భారత క్రికెట్ జట్టులో తరగని ప్రతిభ.. వరుస విజయాలతో ఫుల్ జోష్! - భారత క్రిెకట్ జట్టు
ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఆ ఉత్సాహంతో రోహిత్ శర్మ సారథ్యంలోని మన జట్టు టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లింది. అదే దక్షిణాఫ్రికాతో శిఖర్ ధావన్ నేతృత్వంలోని మరో భారత బృందం వెంటనే ఒన్‌డే సిరీస్ ఆడింది. అందులోనూ మనదే విజయం. ఇలా రెండు వేర్వేరు టీములు పటిష్ఠమైన జట్టుతో తలపడి సిరీస్‌లు గెలవడం అరుదైన విషయం. భారత క్రికెట్ ప్రతిభావంతులతో ఎలా కళకళలాడుతోందో చెప్పడానికి ఇదో రుజువు.
Indian Cricket Team Victories
By
Published : Oct 16, 2022, 8:23 AM IST
Indian Cricket Team Victories: గతేడాది నుంచి భారత్ తరచుగా అవసరాన్ని బట్టి రెండో జట్టుతో సిరీస్‌లు ఆడిస్తోంది. నిరుడు విరాట్ కోహ్లి సారథ్యంలో ప్రధాన జట్టు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్ళింది. అదే సమయంలో ధావన్ నాయకత్వంలో మరో జట్టు శ్రీలంక పర్యటన జరిపింది. అక్కడ ఒన్‌డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది. ఈ ఏడాది వెస్టిండీస్‌లో ఒన్‌డే సిరీస్ కోసమూ రెండో జట్టును పంపారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు బాగా పెరిగిపోవడం, దానికి ఐపీఎల్ కూడా తోడవుతుండటంతో ఒకే జట్టుతో అన్ని సిరీస్‌లూ ఆడించడమనేది ఆటగాళ్లకు భారమే. అదే సమయంలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎదురు చూస్తున్న ప్రతిభావంతులకు కొదవ లేదు. అందుకే బీసీసీఐ రెండో జట్టు ఆలోచనను తెరపైకి తెచ్చింది. 1995లో ఆస్ట్రేలియా సైతం ఒకే సిరీస్‌లో తమ జట్లు రెండింటిని ఆడించింది.
ఐపీఎల్ చేయూత నిజానికి, ఇటీవల దక్షిణాఫ్రికాపై ఒన్‌డే సిరీస్ గెలిచిన భారత జట్టు పేరుకే ద్వితీయ శ్రేణి. ఆ జట్టులో ధావన్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ తదితరులంతా తరచూ ప్రధాన జట్టులో ఆడే ప్రపంచ స్థాయి క్రికెటర్లే. ఆ సిరీస్ సందర్భంగా దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్- రెండు కాదు నాలుగు జట్లను బరిలోకి దించగల క్రికెట్ ప్రతిభ భారత్‌లో ఉందని వ్యాఖ్యానించారు. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, దేవ్‌దత్ పడిక్కల్ లాంటి మరెందరో ప్రముఖ ఆటగాళ్లు ఈ రెండు జట్లలోనూ చోటు దక్కక దేశవాళీ టోర్నీ అయిన ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నారు.
భారత క్రికెట్ ఇప్పుడిలా ప్రతిభావంతులతో కళకళలాడుతుండటానికి ఐపీఎల్ ఒక ముఖ్య కారణం. ఈ లీగ్ రాకతో ఆట అందం, స్వచ్ఛత దెబ్బ తిన్నాయని, ఆటగాళ్లకు డబ్బే ప్రధానం అయిపోయిందన్న విమర్శలు లేకపోలేదు. అయితే, గతంలో ఒక క్రికెటర్ వివిధ స్థాయుల్ని దాటుకొని జాతీయ జట్టులో అవకాశం దక్కించుకోవడం అంత తేలికయ్యేది కాదు. క్రికెట్ సంఘాల్లో రాజకీయాలు, ఆశ్రిత పక్షపాతం వల్ల అవకాశాలు దక్కక కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించిన ఆణిముత్యాలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అంతా పారదర్శకంగా మారిపోయిందని కాదు కానీ, ఐపీఎల్ వల్ల యువ క్రికెటర్లు జాతీయ జట్టులోకి వచ్చేందుకు దగ్గరి దారి దొరికింది. ఈ లీగ్ ఫ్రాంఛైజీలు యువ ప్రతిభ కోసం దేశవ్యాప్తంగా జల్లెడపడుతున్నాయి. ఒకప్పుడు దేశవాళీల్లో కొన్నేళ్ల పాటు సత్తా చాటితే తప్ప గుర్తింపు, జాతీయ జట్టులో చోటు దక్కేవి కావు. ఇప్పుడు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌లో రాణిస్తే చాలు- పేరు మార్మోగిపోతోంది. ఒక్క సీజన్లో నిలకడగా ఆడితే భారత జట్టు నుంచి పిలుపు వస్తోంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ ప్రధాన బౌలర్లలో ఒకడిగా మారిన అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్... ఇలా ఎంతోమంది ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చినవారే.
సమర్థ వినియోగం ఏదీ? పాఠశాల క్రికెట్ లీగ్స్ నుంచి వివిధ స్థాయుల్లో ప్రతిభావంతులను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో రాహుల్ ద్రవిడ్‌ది కీలక భూమిక. ఆటగాడిగా కెరీర్ ముగిసిన వెంటనే అండర్-19, ఇండియా-ఎ కోచ్‌గా మారి కుర్రాళ్లను తీర్చిదిద్దే బాధ్యతను ద్రావిడ్ కొన్నేళ్ల పాటు నిర్వర్తించాడు. రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ సహా చాలామంది యువ ఆటగాళ్లు అతడి శిక్షణలోనే రాటుతేలారు. బీసీసీఐ, సెలెక్టర్లు సైతం వీలైనంత పారదర్శకంగా వ్యవహరిస్తుండటంతో ప్రపంచంలో మరే దేశంలో లేనంత ప్రతిభావంతులతో భారత క్రికెట్ జట్టు కళకళలాడుతోంది. అయితే, ఈ ప్రతిభను భారత జట్టు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం లేదన్న విమర్శ ఉంది. నిలకడగా మ్యాచ్‌లు, సిరీస్‌లు గెలుస్తున్నా- దశాబ్ద కాలంగా ఒన్‌డేల్లో, టీ20ల్లో ఇండియా ప్రపంచకప్ గెలవలేదు. కొత్తగా ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్‌షిప్‌నూ సాధించలేదు. పెద్ద విజయాలతో ప్రపంచ క్రికెట్లో భారత్ జగజ్జేతగా అవతరిస్తేనే ఈ ప్రతిభకు సార్థకత. ఆస్ట్రేలియా వేదికగా నేటి నుంచి ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ సేన విజేతగా నిలిచి, భారత్ జట్టు సత్తాను ప్రపంచానికి చాటుతుందని ఆశిద్దాం.