శరవేగంగా మారిపోతున్న భౌగోళిక, వ్యూహాత్మక పరిస్థితుల్లో మనకంటూ ప్రత్యేకమైన ఆయుధాలను కలిగి ఉండటం తప్పనిసరి. సరిహద్దుల వెంట ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతాల్లో వాటిని మోహరించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా భారత సైన్యంలోని సాయుధ విభాగం చేపట్టిన శస్త్రాల ఆధునికీకరణ, స్వదేశీకరణ విధానాలు సరికొత్త ఫలితాలను అందించనున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తద్వారా చైనాతో లద్దాఖ్ సరిహద్దులో, పాకిస్థాన్‌తో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట ఉన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణిగే అవకాశం ఉంది.
వినూత్న పద్ధతులు
అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను రంగంలోకి దించడం, అదే సమయంలో స్వదేశీకరణను పెంపొందించడం వంటి సవాళ్లను భారత సాయుధ విభాగం ఎదుర్కొంటోంది. వాటికి పరిష్కారంగా వినూత్న పద్ధతులను అవలంబిస్తోంది. కొత్త ఆయుధ వ్యవస్థను సైన్యంలోకి ప్రవేశపెట్టినప్పుడు దాని ప్రయోగ పరీక్షకు చాలా సమయం పడుతుంది. ఒక నమూనాను బహువిధాలుగా పరిశీలించడం, పరీక్షించడం వల్ల ఆ సమయం గణనీయంగా తగ్గిపోవడంతో పాటు మోహరింపును వేగవంతం చేయవచ్చు. కె-9 వజ్ర శతఘ్ని వ్యవస్థను అత్యంత అధిక ఉష్ణోగ్రతలుండే ఎడారి ప్రాంతంలో మోహరించవచ్చు. దాన్ని అక్కడికే పరిమితం చేయకుండా పాకిస్థాన్ సరిహద్దు వెంబడి లద్దాఖ్‌లోని సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఎత్తయిన ప్రాంతంలో మోహరించడం మొదలుపెట్టారు. 2020 మేలో తూర్పు లద్దాఖ్‌లో చైనా కల్పించిన ఉద్రిక్త పరిస్థితుల తరవాత భారత్ తన మధ్య శ్రేణి శతఘ్నులు, దీర్ఘ శ్రేణి రాకెట్లను ఆ ప్రాంతంలో మోహరించింది. ధనుష్, కె-9 వజ్ర, తేలికపాటి ఎం777 శతఘ్నుల మోహరింపు వల్ల ఉత్తర సరిహద్దుల్లో ఇండియా సైనిక శక్తి మరింతగా పెరిగింది.
వాస్తవాధీన రేఖ వెంట చైనా సొంతంగా గ్రామాలను నిర్మిస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట తరచూ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకొంటున్నాయి. అందువల్ల భారత సైన్యం ఒక కె-9 వజ్రతో పాటు, స్వయంచాలిత హోవిట్జర్ శతఘ్ని సైనిక దళాన్ని అక్కడ నియమించింది. ప్రస్తుతం మరో వంద కె-9 వజ్ర శతఘ్నులను సమకూర్చుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. దానికి రక్షణ శాఖ అంగీకారం సైతం లభించింది. ఇప్పటికే ఆ ఆయుధాలు ప్రయోగ పరీక్షలను పూర్తిచేసుకున్నందువల్ల వాటి కొనుగోలు వెంటనే పూర్తవుతుందని సైనిక నిపుణులు భావిస్తున్నారు. కె-9 వజ్ర శతఘ్నుల ఆధునికీకరణ ప్రణాళికలో భాగంగా కొన్ని మార్పులు, చేర్పులతో వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించారు. శీతల వాతావరణంలోనూ అవి సమర్థంగా పనిచేయాలంటే ప్రాథమికంగా బ్యాటరీ, చమురు, లూబ్రికెంట్లపై శ్రద్ధ వహించాలి. మైనస్ ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పనిచేసేలా ఆయుధ వ్యవస్థలను రూపొందిస్తున్నట్లు సైనికాధికారులు చెబుతున్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఆయా ఆయుధ వ్యవస్థలు వేర్వేరు తీరుల్లో పనిచేస్తాయి. అందువల్ల వాటిలో మార్పుచేర్పులు తప్పనిసరి.