జీవితం క్షణభంగురమన్న భారతీయ తత్వ చింతన అక్షర సత్యమని దేశీయ రహదారులు నిర్దాక్షిణ్యంగా రుజువు చేస్తున్నాయి. భాగ్యనగరిలో జన, వాహన సంచారం నామమాత్రమైన నిశిరాత్రి వేళ ఎర్రలైటును పట్టించుకోకుండా దూకుడుగా దూసుకుపోయిన అయిదుగురు యువకుల విషాదాంతం గుండెల్ని మెలిపెడుతోంది. పట్టుమని అయిదు క్షణాలు ఆగితే అయిదు ప్రాణాలు నిలిచేవన్న కథనాలు- నిర్లక్ష్యపూరిత వేగం ఎంతగా ప్రాణాంతకమవుతున్నదో చాటి చెబుతున్నాయి. కొవిడ్ నియంత్రణలు సాగినన్నాళ్లూ బాగా దిగివచ్చిన రహదారి ప్రమాదాలు, సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో అసాధారణంగా పెరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సగటున రోజుకు 60దాకా రోడ్డు ప్రమాదాలు, ప్రతి గంటంపావుకో మరణం సంభవిస్తుండగా- ఏపీలో రోజుకు 57 ప్రమాదాలు, దాదాపు 22 మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం నిర్లక్ష్యాలే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్పష్టీకరిస్తున్న జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక- నిరుడు తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో పదిశాతం వంతున ప్రమాదాలు తగ్గాయని వెల్లడించింది. 2019లో తెలంగాణ వ్యాప్తంగా 6,964 మంది, ఏపీలో 7,984 మందిని బలిగొన్న రహదారి ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా లక్షా 51 వేల మందికిపైగా అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా వాహనరాశిలో ఒక్కశాతం కూడా లేని ఇండియా రహదార్లపై నెత్తురు చిందించడంలో ప్రథమ స్థానంలో నిలవడం సిగ్గుచేటు! ఎకాయెకి 22 లక్షల పైచిలుకు యాక్సిడెంట్లతో తొలిస్థానంలో నిలిచిన అమెరికాలో మృతుల సంఖ్య 37,461కి పరిమితం కావడం నుంచి, రహదారి భద్రతపై దీక్ష పూని ప్రమాదాల సంఖ్యను రెండు లక్షల 13 వేలకు, మృతుల్ని 63 వేలకు పరిమితం చేయగలిగిన జన చైనా నుంచి ఇండియా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పట్టుమని అయిదు శాతమైనా లేని జాతీయ, రాష్ట్ర రహదారులపైనే 61 శాతం మరణాలు నమోదవుతున్నాయి. 18-45 ఏళ్ల వయస్కులే రహదారి ప్రమాద మృతుల్లో 70 శాతంగా ఉండటం.. అవి సృష్టిస్తున్న సామాజిక ఆర్థిక మహా సంక్షోభానికి నిలువుటద్దం!