తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కొత్త పథంలో దేశ ఎగుమతి రథం - indian exports collapsed

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్ కారణంగా ఎగుమతి రంగం కుదేలైంది. 2019 మార్చిలో దేశ ఎగుమతుల విలువ దాదాపు రూ.2.28లక్షల కోట్లు కాగా.. 2020 మార్చి వచ్చే సరికి అది రూ.1.59లక్షల కోట్లకు తగ్గిపోయింది. ప్రపంచ ఆర్థిక రథం స్తంభించిపోవడం ఈ దుస్థితికి మూల కారణం. ఎగుమతులు మళ్లీ ప్రారంభమయ్యేది 2021 సంవత్సరంలోనేనన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

indian exports to have challenging opportunities
కొత్తపథంలో ఎగుమతి రథం! సవాళ్లు సృష్టించే అవకాశాలు

By

Published : Jun 3, 2020, 9:48 AM IST

కొవిడ్‌ దెబ్బకు భారతదేశ ఎగుమతులు ఒక్క సంవత్సరంలోనే 34.56శాతం తగ్గిపోయాయి. 2019 మార్చిలో దేశ ఎగుమతుల విలువ దాదాపు రూ.2.28లక్షల కోట్లు కాగా, 2020 మార్చి వచ్చేసరికి అది రూ.1.59లక్షల కోట్లకు తగ్గిపోయింది. 2015 నవంబరు తరవాత ఇంతటి భారీ పతనం సంభవించడం ఇదే మొదటిసారి. కరోనా వైరస్‌ తెచ్చిపెట్టిన లాక్‌డౌన్‌వల్ల ప్రపంచ ఆర్థిక రథం స్తంభించిపోవడం ఈ దుస్థితికి మూల కారణం. రథం కదిలేది మళ్లీ 2021 సంవత్సరంలోనేనన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కనీసం అప్పటికైనా పరిస్థితులు మెరుగుపడతాయా అని సందేహించేవాళ్లూ ఉన్నారు. లాక్‌డౌన్‌వల్ల అంతర్జాతీయ సరఫరా, గిరాకీలు అడుగంటిపోయాయి. 2019 ఏప్రిల్‌ - 2020 మార్చి మధ్య ఎగుమతులతోపాటు దిగుమతులూ కుదేలయ్యాయి. వీధి వర్తకులు, దినసరి కూలీలు, రైతులు మొదలుకొని చిల్లర వర్తకులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) యజమానులు మొదలుకొని బడా పరిశ్రమాధిపతులు, కార్ల కంపెనీల వరకు దెబ్బతిననివారు లేరు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ఎంఎస్‌ఎంఈ 45 శాతం భారతీయ ఎగుమతులకు కారణం. ఈ రంగం 12 కోట్లమందికి ఉపాధి చూపుతోంది. వీరిలో స్థానికులు, వలస కూలీలు ఉన్నారు.

వేగం పుంజుకుంటున్న ఈ-కామర్స్‌

లాక్‌డౌన్‌ ఎత్తివేశాక వేగంగా కోలుకునే రంగాలు లేకపోలేదు. అవి- వ్యవసాయ ఉత్పాదనలు, ఫార్మా, ఆరోగ్య సంరక్షణ, వినియోగ వస్తువులు (ఎఫ్‌ఎంసీజీ), సరఫరా గొలుసులు, సరకుల బట్వాడా, డిజిటల్‌ ఉత్పత్తులు, సేవలు. ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ విద్య. లాక్‌డౌన్‌ కాలంలో మహా విక్రయశాలలు (మాల్స్‌), సూపర్‌ మార్కెట్లు బంద్‌ కావడంతో ఈ-కామర్స్‌కు కొత్తఊపు వచ్చింది. ఈ-కామర్స్‌ విక్రయాలు, బట్వాడాలు పెరుగుతున్నకొద్దీ ప్యాకేజింగ్‌ సామగ్రి, పట్టీలు, లేబుళ్లు, పాలిథీన్‌ సంచులు, షీట్ల తయారీ పరిశ్రమలకు గిరాకీ విజృంభిస్తుంది. మార్చి 31తో ముగియాల్సిన 2015-20 విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం 2021 మార్చి వరకు పొడిగించింది. అంటే ఈ విధానం కింద పథకాలు, ప్రయోజనాలు 2021దాకా కొనసాగుతాయన్నమాట. సుంక రహిత దిగుమతుల ధ్రువీకరణ, ఉత్పాదక యంత్రాల ఎగుమతులకు ప్రోత్సాహ పథకం వంటి దిగుమతులతో ముడిపెట్టిన ఎగుమతుల పథకాలు మరో ఏడాదిపాటు కొనసాగుతాయి.

ప్రోత్సాహకాలు అవసరం

నేడు ప్రపంచ దేశాలు కొవిడ్‌పై పోరుకు అపార ధన వ్యయం చేస్తున్నాయి. ఈ వ్యయం వాటి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కనీసం రెండు శాతానికి తగ్గకుండా ఉంటోంది. కొన్ని దేశాల జీడీపీలో ఈ వ్యయం రెండంకెలకూ చేరింది. భారతదేశం ఇంతవరకు కొవిడ్‌ కట్టడికి ఖర్చు చేసిన రూ.1.7లక్షల కోట్లు మన జీడీపీలో 0.8 శాతానికి సమానం. నిజంచెప్పాలంటే కేంద్రం ఇంతవరకు ప్రకటించినదానికన్నా రాష్ట్రాలు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. ఇది వాటి తలకు మించిన భారమే. కేంద్రం జీడీపీలో రెండు శాతానికి సమాన మొత్తాన్ని వెచ్చిస్తే- లాక్‌డౌన్‌లో మూతపడిన పరిశ్రమలు, వ్యాపారాలు తిరిగి గాడిన పడతాయి. ఎగుమతిదారులకు భారీ ప్రోత్సాహకాలను ఇవ్వవచ్ఛు ఫలితంగా విదేశ మారక ద్రవ్య నిల్వలు పెద్దయెత్తున పెరిగి, మన అభివృద్ధికి దన్నుగా నిలుస్తాయి. పరిశ్రమలు, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాలను మళ్లీ ఉరకలెత్తిస్తాయి. కరోనా బీభత్సానికి పలు దేశాల్లో ఆహార కొరత ఏర్పడుతున్నందున అక్కడికి ఆహార ధాన్యాలను, శుద్ధి చేసిన ఆహారాన్ని ఎగుమతి చేయడానికి అవకాశాలు లభిస్తాయి. రసాయనాల కోసం, మందుల తయారీకి కావలసిన ముడి సరకుల కోసం చైనా మీద అతిగా ఆధారపడటం మంచిది కాదని ప్రపంచ దేశాలకు అనుభవం మీద తెలిసివస్తోంది. ఎలెక్ట్రానిక్స్‌, ప్లాస్టిక్‌, బొమ్మలు, వైద్య రంగానికి అవసరమైన వస్త్రాల కోసం ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. మొదటి దశలో అంటే రానున్న మూడు నెలల్లో వీటిని శీఘ్రంగా అందించడానికి కేంద్రం దేశీయ పరిశ్రమలను సమాయత్తం చేయాలి. తదుపరి ఆరు నెలల్లో మందులు, నగలు, రత్నాలు, ఉక్కు ఎగుమతికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వీటితోపాటు ఇంకా ఏయే రంగాల్లో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకొంటున్నాయో తెలుసుకోవడానికి- అధ్యయన సంఘాలను నియమించాలి. అంతా కేంద్రానికే వదిలేయకుండా ప్రతి రాష్ట్రం తాను ఏమేం ఎగుమతి చేయగలదో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని రంగంలోకి దూకాలి.

వాణిజ్య ప్రదర్శనలకు కొత్తరూపు

కరోనా విజృంభించడానికి ముందు ప్రభుత్వ సంస్థలు భారతీయ ఎగుమతిదారులను విదేశాల్లో నిర్వహించే అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలకు తీసుకెళ్లి దేశదేశాల వ్యాపారులతో సమావేశాలు నిర్వహించుకునే అవకాశం కల్పించేవి. మన ఎగుమతిదారుల ప్రయాణ ఖర్చుల్లో, అంతర్జాతీయ ప్రదర్శనల్లో స్టాళ్ల నిర్వహణ వ్యయంలో కొంత ప్రభుత్వమే భరించి ప్రోత్సహించేది. కొవిడ్‌వల్ల వచ్చిపడిన లాక్‌డౌన్‌ ఈ పాత పద్ధతులను పక్కకు నెట్టేసింది. 2020-2021 ప్రథమ త్రైమాసికంలో జరగాల్సిన వాణిజ్య ప్రదర్శనలు ఇప్పటికే రద్దయిపోయాయి. ఇక రాబోయేది డిజిటల్‌ టెక్నాలజీతో జరిపే ‘వర్చువల్‌’ వాణిజ్య ప్రదర్శనలే. దీనికోసం అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల నిర్వాహకులు, భారత ప్రభుత్వ ఎగుమతి మండళ్లూ సన్నద్ధమవుతున్నాయి. వీటిలో పాల్గొనడానికి విమాన ప్రయాణాలు, వీసాలు అక్కర్లేదు. హోటల్‌ ఖర్చులూ తప్పుతాయి. భారతీయ ఎగుమతిదారులు తమ కార్యాలయాల్లోనే కూర్చుని అమెరికా, జర్మనీ, జపాన్‌, చైనాలలో జరిగే ‘వర్చువల్‌’ వాణిజ్య ప్రదర్శనల్లో స్టాళ్లు ఏర్పాటుచేయవచ్ఛు వాటిని సందర్శించే ఖాతాదారులతో ఇక్కడి నుంచే బేరసారాలు జరపవచ్ఛు కొవిడ్‌ ఈ విధంగా అంతర్జాతీయ వ్యాపారాన్ని డిజిటల్‌ సీమలోకి నెడుతోంది. వ్యాపారుల నుంచి వ్యాపారులకు, వినియోగదారులు-వ్యాపారులకు మధ్య కయవిక్రయాలు ఆన్‌లైన్‌లో నిర్వహించక తప్పని పరిస్థితి కల్పిస్తోంది. ఈ-కామర్స్‌ వేదికలపై చిల్లర వ్యాపారాల జోరు పెరగడమే తప్ప తరిగేలా లేదు. భారతీయ ఎగుమతిదారులు ఈ మార్పులన్నింటినీ ఆకళింపు చేసుకుని, డిజిటల్‌ సీమలో దూసుకెళ్లక తప్పదు.

- వీబీఎస్ఎస్ కోటేశ్వరరావు(ఎగుమతి దిగుమతి రంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details