తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భారత్​ను విస్మరించిన అమెరికా- రష్యానే కారణం! - india-us relations latest news

India US relations: ఊహించిన విధంగానే జీపీఆర్‌లో చైనాపై అగ్రరాజ్యం కన్నెర్ర చేసింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై ప్రధానంగా దృష్టి సారిస్తామని ప్రకటించింది. ఇంతటి కీలక విషయంలో భారత్‌ను అమెరికా విస్మరించడం చర్చనీయాంశమైంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటనే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. భారత్​పై కాట్సా అస్త్రాన్ని ప్రయోగించేందుకు యోచిస్తున్న అమెరికా, జీపీఆర్‌ ద్వారా ఆ దిశగా సంకేతాలిస్తోందా అన్న ప్రశ్నా ఉత్పన్నమవుతోంది.

india america relations
భారత్​ అమెరికా సంబంధాలు

By

Published : Dec 10, 2021, 7:01 AM IST

India America relations: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంకల్పించిన యూఎస్‌ ప్రపంచ స్థితి సమీక్ష(జీపీఆర్‌) ముగిసినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. జాతీయ వ్యూహాలు, లక్ష్యాలకు తగ్గట్టుగా విదేశాల్లో ఉన్న అమెరికా దళాలను ఏకతాటిపై నడిపించడం జీపీఆర్‌ ముఖ్యోద్దేశం. ఊహించిన విధంగానే ఇందులో చైనాపై అగ్రరాజ్యం కన్నెర్ర చేసింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై జీపీఆర్‌ ప్రధానంగా దృష్టి సారిస్తుందని వాషింగ్టన్‌ ప్రకటించింది. ఇంతటి కీలక విషయంలో భారత్‌ను అమెరికా విస్మరించడం చర్చనీయాంశమైంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను నిలువరించడంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అగ్రరాజ్యం సైతం ఇండియాకు ఇంతకాలం పెద్దపీట వేసింది. అటువంటిది జీపీఆర్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌ భాగస్వామ్యంతో ఏర్పరచిన క్వాడ్‌ ప్రస్తావన సైతం రాలేదు. ఇండియాపై కాట్సా అస్త్రాన్ని ప్రయోగించేందుకు యోచిస్తున్న అమెరికా, జీపీఆర్‌ ద్వారా ఆ దిశగా సంకేతాలిస్తోందా అన్న ప్రశ్నా ఉత్పన్నమవుతోంది.

నాటో మిత్రపక్షాలు ఆస్ట్రేలియా, జపాన్‌, దక్షిణ కొరియాతో పాటు పదికిపైగా మధ్యఆసియా, ఆఫ్రికా దేశాలతో జీపీఆర్‌ నిర్వహించినట్టు అమెరికా అధికారులు ప్రకటిం చారు. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున జీపీఆర్‌ను ప్రారంభించారు. ఆ దేశ రక్షణశాఖ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ నేతృత్వంలో సమీక్ష సమావేశం జరిగింది. రక్షణ శాఖతోపాటు జాతీయ భద్రతా మండలి, యూఎస్‌ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ, జాతీయ నిఘా సంస్థ జీపీఆర్‌లో ప్రధాన భూమిక వహిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన కారణంగానే జీపీఆర్‌ విషయంలో భారత్‌పై అమెరికా కినుక వహించి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యానికి శత్రుదేశమైన రష్యాతో ఇండియాకు దశాబ్దాల మైత్రి ఉంది. పుతిన్‌- ప్రధాని నరేంద్ర మోదీ భేటీతో ఇరు దేశాల బంధం బలోపేతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 చర్చలు కీలకంగా నిలిచాయి. ఈ భేటీలతో సైనిక, సాంకేతికత పరంగా భారత్‌కు రష్యా సహకారం దక్కనుంది. భారత్‌కు అధునాతన ఎస్‌-400 క్షిపణి వ్యవస్థను రష్యా అందించడం ఇప్పటికే మొదలైంది. ఇకపై ఇరు దేశాలు ఎస్‌-500 క్షిపణులపై చర్చలు జరుపుతాయన్న కథనాలూ వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక, శక్తిమంతమైన రక్షణ వ్యవస్థగా ఎస్‌-500 గుర్తింపు పొందింది. భారత్‌, చైనా సహా రష్యాతో సుదీర్ఘ అనుబంధం కలిగిన దేశాలు ఎస్‌-500 వ్యవస్థను కొనుగోలు చేస్తాయని ఇటీవల రష్యా ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

త్వరలోనే ఎస్‌-500 క్షిపణి వ్యవస్థ రష్యా సైన్యంలోకి చేరనుంది. 2030 నాటికి వాటి ఎగుమతులను ప్రారంభించాలని పుతిన్‌ సర్కారు భావిస్తోంది. ఆ దేశ ఆయుధ ఎగుమతుల సంస్థ అధిపతి అలెగ్జాండర్‌ మిఖేవ్‌ ఆ విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారు. రష్యా నుంచి ఎస్‌-400 వ్యవస్థను భారత్‌ కొనుగోలు చేయడంపై అమెరికా గుర్రుగా ఉంది. తమ హెచ్చరికలను భారత్‌ బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. భారత్‌ను ఆంక్షల చట్రంలో బిగించేలా కాట్సా (సీఏఏటీఎస్‌ఏ) చట్టాన్ని ప్రయోగించే సంకేతాలు సైతం పంపింది. రష్యా ఆయుధ ఒప్పందాలను నివారించి, తద్వారా ఆ దేశానికి నిధులు దక్కకుండా చేయడం అమెరికా లక్ష్యం. ఎస్‌-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన కీలక నాటో మిత్రదేశం టర్కీపైనా అమెరికా కాట్సా ఆంక్షలు విధించింది. ఇప్పుడు భారత్‌పైనా ఆ చట్టాన్ని ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తోంది.

అఫ్గానిస్థాన్‌ విషయంలో భారత్‌ తమకు సాయం చేయలేదని అమెరికా భావిస్తోంది. అక్కడి ఇస్లామిక్‌ స్టేట్‌, దాని అనుబంధ ఉగ్రసంస్థలపై గగనతలం మీదుగా దాడి చేసేందుకు సహాయం చేయాలన్న అగ్రరాజ్యం అభ్యర్థనను భారత్‌ తిరస్కరించింది. జీపీఆర్‌లో భారత్‌ను విస్మరించడానికి దాన్నీ ఒక కారణంగా భావిస్తున్నారు. వాస్తవాధీన రేఖ మినహా సముద్ర జలాల్లో చైనా నుంచి భారత్‌కు తీవ్రస్థాయిలో సమస్య ఏమీ లేదు. అందుకే నావికాదళం పరంగా కార్యకలాపాలు సాగించే క్వాడ్‌పై భారత్‌ పెద్దగా ఆసక్తి చూపలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా క్వాడ్‌ లక్ష్యాలు నీరుగారిపోయాయని నిపుణులు భావిస్తున్నారు. హిందూ మహాసముద్రానికి ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఎంచుకొని మలక్కా సందిగ్ధతను చైనా పరిష్కరించుకోవడంతో క్వాడ్‌ ఉనికిపై సందేహాలు మరింత పెరిగాయి. ఫలితంగా చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా రచించే వ్యూహాల్లో భారత్‌ ప్రాధాన్యం తగ్గిందా అన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details