బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాపై కలిసికట్టుగా కదం తొక్కిన భారత క్రికెట్ జట్టు అసాధ్యమనుకున్న చారిత్రక విజయాన్ని సుసాధ్యం చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 'డ్రా'తో గట్టెక్కితే చాలనుకున్న దశనుంచి, పటిష్ఠ బౌలింగును దీటుగా ఎదుర్కొంటూ 2-1 తేడాతో సిరీస్ గెలుపును ఒడిసి పట్టేలా యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా విక్రమించిన తీరు చిరస్మరణీయమైనది. 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి అన్నది ఎరుగని అమేయ ఆస్ట్రేలియా జట్టుకిది దారుణమైన భంగపాటు. గాయాల బారిన పడిన భారత జట్టుతో సిరీస్‌లో సమ ఉజ్జీగా నిలవడం గత సిరీస్ ఓటమి కన్నా ఘోరమని, ఆరు నూరైనా ఆసీస్ నెగ్గి తీరాలని గిరిగీసిన మాజీ సారథి రికీ పాంటింగ్ ప్రభృతులకిది మింగుడుపడని పరిణామం. ఆఖరి రోజున అనూహ్య రీతిలో బ్యాటుతో రాణించిన రిషభ్ పంత్ ఒక్కడే కాదు- బంతితో నిప్పులు చెరిగిన హైదరాబాదీ సిరాజ్, ఆల్‌రౌండ్ ప్రతిభ చాటిన సుందర్-శార్దూల్ ద్వయం, భీకర దాడికి ఓపిగ్గా ఎదురొడ్డి నిలిచిన పుజారా... భారత్ సాధించిన అద్భుత విజయంలో కీలక భూమిక పోషించారు.
విస్మయపరచే వాస్తవమేమిటంటే, రానున్న కొన్ని సంవత్సరాలపాటు క్రికెట్ అభిమానులందరికీ గుర్తుండిపోయే ప్రస్తుత సిరీస్‌లోని నాలుగు టెస్టులూ పూర్తిగా ఆడిన భారత ఆటగాళ్లు ఇద్దరే. ఒకరు తాత్కాలిక కెప్టెన్ రహానే, మరొకరు పుజారా. జట్టును వెంటాడిన గాయాల సమస్య కారణంగా ప్రతి టెస్టుకూ ఆటగాళ్ల కూర్పులో మార్పులు అనివార్యమయ్యాయి. సొంత గడ్డపై దెబ్బతిన్న బెబ్బులి లాంటి ఆస్ట్రేలియా జట్టును ఇన్ని ఢక్కాముక్కీలు చవిచూసిన టీమిండియా నిలువరించగలదా అనే అనుమానాల్ని పటాపంచలు చేస్తూ- ఆఖరి రోజున మూడు వందలకు పైగా పరుగులు రాబట్టడం, మన యువ ఆటగాళ్ల పోరాట స్ఫూర్తిని చాటింది. లక్ష్య ఛేదనలో అసాధారణ పటిమ కనబరచినందుకే భారత జట్టుపై నేడింతగా అభినందనల విరిజల్లు కురుస్తోంది!
గత ఏడాది మార్చ్ నెల మొదట్లో న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని వచ్చిన దరిమిలా కరోనా సంక్షోభం కారణంగా భారత క్రికెట్ ఆటగాళ్లు కొన్ని నెలలపాటు బరిలోకి దిగనేలేదు. ఇటీవల యూఏఈ ఆతిథ్యంలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) సందడిని వెన్నంటి, దుర్భేద్యమైన ఆసీస్ జట్టుతో భారత్ అమీతుమీకి సన్నాహకాలతో అసంఖ్యాక టీవీక్షకులు పరవశులయ్యారు. తొలి రెండు పరిమిత ఓవర్ల ఒక రోజు పోటీల్లో తలబొప్పి కట్టిన విరాట్ కోహ్లి బృందం మూడో ఒన్‌డేలో ప్రత్యర్థిని కంగుతినిపించింది. ఆపై రెండు టీ20లలో చెలరేగిన టీమిండియా మూడోదానిలో చతికిలపడేసరికి, టెస్టుల పరంపరపై క్రీడాసక్తి ద్విగుణీకృతమైంది.
అడిలైడ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన ఆధిక్యాన్ని నేలపాలు చేస్తూ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కోహ్లి సేన చాపచుట్టేసి వైరి జట్టుకు పాదాక్రాంతమైన వైనం దిగ్భ్రాంతపరచింది. అంతగా కుంగిపోయిన జట్టును రెండోటెస్టుకు గాడిన పెట్టడంలో రహానే నాయకత్వ దక్షత నిరుపమానమైనది. నాలుగు మార్పులతో మెల్‌బోర్న్ హోరాహోరీకి సిద్ధమైన భారత్- జడేజా, సిరాజ్, గిల్, పంత్‌లతోపాటు తక్కినవారూ సమష్టిగా రాణించడంతో, పది రోజుల వ్యవధిలోనే ఘోర పరాభవానికి బదులు తీర్చుకుంది. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా పైచేయి సాధించకుండా అశ్విన్, విహారి, పుజారా మొండిగా ప్రతిఘటించడమే- ఇరు జట్లనూ సమ ఉజ్జీలుగా నిలిపింది. అది గెలుపంతటి 'డ్రా'గా ఉద్దండ క్రికెటర్లు, విశ్లేషకుల మన్ననలందుకోగా- బ్రిస్బేన్‌లో తాజా విజయం, అపార పోరాట పటిమకు చెరగని చిరునామాగా యువ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. ఐపీఎల్ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన దిగ్గజ క్రీడాకారులతో కలిసి ఆడే అవకాశం దేశీయంగా ఉన్న పుష్కల ప్రతిభను వెలికితీసిందన్న మాజీ కెప్టెన్ గావస్కర్ విశ్లేషణ అక్షరసత్యం. ఆస్ట్రేలియాతో పోరులో భారత్‌ను ఇక్కట్లలోకి నెట్టిన పరిమితులు, ప్రతిబంధకాలు పునరావృతం కాని రీతిలో ఎదిరి బృందాన్ని బట్టి జట్టు కూర్పు విషయంలో మున్ముందు బీసీసీఐ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకం!