కరోనా కల్లోలం ఇటీవలి చరిత్రలో కనీవినీ ఎరుగని ఉపద్రవం. అది ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమించి జనజీవన విధానాలను, జీవనాధారాలను సమూలంగా మార్చేస్తోంది. ఈ మహమ్మారిని అధిగమించడానికి ఏ దేశానికాదేశం సొంత వ్యూహాలను రచించుకొంటోంది. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూనే ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభించడమెలా- అన్నది నేటి సవాలు. భారతదేశం ఈ సంక్లిష్ట కార్యాన్ని ఎంతో దక్షత, చతురత, పట్టుదల, భావుకతలతో నెరవేర్చడానికి కృషిచేస్తోంది.
కొవిడ్ సవాలు మన దేశంలో ఐక్యత, సంఘీభావాలను మరింత పటిష్ఠం చేసింది. భరత జాతి అనూహ్యంగా వచ్చిపడిన కష్టనష్టాల నుంచి ఎంత త్వరగా తేరుకోగలదో మరొక్కమారు నిగ్గుతేలింది. నాలుగు దశల లాక్‌డౌన్ పూర్తిచేసుకున్న తరవాత మూతపడిన ఆర్థిక ద్వారాలనే కాక కొత్త అవకాశాల తలుపులూ తెరవడానికి భారతదేశం నడుం కట్టింది. మన సహజ వనరులను సమర్థంగా, మానవ వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే వ్యూహాలకు పదును పెడుతోంది.
స్వావలంబన సాధనకు చేపట్టిన ఆత్మనిర్భర్ అభియాన్ పథకం మన ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలను పునరుత్తేజితం చేయబోతున్నది. వ్యవస్థాపకత, నవీకరణలను ప్రోత్సహిస్తూ, గ్రామీణ-పట్టణ పరస్పరాశ్రిత అభివృద్ధిని సాధించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలపై విస్తృత ప్రభావం చూపుతాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పురోభివృద్ధికి ఊతమిస్తాయి. కొవిడ్, ఆర్థిక మందగమనం విసురుతున్న సవాళ్లను గొప్ప అవకాశాలుగా మలచుకోవడానికి కేంద్ర నిర్ణయాలు దోహదం చేస్తాయి.
వనరుల వినియోగం కీలకం
భారత్ వంటి అధిక జనాభా దేశాలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా- కరోనా వైరస్ సృష్టించే బీభత్సం అంతాఇంతా కాదు. వైరస్ మన దేశంలో అడుగుపెట్టేనాటికి మాస్క్‌లు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ సాధనాలు (పీపీఈ) వంటి అత్యవసర పరికరాలు ఇక్కడి అవసరాలకు తగినంత లేవు. దాంతో ఉన్నపళాన ఈ అత్యవసర సాధనాలకోసం బృహత్తర యజ్ఞమే చేపట్టి, ఉత్పత్తిని అమాంతం పెంచుకున్నాం.
కొవిడ్ చికిత్సకు ఉపకరించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు ప్రపంచమంతటా పెరిగిన గిరాకీని భారతదేశం సంతోషంగా తీర్చింది. కోరిన దేశాలకు కాదనకుండా ఆ మందును పంపింది. ఉరుములేని పిడుగులా వచ్చిపడిన కరోనా వైరస్ జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. విదేశీ సరఫరా గొలుసులపై ఆధారపడితే స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం సంభవిస్తుందని కనువిప్పు కలిగించింది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వావలంబన సాధనకు పిలుపిచ్చారు.
దీని అర్థం మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఏకాకిగా జీవించాలని, స్వీయ వాణిజ్య రక్షణ ధోరణులను పాటించాలని కాదు. భారత్ తన స్వతస్సిద్ధ బలాలను గ్రహించి, వాటిని పూర్తిగా వినియోగించుకొంటూ ఆచరణాత్మక పంథాలో సాగుతూ స్థిరంగా అభివృద్ధి సాధించాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశం. అది సాకారం కావాలంటే మన విధాన చట్రంలో సంస్కరణలు రావాలి. కొత్త జవజీవాలు సంతరించుకుంటూ కొవిడ్ అనంతర అనిశ్చిత ప్రపంచంలో ఆర్థికంగా దూసుకెళ్లడానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలి. రేపు మార్పుచేర్పులకు లోనుకానున్న అంతర్జాతీయ సరఫరా గొలుసులను తమవైపు ఆకర్షించుకోవడానికి దేశాల మధ్య పోటీ ఉద్ధృతమవుతుంది.
అన్ని రంగాల్లో సామర్థ్యం పెంచుకుంటూ నాణ్యతకు పట్టంకడుతూ, స్వావలంబన సాధించినప్పుడు అంతర్జాతీయ సరఫరా గొలుసులలో భారత్ కీలక పాత్ర నిర్వహించగలుగుతుంది. అందుకే ప్రధాని మోదీ మౌలిక వసతులను పటిష్ఠం చేసి, ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తూ, మానవ వనరులకు నైపుణ్యాలు సంతరింపజేస్తూ, స్వదేశీ సరఫరా గొలుసులను పరిపుష్టం చేస్తూ భారతదేశానికి ఆర్థికంగా కొత్త ఊపు తీసుకురావాలని లక్షిస్తున్నారు. స్వావలంబన సాధన పరమార్థమిదే. ఈ మహా యజ్ఞాన్ని ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’గా వ్యవహరిస్తున్నాం.
ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో పురోభివృద్ధి శక్తులను పునరుత్తేజితం చేయాలని ఈ పథకం ఉద్దేశిస్తోంది. ఈ లక్ష్యసాధనకు ప్రాకృతిక, మానవ, సాంకేతిక వనరులను శక్తిమంతంగా ఉపయోగించాలి. మనలో నిద్రాణంగా ఉన్న అభివృద్ధి సాధక శక్తిని వెలుగులోకి తీసుకురావాలి.
శక్తియుక్తులకు కొదవలేదు...