తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బైడెన్​ గెలుపు.. భారత్​- అమెరికాకు కొత్త మలుపు

దేశీయంగా నెలకొన్న సమస్యలను సులువుగా పరిష్కరించుకోగల పాలనానుభవం, నేర్పరితనం బైడెన్‌కు ఉంది. అంతర్జాతీయ సంక్లిష్టతలను అర్థం చేసుకొని చురుగ్గా దూసుకుపోగల నైపుణ్య బృందం ఆయనకు అండగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై మరేమాత్రం ఆలస్యం చేయకుండా బైడెన్‌ పని మొదలు పెడతారనడంలో అనుమానం లేదు. ఈ నేపథ్యంలో భారత్​-అమెరికా బంధం మరింత దృఢంగా మారే అవకాశం ఉంది.

India-US
బైడెన్​ గెలుపు.. భారత్​-అమెరికాకు కొత్త మలుపు

By

Published : Jan 22, 2021, 5:31 AM IST

Updated : Jan 22, 2021, 6:38 AM IST

ఉద్రిక్త పరిస్థితుల మధ్య, ఉద్విగ్న వాతావరణంలో అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్‌ బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో అమెరికా అధ్యక్షులుగా వ్యవహరించిన బరాక్‌ ఒబామాకుగానీ, డొనాల్డ్‌ ట్రంప్‌నకుగానీ పాలనానుభవం లేదు. రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగానేగాక- సెనేటర్‌గా న్యాయ, విదేశీ వ్యవహారాల కమిటీల్లో చురుకుగా పనిచేసి, ఎన్నో కీలకమైన శాసనాలకు ప్రాణం పోసిన అనుభవం బైడెన్‌ సొంతం. దేశీయంగా రాజకీయ విభజనలు కాకరేపుతున్న పరిస్థితుల్లో- బైడెన్‌కు విదేశాంగ విధానంపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉండదన్నది కొందరి అభిప్రాయం. వివిధ అంశాల్లో తనకు చేదోడువాదోడుగా నిలిచే విదేశాంగ బృందాన్ని బైడెన్‌ ఇప్పటికే ప్రకటించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణులెందరో అందులో సభ్యులుగా ఉన్నారు. దేశీయంగా నెలకొన్న సమస్యలను సులువుగా పరిష్కరించుకోగల పాలనానుభవం, నేర్పరితనం బైడెన్‌కు ఉంది. అంతర్జాతీయ సంక్లిష్టతలను అర్థం చేసుకొని చురుగ్గా దూసుకుపోగల నైపుణ్య బృందం ఆయనకు అండగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై మరేమాత్రం ఆలస్యం చేయకుండా బైడెన్‌ పని మొదలు పెడతారనడంలో అనుమానం లేదు.

సమర్థ బృందం

ఉపాధ్యక్షుడిగా విదేశాంగ విధానాలపై బైడెన్‌ వివిధ సందర్భాల్లో విస్పష్టమైన వైఖరిని ప్రకటించారు. భారత్‌-అమెరికా అణు ఒప్పందానికి డెమెక్రాటిక్‌ పార్టీలో అంతర్గత మద్దతు కూడగట్టడంలో సుమారు పదిహేనేళ్ల క్రితం ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. అమెరికా విదేశాంగ విధాన తీరుతెన్నులెలా ఉంటాయో అర్థం చేసుకోవాలంటే బైడెన్‌ ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా బృందంలోని సభ్యుల నేపథ్యాన్ని, వివిధ అంశాలపై వారి దృక్పథాన్ని తరచి చూడాల్సి ఉంటుంది. జేక్‌ సల్లివాన్‌ అనే 43ఏళ్ల వయస్కుడిని జాతీయ భద్రతా సలహాదారుగా బైడెన్‌ నియమించారు.

"ప్రపంచంలోనే అత్యధిక సవాళ్లతో కూడుకున్న జాతీయ భద్రతా సలహాదారు పదవీ నిర్వహణకు- మహత్తర మేధోసంపత్తి, అపార అనుభవం, తిరుగులేని సంయమనం కలిగిన సల్లివాన్‌ మాత్రమే తగినవాడు" అని ఆయన నియామకం సందర్భంగా బైడెన్‌ వేనోళ్ల శ్లాఘించారు. ప్రపంచాధిపత్యానికి 'బీజింగ్‌' నాయకత్వం తహతహలాడుతోందని, దాని వైఖరి అమెరికా విదేశాంగ విధానానికి ప్రధాన అడ్డంకిగానూ, సవాలుగానూ ఉందన్నది సల్లివాన్‌ వాదన.

ప్రపంచ శక్తిగా ఆవిర్భవించే క్రమంలో చైనా రెండు రకాల విధానాలు అనుసరిస్తోందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఆసియాలో పట్టు సాధించి ప్రాంతీయంగా తిరుగులేని శక్తిగా నిలవడం చైనా మొదటి లక్ష్యం. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పట్టునిలుపుకొని అంతర్జాతీయ వేదికపై మహత్తర శక్తిగా ఆవిర్భవించడం 'బీజింగ్‌' రెండో విధానం. నిర్ణయించుకున్న లక్ష్యాల మాట ఎలా ఉన్నా వాటిని సాధించే విషయంలో మాత్రం చైనాకు ప్రాంతీయంగా జపాన్‌, ఇండియా, వియత్నాం వంటి దేశాలనుంచి సవాళ్లు ఎదురవుతాయన్నది సల్లివాన్‌ అభిప్రాయం. అంతర్జాతీయంగా అహేతుక వ్యాపార, వాణిజ్య విధానాలను చైనా అనుసరించిందని, అందువల్ల ఐరోపా దేశాలు 'బీజింగ్‌'ను తుదకంటా వ్యతిరేకిస్తాయని; 'వాషింగ్టన్‌'తో వాణిజ్య యుద్ధం సాగించాలన్న విధానమూ 'బీజింగ్‌'కు ప్రతిబంధకమవుతుందన్నది ఆయన విశ్లేషణ. ఇండియా, జపాన్‌ వంటి ప్రాంతీయ శక్తులతో వీలైన మేర సంబంధాలు బలపరచుకుంటే అమెరికాకు మేలు జరుగుతుందంటారు సల్లివాన్‌.

అత్యంత కీలకమైన విదేశాంగ విభాగం ఆంటోనీ బ్లింకన్‌కు దఖలు పడింది. బైడెన్‌తో కలిసి విదేశాంగ వ్యవహారాలపై 20ఏళ్లపాటు పనిచేసిన అనుభవం బ్లింకన్‌కు ఉంది. యవ్వనప్రాయంలో బ్లింకన్‌ చాలావరకు ఐరోపాలోనే గడిపారు. ఆయన ఫ్రెంచి సైతం మాట్లాడగలరు. "స్నేహితులు, భాగస్వాములు, మిత్రపక్షాలు పుష్కలంగా ఉన్నప్పుడు అమెరికా ప్రజలు సురక్షితంగా ఉన్నారు" అన్న బ్లింకన్‌ వ్యాఖ్యలతో బహుశా విభేదించేవారెవరూ ఉండకపోవచ్చు. భద్రత అంశాలను మినహాయించి పర్యావరణ మార్పులు, ఆరోగ్యం వంటి అంశాలపై చైనాతో కలిసి పనిచేసే అవకాశాలున్నాయంటున్న బ్లింకన్‌ అభిప్రాయం- సల్లివాన్‌ దృక్పథంతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉన్నట్లే కనిపిస్తుంది. అమెరికన్‌ విదేశాంగ నిపుణులు, వాణిజ్యవేత్తలు, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు చైనాతో అప్రమత్తంగా మెలగాలని పదేపదే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితుల్లో- చైనాపై అగ్రరాజ్య విధానం ఇలాగే ఉండబోతోందని ఇదమిత్థంగా చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదు. ఇండియాపై అమెరికా వైఖరిపై కొంత స్పష్టత ఉంది. 'సీఏఏ', 'కశ్మీర్‌' వంటి అంశాలపై భారత వైఖరికి అమెరికా విధానం భిన్నంగానే ఉండవచ్చు. "ఈ అంశాలపై అవసరమైనప్పుడు సూటిగా, నిర్మొహమాటంగా" వ్యాఖ్యానిస్తానని బ్లింకన్‌ గతంలో చెప్పారు. "భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడం, పటిష్ఠంగా తీర్చిదిద్దుకోవడం అమెరికాకు అత్యంత ప్రాధాన్య అంశం. ఇండో-పసిఫిక్‌ ప్రాంత భవిష్యత్తుకు; మనమందరం ఆశిస్తున్న వాతావరణం నెలకొనడానికి భారత-అమెరికా సంబంధాలు దృఢంగా ఉండటం అవసరం" బ్లింకన్‌ వ్యాఖ్యలు అమెరికా విదేశాంగ విధానంలో భారత్‌కు అమిత ప్రాధాన్యం ఉందన్న విషయాన్నే తేటతెల్లం చేస్తున్నాయి.

చైనాతో జాగ్రత్త

ప్రపంచాన్ని కొవిడ్‌ అట్టుడికిస్తున్నప్పుడు చైనా కఠినమైన వాణిజ్య విధానాలతో వివిధ దేశాలను ఇబ్బంది పెట్టింది. కొవిడ్‌ వైరస్‌పై విచారణ జరగాలన్నందుకుగాను ఆస్ట్రేలియాపై చైనా దౌత్యవేత్తలు పెద్దనోరు వేసుకుని విరుచుకుపడ్డారు. ఇండియాతోపాటు జపాన్‌, వియత్నాం భూభాగాలనూ కబళించాలని 'బీజింగ్‌' తహతహలాడుతోంది. రష్యానుంచి వ్లాదివొస్తొక్‌ ప్రాంతాన్ని, మధ్య ఆసియా దేశాలనుంచి పామిర్‌ పీఠభూమిని చేజిక్కించుకోవాలంటూ చైనా సామాజిక మాధ్యమాల్లో కొంతకాలంగా చర్చ జరుగుతోంది. సైనికంగా, ఆర్థికంగా చైనా దూకుడుకు గట్టిగా అడ్డుకట్ట వేసిన భారత్‌తో స్నేహం పెంచుకోవాలన్న అభిప్రాయం అంతర్జాతీయంగా బలపడుతోంది. హిందూ మహాసముద్రంలో చైనా ఆక్రమణకాంక్షలకు చెక్‌ చెప్పాలంటే భారత్‌ తోడ్పాటు తప్పనిసరి అన్న భావన క్రమంగా విస్తరిస్తోంది. చైనా, పాకిస్థాన్‌ల మధ్య పెనవేసుకున్న అపవిత్ర పొత్తుపై, ఆ రెండు దేశాలూ కలిసి జమ్ము కశ్మీర్‌లో పాల్పడుతున్న ఆగడాలపై అమెరికన్‌ విధానకర్తల్లో అవగాహన పెంచేందుకు భారత్‌ నిరంతరం కృషి చేయాలి. కశ్మీర్‌ ఉగ్రవాదానికి, లద్దాఖ్‌లో చైనా దూకుడుకు మధ్య ముడివడిన బంధాన్ని 'వాషింగ్టన్‌' నాయకత్వానికి అర్థమయ్యేలా తెలియజెప్పేందుకు భారత దౌత్యవేత్తలు, విధానకర్తలు, మేధావులు అవిశ్రాంతంగా పనిచేయాలి. భారతీయ సంతతికి చెందిన 20మందిని తన యంత్రాంగంలో కీలక సభ్యులుగా బైడెన్‌ నియమించడం ఆహ్వానించదగిన పరిణామం. ఇరు దేశాల మధ్య మేలిమి సంబంధాలకోసం భారత వ్యాపార, సాంకేతిక, మేధావి వర్గాలన్నీ అగ్రరాజ్యంలోని ఇండో అమెరికన్లతో కలిసిమెలిసి పనిచేయాలి. ప్రస్తుత అంతర్జాతీయ వాతావరణంలో భారత్‌, అమెరికాల మధ్య బంధం మరింత బలపడే అవకాశాలే మెండుగా ఉన్నాయన్నది నిర్ద్వంద్వం!

- సంజయ్​ పులిపాక, 'దిల్లీ పాలసీ గ్రూప్​'లో సీనియర్​ ఫెలో

Last Updated : Jan 22, 2021, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details