస్తే భవిష్యత్‌ మనదే!

"భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం తలుపు తడుతోంది. ఇక మనం ఏ మాత్రం నిశ్శబ్దంగా కూర్చోలేం. ఇది కేవలం ఆరంభం మాత్రమే".. ఇవీ తాజాగా కామన్వెల్త్‌ క్రీడల అథ్లెట్లతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలు. అవును.. గత మూడు దశాబ్దాల నుంచి భారత క్రీడా రంగంలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ప్రపంచ వేదికపై ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. కామన్వెల్త్‌, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌తో పాటు వివిధ క్రీడల్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లు, చెస్‌ ఒలింపియాడ్‌.. ఇలా ఆట ఏదైనా, పోటీ ఎక్కడైనా మన ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఒలింపిక్స్‌లో భారత్‌ ఇప్పటివరకూ 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్యాలు కలిపి మొత్తం 35 పతకాలు సాధించింది. అయితే ఇందులో స్వాతంత్య్రానికి ముందు వచ్చిన పతకాలు 5 (హాకీలో మూడు స్వర్ణాలు సహా) ఉన్నాయి.

2000 ఒలింపిక్స్‌ నుంచి చూసుకుంటే ఇప్పటివరకూ రెండు వ్యక్తిగత స్వర్ణాలతో సహా 20 పతకాలు వచ్చాయి. నిరుడు టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో ఈ క్రీడల చరిత్రలో ఉత్తమ ప్రదర్శన చేసింది. ఇక బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో మేరీకోమ్‌ తర్వాత తాజా సంచలనం నిఖత్‌ జరీన్‌, వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి, మీరాబాయి చాను, రెజ్లింగ్‌లో సుశీల్‌ కుమార్‌, క్యూ స్పోర్ట్స్‌లో పంకజ్‌ అడ్వాణీ, షూటింగ్‌లో అభినవ్‌ బింద్రా ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. చదరంగంలో విశ్వనాథన్‌ ఆనంద్‌ అయిదు సార్లు ఆ ఘనత సాధించాడు. కోనేరు హంపి మహిళల ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

అసాధ్యమేం కాదు..
క్రీడారంగంలో భారత్‌ ఇప్పటివరకూ మెరుగైన ఫలితాలే రాబట్టింది. కానీ 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఆ ప్రదర్శన అంతంత మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు. స్వాతంత్య్రం తర్వాత దేశ విభజన కారణంగా ఏర్పడిన పరిస్థితులు, పేదరికం, కనీస వసతుల లేమి.. ఇలా ఎన్నో సమస్యలు క్రీడా రంగం ఎదుగుదలకు అవరోధంగా మారాయి. అప్పటి ప్రభుత్వాలు కూడా ముందుగా ఆహారం, ఆరోగ్యం, నివాసం వంటి విషయాలకే మొదటి ప్రాధాన్యతనిచ్చాయి. ఇప్పుడు ప్రజల జీవితాల్లో, సామాజిక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆర్థిక స్వావలంబన కూడా మెరుగ్గా ఉంది.

క్రీడల్లో కూడా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఆటలాడితే ఏం లాభం? మంచిగా చదువుకోవచ్చు కదా? అనే ప్రశ్నలు గతంలో వినిపించేవి. ఇప్పుడు ఆటల్లోనూ ఉపాధి అవకాశాలు మెండుగా ఉండడం, ఉత్తమ ప్రదర్శన చేసిన ప్లేయర్లకు ఉద్యోగాలు దక్కుతుండడంతో యువత వైఖరి మారుతోంది. పైగా గతంతో పోలిస్తే శిక్షణ సౌకర్యాలు మెరుగుపడ్డాయి. విదేశాల్లోనూ అత్యుత్తమ శిక్షణ తీసుకునే వెసులుబాటు ఉంది. వందలాది ప్రభుత్వ, ప్రైవేటు అకాడమీలు పుట్టుకొస్తున్నాయి. వివిధ ఆటల్లో నైపుణ్యమున్న కోచ్‌లు ఇక్కడికే వచ్చి శిక్షణ అందిస్తున్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం కలుగుతోంది.

దేశంలో ప్రతిభకు కొదవలేదు. దాన్ని గుర్తించి, తగిన శిక్షణతో ముందుకు సాగితే అద్భుతాలు చేయడం సాధ్యమే. క్రికెట్‌, హాకీ, బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌, షూటింగ్‌ ఇలా కొన్ని క్రీడలకే పరిమితమైన భారత ఆధిపత్యం.. అన్ని క్రీడలకు విస్తరించి.. క్రీడా శక్తిగా ఎదగడం అసాధ్యమేం కాదు. అమెరికా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి దేశాలకు దీటుగా నిలిచే సామర్థ్యం, అవసరమైన నైపుణ్యాలు, వనరులున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో దేశం అగ్రగామిగా ఎదగాలి. వాటిని సద్వినియోగం చేసుకుని.. క్రీడా ప్రపంచాన్ని శాసించాలి ఇక.

ఆ అద్భుతాలు..
75 ఏళ్ల స్వతంత్ర భారతావని క్రీడల్లో కొన్ని మరపురాని విజయాలు సాధించింది. వ్యక్తిగత క్రీడాంశాల్లో, జట్టు ఆటల్లోనూ మన దేశం చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శనలు చేసింది. స్వేచ్ఛా వాయువులు పీల్చిన దేశానికి మొదట క్రీడల్లో ఆనందాన్ని ఇచ్చింది హాకీ. ఈ ఆటలో స్వాతంత్య్రానికి ముందే ఒలింపిక్స్‌లో మూడు పసిడి పతకాలు (1928, 1932, 1936) గెలిచిన భారత్‌.. ఆ తర్వాత మరో అయిదు స్వర్ణాలు సహా తొమ్మిది పతకాలు ఖాతాలో వేసుకుంది. 1975 హాకీ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. 1952 ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ కె.డి.జాదవ్‌ కాంస్యం నెగ్గి దేశానికి మొట్టమొదటి వ్యక్తిగత పతకం అందించాడు.

ఇక 1951 నుంచి 1962 వరకు భారత ఫుట్‌బాల్‌ స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. 1951లో మొట్టమొదటి ఆసియా క్రీడల ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌గా నిలిచిన మన దిగ్గజ జట్టు.. 1956 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానాన్ని సాధించింది. 1962లో మరోసారి ఆసియా క్రీడల బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో ఫ్లయింగ్‌ సిఖ్‌ మిల్కాసింగ్‌ త్రుటిలో పతకం కోల్పోయినప్పటికీ.. అథ్లెటిక్స్‌లో మన సత్తాను ప్రపంచానికి చాటిన భారత తొలి ట్రాక్‌ దిగ్గజంగా మిగిలిపోయాడు. 1984 ఒలింపిక్స్‌లో పీటీ ఉష సెకనులో వందో వంతు తేడాతో కాంస్యం చేజార్చుకుంది. 1980 ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ గెలిచిన ప్రకాశ్‌ పదుకొనే ఆ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా నిలిచాడు. 1996 ఒలింపిక్స్‌లో పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌లో కాంస్యంతో లియాండర్‌ పేస్‌, 2000 ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యంతో కరణం మల్లీశ్వరి సంచలనం సృష్టించారు.

ఇక దేశంలో అత్యంత ఆదరణ పొందుతున్న క్రీడగా ఎదిగిన క్రికెట్‌ విషయానికి వస్తే 1983 ప్రపంచకప్‌ విజయానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌ గెలవడమే ఎక్కువ.. ఇక కప్పు గెలుస్తారా? అనే వెటకారపు మాటలకు అసాధారణ ప్రదర్శనతో కపిల్‌ డెవిల్స్‌ గెలుపుతో బదులిచ్చారు. అప్పటి నుంచే దేశంలో క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2011లో రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ధోని సారథ్యంలో విశ్వవిజేతగా నిలిచింది. అంతకుముందు అతడి కెప్టెన్సీలోనే 2007లో మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌నూ సొంతం చేసుకుంది.

ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించే సత్తా దేశానికి ఉందని చాటుతూ 2008లో షూటింగ్‌లో పసిడితో అభినవ్‌ బింద్రా చరిత్ర లిఖించాడు. ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో పతకం రావడమే గగనం.. ఇక పసిడి దక్కుతుందా? అనే సందేహాలను గతేడాది టోక్యోలో నీరజ్‌ చోప్రా పటాపంచలు చేశాడు. జావెలిన్‌ త్రోలో ఛాంపియన్‌గా నిలిచి స్వతంత్ర దేశానికి అథ్లెటిక్స్‌లో తొలి పతకాన్ని.. అదీ స్వర్ణాన్ని అందించి నవశకానికి నాంది పలికాడు. ఇక పురుషుల్లో సుశీల్‌ కుమార్‌, మహిళల్లో పీవీ సింధు.. ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు నెగ్గిన భారత అథ్లెట్లుగా రికార్డు సృష్టించారు. సానియా మీర్జా ప్రపంచ టెన్నిస్‌ డబుల్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకుంది. చెస్‌ ఒలింపియాడ్‌లో రెండు కాంస్యాలు నెగ్గింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘనతలు.. చరిత్రను తిరగరాసిన మరెన్నో సందర్భాలు.

ABOUT THE AUTHOR

...view details