బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ కూటమి పరిధిలో గత ఏడాది కాలంగా భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో గణనీయ మార్పులు చోటు చేసుకొన్నాయి. వెలుపలి రాజకీయ భౌగోళిక వాతావరణం కారణంగా బ్రిక్స్ అంతర్గత పరిణామాలు ప్రాథమికంగా మార్పులకు లోనయ్యాయి. బ్రిక్స్ కూటమికి చెందిన విదేశాంగ మంత్రులు జూన్ ఒకటిన వర్చువల్ సమావేశం జరిపారు. అంతకుముందు, 2020 ఏప్రిల్‌లో ఇలాంటి సమావేశం నిర్వహించారు. ఈ రెండు బ్రిక్స్ సమావేశాల మధ్య... భారత్, చైనా- హిమాలయ సరిహద్దుల్లో ఘర్షణలకు దిగాయి. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా ఘర్షణలు చోటుచేసుకొన్నాయి. లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికులు మరణించారు. ఫలితంగా, ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడింది. డోక్లాం ప్రతిష్టంభన అనంతరం 2017లో జరిగిన బ్రిక్స్ సదస్సు భారత్, చైనా సంబంధాలను మెరుగుపరచగా, 2018నాటి వుహాన్ సదస్సుతో సాధారణ స్థితికి వచ్చాయి.
'క్వాడ్' ఆవిర్భావం..
అయితే, ఈసారి భారత్ నేతృత్వంలో సాగే 2021 బ్రిక్స్ సదస్సులో మాత్రం గతానికి భిన్నంగా ఇరుదేశాల సంబంధాల్లో సాధారణ స్థితిని సాధించే అవకాశం కనిపించడం లేదు. ఇందుకు గల్వాన్ ఘర్షణలే ప్రధాన కారణం. అంతేకాదు, 2020లో మాస్కోలో జరిగిన షాంఘాయ్ సహకార సంస్థ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఇరుదేశాల మధ్య కుదిరిన అయిదు సూత్రాల ఏకాభిప్రాయ ఒప్పందంపై డ్రాగన్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం మరో కారణం. ఇరుపక్షాల సైనికులు ఘర్షణలకు దూరం జరిగి, అన్నిఅంశాల్లో ఉద్రిక్తతల్ని చల్లబరిస్తే తప్ప భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాలు పరిఢవిల్లే అవకాశాలు కనిపించడం లేదు. ఇవి బ్రిక్స్ మనుగడను, దేశాల మధ్య సహకారాన్ని సైతం దెబ్బతీసే ప్రమాదమూ ఉంది. భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాలు కీలక మలుపునకు చేరిన ప్రస్తుత తరుణంలో... ఆస్ట్రేలియా, జపాన్‌లకు వ్యతిరేకంగా చైనా కదలికలు ప్రాంతీయ భౌగోళిక రాజకీయ సమతౌల్యాన్ని 'క్వాడ్' (అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాలతో కూడిన కూటమి)కి అనుకూలంగా మొగ్గేలా చేశాయి. అంతర్జాతీయంగా అమెరికాకు పునర్‌వైభవం సాధించడం, మిత్రపక్షాలు, భాగస్వాముల్లో విశ్వసనీయతను పెంపొందించే లక్ష్యంతో బైడెన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా తోడ్పడుతున్నాయి. మంత్రుల స్థాయి క్వాడ్ సమావేశాలను సదస్సు స్థాయికి పెంపొందించడంతో, ఇండోపసిఫిక్ ప్రాంతంలో క్వాడ్- చైనాకు స్థిరమైన వ్యూహాత్మక సమతౌల్యంగా ఆవిర్భవించింది. భారత్ సైతం, 2020లో వార్షిక మలబార్ నావికా విన్యాసాల్లో ఆస్ట్రేలియా పాల్గొనడాన్ని ఆమోదించడం ద్వారా క్వాడ్ సముద్ర సహకారాన్ని మరింత ఉచ్ఛస్థితికి చేర్చింది.
భారత విదేశీ వ్యవహారాల మంత్రి మే నెలలో చేపట్టిన అమెరికా పర్యటనలో విదేశాంగ, రక్షణ, వాణిజ్య, నిఘా, జాతీయ భద్రత, వ్యాపార రంగాలకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులతో చర్చలు జరిపారు. టీకాల సరఫరా మొదలు ప్రాంతీయ భద్రత, ఇండోపసిఫిక్ సహకారం, క్వాడ్ వంటి అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు సాగాయి. ఆ తరవాత వెంటనే బ్రిక్స్ విదేశాంగ మంత్రులతోనూ సమావేశాలు జరిపి, ప్రతిపాదిత బ్రిక్స్, క్వాడ్‌ల మధ్య సమతౌల్యతకు భారత్ కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు ప్రతిగా క్వాడ్ మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని అమెరికా సూచించింది. దీనిద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలోని తన మిత్రపక్షాలు, భాగస్వాములకు నాణ్యమైన ప్రజాస్వామిక ఐచ్ఛికాన్ని అందించింది. ఈ తరహా పరిణామాలన్నీ బ్రిక్స్- క్వాడ్ వ్యూహాత్మక పోటీని మరింతగా పెంచనున్నాయి. దీంతో ఇండోపసిఫిక్ ప్రాంతంలో క్వాడ్‌కు కీలకంగా మారిన భారత్‌కు వ్యతిరేకంగా చైనా కదిలే అవకాశం ఉంది. దీనివల్ల ఇండియా, క్వాడ్ దిశగా స్వేచ్ఛగా, బహిరంగంగా, ఇండోపసిఫిక్ దార్శనికతతో ముందుకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయి.