రేపటి పౌరుల్ని జాతి వజ్రాలుగా సానపట్టాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే. పాఠశాలల్లో మేలిమి బోధనకు ఒరవడి దిద్దే లక్ష్యంతో విద్యాహక్కు చట్టాన్ని సవరించినా, సిబ్బందికి మెలకువలు మప్పేందుకంటూ 'నిష్ఠ'వంటి బృహత్ పథకాలు రూపొందించినా- దేశంలో గుణాత్మక పరివర్తన ఇప్పటికీ ఎండమావే. బడి చదువుల స్థాయీప్రమాణాల ప్రాతిపదికన భారత్ యాభై సంవత్సరాలు వెనకబడి ఉందని 'యునెస్కో' అధ్యయనపత్రం నిగ్గుతేల్చిన నాలుగేళ్ల తరవాతా- గురుబ్రహ్మలను తీర్చిదిద్దే యత్నం సరిగ్గా గాడిన పడనేలేదు. ఇంతగా నిరాశ మబ్బులు కమ్మిన విద్యాకాశంలో, ప్రపంచబ్యాంకు ఆమోదముద్ర పొందిన పథకమొకటి ఇప్పుడు తళుక్కుమంటోంది. 'అందరికీ విద్య' నినాదానికి కొత్త ఊపిరులూదుతున్న చందంగా బోధన మెలకువలు అలవరచి రాష్ట్రాల్లో ఇతోధిక ఫలితాల సాధనకు దోహదపడుతుందంటూ- 'స్టార్స్' పేరిట నూతన యోజన పట్టాలకు ఎక్కనుంది. 'సమగ్ర శిక్ష' కార్యక్రమంతో ప్రధానంగా హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో పాఠశాల విద్య గతిరీతుల్ని ప్రక్షాళించేందుకు ప్రపంచబ్యాంకు నుంచి సమకూరనున్న సాయం సుమారు రూ.3700కోట్లు. దేశవ్యాప్తంగా ఉన్నవాటిలో 75శాతం సర్కారీ బడులే. మొత్తం విద్యార్థుల్లో 65శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. జిల్లాస్థాయి విద్యా శిక్షణ సంస్థలు మొదలు జిల్లా బ్లాక్ విద్యా కార్యాలయాలు, పాఠశాలల వరకు పేరుకుపోయిన ఖాళీల భర్తీ అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. సత్వరం పూడ్చాల్సిన కంతల్ని అలాగే వదిలేసి ఆరు రాష్ట్రాల్లో బడి చదువుల బాగుసేతకు ఉద్దేశించిన పథకం ద్వారా- 15లక్షల పాఠశాలల్లోని 25కోట్ల విద్యార్థులకు, కోటిమంది వరకు ఉపాధ్యాయులకు ప్రయోజనాలు కలుగుతాయన్న ప్రచారం విస్మయపరుస్తోంది. పరిమిత చొరవ కాదు- జాతీయ స్థాయిలో విస్తృత స్థాయి ద్విముఖ వ్యూహంతోనే, పతనావస్థలోని విద్యారంగాన్ని కుదుటపరచగలిగేది!
పునాది స్థాయి నుంచి ప్రక్షాళన