తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భారత్​లో విదేశీ విద్యకు పెద్దపీట - విదేశీ విద్యతో లాభాలు

అంతర్జాతీయ వర్శిటీల ఏర్పాటు వల్ల నాణ్యమైన ఆధునిక కోర్సులు, బోధన అందుబాటులోకి వస్తాయని, దేశ విద్యారంగంలో పోటీతత్వం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. దేశీయ విద్యాసంస్థలూ ప్రమాణాలను మెరుగుపరచుకోవడంపై దృష్టిపెడతాయని యోచిస్తోంది. అయితే వీటి ఏర్పాటుతో.. ప్రయోజనాలే కాక కొన్ని సవాళ్లను కూడా కేంద్రం ఎదుర్కోవాల్సి ఉంది.

Foreign Universities_India
భారత్​లో విదేశీ విద్యకు పెద్దపీఠ

By

Published : Nov 6, 2020, 8:33 AM IST

Updated : Nov 6, 2020, 9:25 AM IST

విదేశీ వర్సిటీలు భారత్‌లో విద్యాసంస్థలు నెలకొల్పేందుకు వీలు కల్పిస్తూ- కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన విద్యావిధానం తీసుకొచ్చింది. ప్రపంచంలోని వంద అత్యుత్తమ విద్యాసంస్థలను దేశంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించాలన్నది ప్రభుత్వ యోచన. ఉన్నత విద్య కోసం ఏటా లక్షల సంఖ్యలో భారతీయ విద్యార్థులు విదేశాలకు తరలి వెళ్ళాల్సిన అవసరాన్ని, అందుకయ్యే ఖర్చును, విదేశ మారక ద్రవ్య వినిమయాన్నీ తగ్గించడం; నాణ్యమైన విద్యను మరిందరికి చేరువ చేయడం వంటి ప్రయోజనాలెన్నో ఈ నిర్ణయంతో ముడివడి ఉన్నాయి. లక్ష్యం మంచిదే అయినా ఈ విధానాన్ని సమర్థంగా అమలు చేయనిపక్షంలో- దేశ యువతకు, విద్యారంగానికి పెను సవాళ్లు తప్పవు!

ప్రమాణాలు కీలకం...

శాస్త్ర, సాంకేతికత, ఇంజినీరింగ్‌, గణిత (స్టెమ్‌) అంశాల్లో ఉన్నత విద్యార్జన కోసం భారత్‌ నుంచి ఏటా లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాల్లోని పేరున్న విశ్వవిద్యాలయాల్లో చేరుతున్నారు. వీరిలో ఎక్కువమంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, జర్మనీ తదితర దేశాలకు వెళ్లేందుకే ప్రాధాన్యమిస్తున్నారు.

ఇలా 2017-18లో 7,86,576 మంది, ఆ మరుసటి విద్యా సంవత్సరంలో 6,20,156 మంది యువతీ యువకులు విదేశాలకు తరలివెళ్ళారు. 2019 జులైనాటికి విదేశాల్లో చదువుతున్న మొత్తం భారతీయ విద్యార్థుల సంఖ్య 10.9 లక్షలకుపైనే ఉన్నట్లు విదేశీ వ్యవహారాలశాఖ పార్లమెంటుకు తెలిపింది.

కరోనా ప్రభావం...

కరోనా కారణంగా ఈ ఏడాది ప్రవేశాలు జాప్యమైనా, విదేశాలకు వెళ్లి చదువుకోవాలని నిరీక్షిస్తున్న వారి సంఖ్య మాత్రం భారీగానే ఉంది. 2013-14లో విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థులు సుమారు రూ.14,115 కోట్లు వెచ్చిస్తే, 2017-18 నాటికి ఆ మొత్తం రూ.20,801 కోట్లకు పెరిగినట్లు రిజర్వు బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి.

విదేశీ వర్సిటీలకు అనుమతివ్వడం ద్వారా మన విద్యార్థులు దేశీయంగానే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన కోర్సులను అభ్యసించేందుకు వీలు కలగడమే కాకుండా, భారీ మొత్తంలో విదేశ మారక ద్రవ్యం మిగులుతుందన్నది ప్రభుత్వ భావన. భారత ప్రభుత్వం స్థలం, విద్యుత్తు, నీరు, రహదారులు వంటి మౌలిక వసతులను సమకూర్చడం ద్వారా వాటి వ్యవస్థాపన వ్యయం, ఆ మేరకు ఫీజులు తగ్గుతాయి. తద్వారా మధ్య తరగతి కుటుంబాల వారూ ఈ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు వీలు కలుగుతుంది.

ఆ తరహా సమస్యలుండవు...

విదేశాల్లో భారతీయ విద్యార్థులకు కన్సల్టెంట్ల వేధింపులు ఎదురవుతున్నాయి. ఫీజులను ఉన్నఫళంగా పెంచి ఇబ్బంది పెడుతున్నారు. రాత్రికి రాత్రి విద్యాసంస్థలను ఎత్తివేస్తున్నారు. విదేశీ వర్సిటీల రాకతో ఈ తరహా సమస్యలు ఉండవు. నాణ్యమైన ఆధునిక కోర్సులు, బోధన అందుబాటులోకి రావడంతో దేశ విద్యారంగంలో పోటీతత్వం పెరుగుతుంది. దేశీయ విద్యాసంస్థలూ ప్రమాణాలను మెరుగుపరచుకోవడంపై దృష్టిపెడతాయి. ఈ ప్రయోజనాలతోపాటు కొన్ని సవాళ్లూ లేకపోలేదు.

లోపించిన స్పష్టత!

విదేశీ విద్యాసంస్థలు భారత్‌లో నెలకొల్పే కళాశాలల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలనే పాటిస్తాయా? వాటిలో చదువుకునే విద్యార్థులకు విదేశీ సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయా? ఈ అంశాలకు సంబంధించి స్పష్టత లేదు.

ఒకవేళ ఆశించిన స్థాయిలో ఆయా సంస్థలు విద్యాప్రమాణాలు పాటించని పక్షంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదీ తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆయా దేశాలతో ముడివడిన దౌత్య అవసరాలు, ఇతర ఒత్తిళ్ల నేపథ్యంలో భారత ప్రభుత్వం కొన్ని పరిమితులు ఎదుర్కోవచ్చు.

'భారతీయ నైపుణ్యాల నివేదిక-2019' ప్రకారం, దేశంలో ఇంజినీరింగ్‌, వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేసిన వారిలో 47.38 శాతానికే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఉంటున్నాయి. 2014 (33.95శాతం)తో పోలిస్తే ఇది కొంత మెరుగే. అయితే- అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌, ఐటీ సంస్థలు మాత్రం మన విద్యార్థుల నైపుణ్యాలపై పెదవి విరుస్తున్నాయి. ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో 94శాతానికి పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు ఉండటం లేదని, తాము ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇవ్వాల్సి వస్తోందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే 22 ఐఐటీల్లో 3,709 (38శాతం) బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిరుడు పార్లమెంటుకు తెలిపింది.

నైపుణ్యాలే ప్రధానం

పేరున్న కంపెనీలు సహజంగానే ఉద్యోగార్థుల కోసం ప్రతిష్ఠాత్మక సంస్థల వైపు చూస్తాయి. నూతన విద్యావిధానం ప్రకారం అత్యుత్తమ విదేశీ సంస్థలే భారత్‌లో కళాశాలలు నెలకొల్పుతాయి. ఆ సంస్థల్లో ప్రాంగణ నియామక మేళాలు నిర్వహించేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి. తద్వారా దేశీయ కళాశాలల్లో చదివే ప్రతిభావంతులు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలకు దూరమయ్యే ప్రమాదమూ ఉంది.

భారతీయ విద్యాసంస్థలు ఇప్పటికే నిధులు, సిబ్బంది, వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. 2019-20 బడ్జెట్లో రూ.94,853 కోట్లను ప్రభుత్వం విద్యారంగానికి వెచ్చించింది. స్థూల దేశీయోత్పత్తిలో ఇది 4.6శాతం మాత్రమే. నీతి ఆయోగ్‌ నిర్దేశించిన ప్రమాణాలు చేరుకోవాలంటే జీడీపీలో కనీసం ఆరు శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. విదేశీ విద్యాసంస్థల ఆగమనం దేశీయ విద్యా వ్యవస్థల్లో పోటీతత్వం పెరగడానికి, నాణ్యత ఇనుమడించడానికి కారణమైతే అంతకుమించి కావలసింది లేదు. ఆ మేరకు ఫలితాలు సాధించాలంటే- దేశీయ విద్యావ్యవస్థను పునాదిస్థాయి నుంచి బలోపేతం చేసేలా విస్తృత దిద్దుబాటు చర్యలతో పటిష్ఠ కార్యాచరణ అత్యవసరం.

రచయిత- తమ్మిశెట్టి రఘు బాబు.

ఇదీ చదవండి:సోనాలి మాండ్లిక్​.. మట్టిలో మాణిక్యం

Last Updated : Nov 6, 2020, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details