తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆదాయం చాలదు... రుణం తీరదు! - రుణాలు అందక రైతుల ఆత్మహత్యలు

ఉద్యాన, వాణిజ్య పంటల సాగు ఏటా పెరుగుతుండటం వల్ల పెట్టుబడి వ్యయం అధికమవుతోంది. ఇది పంటరుణ పరిమితిపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా రైతుల అప్పులు సైతం అధికమవుతున్నాయి. సాగు పెట్టుబడితోపాటు కుటుంబ అవసరాలకు సైతం రుణాలపైనే ఆధారపడటంతో రైతుల రుణభారం మరింత అధికమవుతోంది.

రైతు ఆదాయం
రైతు ఆదాయం

By

Published : Sep 13, 2021, 8:42 AM IST

దేశంలో వ్యవసాయ రుణాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో ఉండగా తెలంగాణ పదోస్థానంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2021 మార్చి నాటికి 1.20 కోట్ల ఖాతాలపై రూ.1.69 లక్షల కోట్ల రుణాలు ఉన్నట్లు ఇటీవల పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కారాడ్‌ ప్రకటించారు. రూ.1.89 లక్షల కోట్ల రుణాలతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. 63.22 లక్షల రుణ ఖాతాలు ఉన్న తెలంగాణ- రూ.84 వేల కోట్ల మేరకు రుణాలతో జాబితాలో పదోస్థానంలో కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే వ్యవసాయ రుణాలు భారీగా ఉన్నాయి. లక్ష కోట్ల రూపాయలకుపైగా అప్పులు ఉన్నవి ఏడు రాష్ట్రాలు; అందులో మూడు దక్షిణాదివే. అత్యధిక జనాభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ కంటే ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ రుణాలు 8.7శాతం అధికం. మరోవైపు దేశంలో అత్యధిక కుటుంబాలు రుణగ్రస్తమైన జాబితాలో తెలుగురాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో 93.2శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఒక్కో కుటుంబంపై సగటున రూ.2,45,554 చొప్పున రుణం ఉంది. తెలంగాణలో 91.7శాతం కర్షక కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,52,113 చొప్పున అప్పు ఉంది.

పెరిగిన వ్యయాలు..

తెలుగురాష్ట్రాల్లో ఉద్యాన, వాణిజ్య పంటల సాగు ఏటా పెరుగుతుండటం వల్ల పెట్టుబడి వ్యయం అధికమవుతోంది. ఇది పంటరుణ పరిమితిపై ప్రభావం చూపుతోంది. వాస్తవ సాగు ఖర్చులకు అనుగుణంగా ఏటా ఎంతో కొంత పంట రుణ పరిమితిని పెంచడంతో రైతుల అప్పులు సైతం అధికమవుతున్నాయి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించే క్రమంలో దేశీయ విత్తనాలకు బదులుగా సంకరజాతి విత్తనాలను ఎంచుకోవడం ప్రారంభించిన నాటి నుంచే పెట్టుబడి వ్యయం పెరగడం మొదలైంది. పండిన పంట నుంచి విత్తనాలు సేకరించుకునే రోజుల నుంచి కిలోకు లక్ష రూపాయలు వెచ్చించి సంకరజాతి విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయంలో ప్రధాన ఇంధనమైన డీజిల్‌ ధర లీటరు వంద రూపాయలకు చేరువ కావడంతో సాగువ్యయం ఇంకా పెరిగింది. కూలీల లభ్యత తగ్గి, యంత్రాల వినియోగం తప్పనిసరి అయింది. ముడిసరకు, పన్నులు, రవాణా భారం హెచ్చడంతో ఏటా పురుగుమందులు, ఎరువులు, విత్తనాల ధరలు పెరుగుతున్నాయి. పంట సాగుకు పెట్టుబడితోపాటు కుటుంబ అవసరాలకు సైతం రుణాలపైనే ఆధారపడటంతో రైతులకు రుణభారం అధికమవుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినా- అవి పూర్తిస్థాయిలో ఉపయోగపడటంలేదు. పంటలకు మద్దతు ధర లభించక బహిరంగ మార్కెట్లో అయినకాడికి తెగనమ్ముకునే పరిస్థితి వస్తోంది. రెండు దశాబ్దాల కిందటి వరకు పిల్లల చదువులకు పెద్దగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ప్రైవేటు సంస్థలు విద్యావ్యవస్థలో కీలకంగా మారిన తరవాత విద్యకు వెచ్చించే ఖర్చు అమాంతం పెరిగింది. ఇది రైతు కుటుంబాలకు అదనపు భారమైంది. సాగుకు అనుబంధంగా పాడి లేకపోవడంతో రోజువారీ ఖర్చులకూ రుణాల వైపు చూడాల్సి వస్తోంది. సాగు ఉత్పాదకాలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు రైతులు పూర్తిగా ప్రైవేటు రంగంపై ఆధారపడాల్సి వస్తోంది. సంస్థాగతంగా విక్రయసంస్థలు నెలకొల్పినా అవి రైతుల అవసరాలను తీర్చలేక మొక్కుబడిగా మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు దన్నుగా నిలవడానికి అమలుచేస్తున్న పలు పథకాలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. నాసిరకం ఉత్పత్తుల విక్రేతలపై కఠినచర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో చాపకింద నీరులా అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి రైతుకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. మార్కెట్‌లో గిరాకీని అంచనా వేసి అందుకు అనుగుణంగా పంటలు సాగుచేసే విధానానికి రూపకల్పన జరగడం లేదు. ఎగుమతులు, దిగుమతుల విధానంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులకు కొన్నిసార్లు నష్టం వాటిల్లుతోంది. వాణిజ్య పంటల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. రైతుభరోసా, రైతుబంధు, పీఎం-కిసాన్‌ వంటి పథకాలతో అన్నదాతలకు నేరుగా అందిస్తున్న నగదు- పెట్టుబడి అవసరాలకు ఏమాత్రం అక్కరకు రావడం లేదు. దీనికి బదులుగా నిల్వ, మార్కెటింగ్‌, మద్దతు ధర, రవాణా అంశాల్లో దన్నుగా నిలవాల్సిన అవసరముంది.

ఆధునికతకు దూరం..

రైతులు దశాబ్దాలుగా సంప్రదాయ ఒరవడిలోనే కొనసాగుతుండటం ప్రధాన అవరోధంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కౌలు రైతులతో పాటు చిన్న కమతాలు ఎక్కువగా ఉండటంతో ఆధునిక పద్ధతుల్లో యంత్రాలను సమకూర్చుకోవడం భారంగా మారింది. సూక్ష్మసేద్య పరికరాలు, మోటార్లు, శాశ్వత పందిళ్లు వేయడానికి కౌలు రైతులు వెనకడుగు వేస్తున్నారు. భూయజమానులు ఒక్కోసారి తమ పొలాలను కౌలుకు ఇవ్వడానికి నిరాకరించడంతో సాగు చేసే రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొనే అవకాశం కలగడంలేదు. వ్యవసాయ పరిశోధన ఫలాలు రైతులకు చేరడంలోనూ అంతరాలున్నాయి. ప్రైవేటు వ్యాపారుల సలహాలు, సూచనల ఆధారంగానే సింహభాగం వ్యవసాయం సాగుతోంది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను ముడిసరకు రూపంలో అమ్మకుండా ప్రాసెసింగ్‌, గ్రేడింగ్‌ చేసి ఉప, అనుబంధ, అంతిమ ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తే రాబడి పెరుగుతుంది. సరకు నిల్వ, రవాణాకు వసతులు సమకూరిస్తే వృథాకు అడ్డుకట్ట పడుతుంది. నాణ్యత కోల్పోకుండా ఉండటం వల్ల మెరుగైన ధర పొందవచ్చు. అంతర్జాతీయ స్థాయి పంటలు పండించి ఎగుమతే లక్ష్యంగా విధానాలు అందుబాటులోకి తీసుకువస్తే రైతుకు నికర రాబడి పెరుగుతుంది. ఈ దిశగా కొంతమేరకు కృషి జరుగుతున్నా అది మరింత పెరగాల్సిన అవసరం ఉంది. విదేశాల నుంచి నూనెగింజలు, అపరాలు, ఆహార ఉత్పత్తులను ఇంకా భారీగా దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితిలో దేశం ఉంది. వాటిని దేశీయంగా పండించడానికి గల అవకాశాలను అందిపుచ్చుకొనేలా రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. బహుళ పంటల సాగు, అంతర పంటల సాగుపై దృష్టిసారిస్తే సత్ఫలితాలు వస్తాయి.

ఎందుకీ దుస్థితి?

ఏటికేడు పెట్టుబడులు పెరగడం, ఆశించిన ఆదాయం రాకపోవడం, కుటుంబ ఖర్చులు పెరగడంవల్ల రైతులకు రుణభారం అధికమవుతోంది. మరోవైపు సాగు ఖర్చులకు అనుగుణంగా పంట రుణ పరిమితిని నిర్ణయించి రుణాలు ఇవ్వాల్సిన బ్యాంకులు ఆ మేరకు తోడ్పాటు అందించలేకపోతున్నాయి. దీంతో రైతులు ఎక్కువ వడ్డీకి బయట అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తోంది. స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం సాగు, కుటుంబ ఖర్చులకు 30శాతం అదనంగా రుణాలు ఇవ్వాలన్న సూచన నేటికీ ఆచరణలోకి రాలేదు. ప్రకృతి విపత్తులతో దిగుబడులు, నాణ్యత తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఏటా ఎంతో కొంత రుణం పేరుకుపోయి రైతులు రుణగ్రస్తులుగా మారిపోతున్నారు. పంట చేతికి వచ్చిన వెంటనే ప్రైవేటు అప్పులు చెల్లించాల్సి రావడంతో బ్యాంకుల్లో పంటరుణాలను రెన్యూవల్‌ చేయడం మినహా పూర్తిగా చెల్లించే పరిస్థితి లేదు.

- పెనికలపాటి రమేష్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details