తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వెంటిలేటర్ల తయారీలో భారత్​ భేష్​

మహమ్మారి కరోనా ఊపిరితిత్తులపై ప్రభావం చూపి.. ఊపిరి ఆడకుండా చేస్తోంది. దేశంలో కొవిడ్​ కేసులు పెరిగిన క్రమంలో ఊహించని రీతిలో వెంటిలేటర్ల అవసరం ఏర్పడింది. అప్పటికి దేశంలో ఉన్న వెంటిలేటర్ల సంఖ్య అంతంతమాత్రమే. 'భారత్‌లో తయారీ'లో భాగంగా వెంటిలేటర్ల ఉత్పత్తిని భారీగా పెంచారు. ఫలితంగా వెంటిలేటర్లను గతంలో వందల్లో తయారు చేయగా.. ప్రస్తుతం వేలల్లో తయారు చేస్తోంది భారత్​.

Indian breakthrough in the manufacture of ventilators for fight against Covid-19
వెంటిలేటర్ల తయారీలో భారీ భారత్​ ముందడుగు

By

Published : Oct 20, 2020, 7:51 AM IST

కొవిడ్‌పై యుద్ధానికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకొనే విషయంలో అన్ని దేశాలూ శక్తిమేర పోరాడుతున్నాయి. కొవిడ్‌ ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపి, అవి బలహీనపడేలా చేసినప్పుడు- రోగి 'వెంటిలేటర్‌'పై పోరాటం చేయాల్సి ఉంటుంది. దీంతో ఊహించని రీతిలో ఒక్కసారిగా వెంటిలేటర్ల అవసరం పెరిగింది. అనేక దేశాలు సరిపడా వెంటిలేటర్లను సమకూర్చుకునేందుకు మొదట్లో విఫలయత్నం చేశాయి. చాలా దేశాలకు వాటిని త్వరితగతిన తయారు చేసుకునే విధానం అవగతం కాలేదు. అప్పటికే ఉన్న వెంటిలేటర్ల కోసం అనేక దేశాలు పోటీపడ్డాయి. ఆ పోటీలో అందరూ కొనుగోలు చేయగా మిగిలినవి కొన్నే. ఒక దశలో కొందామన్నా దొరకని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం

మన దేశంలో ప్రారంభంలో కొవిడ్‌ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఎక్కువగా ఆధార పడటంతో వాటిపై పెనుభారం పడింది. అనేక ప్రభుత్వాసుపత్రులు రక్షణ ఉపకరణాలైన పీపీఈ కిట్లతోపాటు, వెంటిలేటర్లను సమకూర్చుకోవడంలో సతమతమయ్యాయి. అలాంటి సందర్భంలో దేశంలో లాక్‌డౌన్‌ వచ్చింది. దానివల్ల కొంత సమయం కలిసి వచ్చింది. తగినంత సామగ్రిని సమకూర్చుకొని, సమాయత్తమవడానికి అవకాశం ఏర్పడింది. సాంకేతికత పరంగా వెంటిలేటర్లు కొంత క్లిష్టమైనవి. వాటి తయారీ అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక ఆసుపత్రుల్లో రోగికి వెంటిలేటర్‌పై చికిత్స అందించే విషయంలో సిబ్బందికి సరైన శిక్షణ కూడా లేకపోవడం కొంతమేర ప్రతిబంధకంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎయిమ్స్‌ వైద్యుల సహకారంతో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖల సమన్వయంతో అనేక పట్టణాలు, నగరాల్లో వైద్య సిబ్బందికి వెంటిలేటర్ల వినియోగంపై శిక్షణ ఇవ్వగలిగారు. వ్యాధుల వ్యాప్తిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్న ప్రస్తుత సందర్భంలో- చాలా దేశాల్లో ఆరోగ్య సంరక్షణ సామర్థ్యం తక్కువగానే ఉన్నట్లు కనిపించింది.

130 కోట్లకుపైగా జనాభా ఉన్న భారత్‌లో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు ఏ మాత్రం సరిపోని పరిస్థితిలో ఉండగా పులి మీద పుట్రలా కొవిడ్‌ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూల్లో చికిత్సలు అందించే సామర్థ్యం అంతంత మాత్రమే. ఒకానొక సమయంలో- మూకుమ్మడిగా జనం ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు తలెత్తితే తట్టుకోగల సామర్థ్యం మన వైద్య వ్యవస్థకు ఉందా అనే అనిశ్చితి పీడించింది. ఆరోగ్య సంరక్షణ సామర్థ్యం ఎక్కువగా ప్రైవేటు రంగంలోనే ఉన్నందున, భారత్‌లో కొవిడ్‌తో చేసే యుద్ధంలో ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం కీలక అంశంగా గుర్తించి ఆ దిశగా ప్రణాళికలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఓ పరిశోధక బృందం సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఆసుపత్రుల్లో ఐసీయూ పడకల సంఖ్య మొత్తం ఆసుపత్రి పడకల సంఖ్యలో 5శాతం ఉంటుందని, అందులో కేవలం 50శాతం ఐసీయూ పడకలే వెంటిలేటర్లతో అమర్చి ఉన్నట్లు పేర్కొంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పీఎం-కేర్స్‌ ఫండ్‌ ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ అధీనంలో ఉన్న కొవిడ్‌ ఆసుపత్రులకు 'భారత్‌లో తయారీ'లో భాగంగా ఉత్పత్తి చేసే 50 వేల వెంటిలేటర్లను సరఫరా చేయడానికి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. జూన్‌ వరకల్లా 2,923 వెంటిలేటర్లు తయారయ్యాయి. వాటిని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేశారు.

దేశీయ సంస్థల పోటాపోటీ

అనేక సంస్థలు పోటీ పడి తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో వెంటిలేటర్లు తయారు చేశాయి. వాటిలో 30 వేలకుపైగా భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేయగా మిగిలిన వాటిని అనేక ఇతర సంస్థలు చేపట్టాయి. సంప్రదాయ వెంటిలేటర్‌ వాడిన సందర్భాల్లో మరణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన వైద్య వర్గాలు, దీనికి ప్రత్యామ్నాయమైన 'నాన్‌ఇన్వేజివ్‌ వెంటిలేషన్‌' పద్ధతిలో అనేక మంది ప్రాణాలు నిలిపాయి. ఇలాంటి నాన్‌ఇన్వేజివ్‌ వెంటిలేటర్ల తయారీలోనూ దేశీయ సంస్థలు పోటీ పడ్డాయి. దేశీయంగా ఒక్క వెంటిలేటర్‌ కూడా తయారు చేయలేని స్థాయి నుంచి నెలకు 30 వేలు తయారు చేసే స్థాయికి భారత సాంకేతిక పారిశ్రామిక రంగం ఎదిగింది.

భారత్‌ ప్రధానంగా ఐరోపా, చైనాల నుంచి వెంటిలేటర్లను దిగుమతి చేసుకునేది. ఫిబ్రవరిలో దేశంలో వెంటిలేటర్‌ తయారీ సంస్థలు ఎనిమిది మాత్రమే ఉన్నాయి. 'భారత్‌లో తయారీ'లో భాగంగా గతంలో నెలకు 50-100 వెంటిలేటర్లు మాత్రమే ఉత్పత్తి చేసే పెద్ద తయారీదారులు ఇప్పుడు 5,000-10,000 తయారు చేస్తున్నారు. దేశంలో వెంటిలేటర్ల వినియోగం తక్కువగా ఉండటం, మరోవైపు ప్రపంచ మార్కెట్లో డిమాండ్‌ అధికంగా ఉండటంతో వాటిపై నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసి ఎగుమతుల్ని అనుమతించారు. ఈ క్రమంలో కొవిడ్‌ అందరికీ అనేక విషాదాలను మిగిల్చినా, దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వృద్ధి చేసుకొనే విషయంలో బాగా తోడ్పడిందనే భావించాలి. 'భారత్‌లో తయారీ'లో భాగంగా వైద్య రంగంలో అనేక ఆవిష్కరణలకు ప్రస్తుత కష్టకాలంలోనే అంకురార్పణ జరగడం విశేషం.

రచయిత- డాక్టర్​ శ్రీభూషణ్​రాజు, హైదరాబాద్​ నిమ్స్​లో నెఫ్రాలజీ విభాగాధిపతి

ABOUT THE AUTHOR

...view details