సైనిక బలంలో భారత్‌కన్నా చైనా మిన్న కాబట్టి పూర్తిస్థాయి యుద్ధంలో ఇండియా నిలబడలేదని బీజింగ్ బెదిరిస్తూ ఉంటుంది. కానీ, కొవిడ్ సంక్షోభానికి చైనాయే కారణమనే ఆరోపణతో ప్రపంచంలో ఏకాకి అయిన బీజింగ్, సంపూర్ణ సమరానికి దిగుతుందా అంటే సందేహమే. చైనా అజేయ శక్తిగా ఎదిగితే అమెరికా అగ్రరాజ్య హోదాకు కలిగే ముప్పు ఏమిటో వాషింగ్టన్‌కే కాకుండా పాశ్చాత్య దేశాలన్నింటికీ తెలుసు. అందుకే, గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో భారత్ అడిగినదే తడవుగా ఫ్రాన్స్, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లు యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్షిపణులను హుటాహుటిన పంపాయి. 2016లో భారత్‌ను ప్రధాన వ్యూహపరమైన భాగస్వామిగా గుర్తించిన అమెరికా, ప్రపంచంలో అతిపెద్ద యుద్ధనౌక యూఎస్‌ఎస్ నిమిట్జ్‌ను హిందూ మహాసముద్రానికి పంపింది. నిమిట్జ్ అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో భారత నౌకాదళంతో జత కలిసి సంయుక్త విన్యాసాలు జరిపింది. మరోవైపు ఫ్రాన్స్ అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాల బట్వాడాను వేగవంతం చేసింది.
వైమానిక దళం శక్తిమంతం
అయిదు రఫేల్ విమానాలు జులై 29న భారత్‌లోని అంబాలా స్థావరానికి చేరుకుంటాయి. ఫ్రాన్స్ తన వైమానిక దళం కోసం సిద్ధం చేసుకున్న మీటియోర్, శ్కాల్ప్ క్షిపణులను భారతీయ రఫేల్‌లకు అమర్చి పంపుతున్నందువల్ల అవి తక్షణం చైనాతో సమరానికి సై అనగలవు. మీటియోర్ క్షిపణి గగనంలో 120 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాన్ని కూలచగలిగితే, శ్కాల్ప్ 600 కిలోమీటర్ల దూరంలోని భూతల శత్రుస్థావరాన్ని ధ్వంసం చేయగలదు. రఫేల్ సరిహద్దు దాటకుండానే శత్రువు పనిపట్టగలదన్న మాట. భారత వైమానికదళ అమ్ములపొదిలోని అత్యాధునిక యుద్ధ విమానాలు- సుఖోయ్ 30, మిరేజ్ 2000. మిగ్ 29 ఫైటర్లను ఇప్పటికే సరిహద్దుల్లో మోహరించింది. మొత్తం మీద భారత్, చైనాల మధ్య యుద్ధం మన ఈశాన్య సరిహద్దులకే పరిమితమవుతుందని రక్షణ నిపుణుల అంచనా. గల్వాన్ లోయకు చుట్టుపక్కల 500 కిలోమీటర్ల దూరంలో చైనాకు రెండు వైమానిక స్థావరాలు, 1000 కిలోమీటర్ల పరిధిలో మరో రెండు ఉన్నాయి. 1,300 నుంచి 1,500 కిలోమీటర్ల దూరంలో మరి రెండు స్థావరాలు ఉన్నాయి. ఇవన్నీ ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడి నుంచి చైనా విమానాలు భారత సరిహద్దుకు వచ్చి బాంబులు కురిపించాలటే మార్గమధ్యంలో తిరిగి ఇంధనం నింపుకోవలసి ఉంటుంది. ఇంధన పరిమితి వలల అవి ఎక్కువసార్లు బాంబుదాడులు నిర్వహించలేవు. పైగా, ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ విమానం మోయగల బరువు తగ్గిపోతుంది. ఉదాహరణకు ఒక ఎయిర్‌బస్ విమానం తక్కువ ఎత్తు నుంచి పూర్తి లోడు నింపుకొని ఎత్తైన ప్రాంతంలో దిగగలదు కానీ, అక్కడి నుంచి తిరిగి పైకి ఎగిరేటప్పుడు కనీసం అందులో పావు వంతు లోడు కూడా మోయలేదు. అంటే, ఎత్తులో ఉన్న స్థావరాల నుంచి చైనా యుద్ధ విమానాలు ఎక్కువ బాంబులతో పోరుకు దిగలేవు. ఏతావతా 500 కిలోమీటర్ల పరిధిలోని చైనా స్థావరాలు మాత్రమే వైమానిక యుద్ధానికి వత్తాసు ఇవ్వగలుగుతాయి. అదే భారత్ విషయానికి వస్తే ఉత్తర, ఈశాన్య భారతాల్లోని వైమానిక స్థావరాలన్నీ సరిహద్దుకు సమీపంలో ఉండి చైనాపై దాడికి తోడ్పడతాయి. శ్రీనగర్, లదాఖ్ తప్ప మిగతా 21 స్థావరాలు ఎత్తు తక్కువ ప్రాంతాల్లోనే ఉన్నాయి. లదాఖ్ వంటి ఎత్తైన ప్రాంతాల నుంచీ ఎగరడానికి వీలుగా రఫేల్ ఇంజిన్‌లో భారత్ కోరిన మార్పుచేర్పులను చేసి ఫ్రాన్స్ పంపుతోంది. తక్కువ ఎత్తులోని స్థావరాల నుంచి మన విమానాలు పూర్తి బాంబు లోడుతో పైకెగిరి చైనా స్థావరాలపై దాడి చేసి తిరిగి రాగలవు. మళ్ళీ ఇంధనం, బాంబులు నింపుకొని దాడికి బయలుదేరగలవు. చైనా విమానాలకు ఆ వెసులుబాటు లేదు. ఫలితంగా భారత విమానాలకు చైనా ఫైటర్లకన్నా రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువసార్లు దాడులు జరిపే సత్తా ఉంది. చైనాను సమర్థంగా ఎదుర్కోవడంపై ఈ నెల 22-24 తేదీల్లో భారత వాయుసేన ప్రధానాధికారి ఆర్.కె.ఎస్. భధౌరియా తన ఏడుగురు కమాండర్లతో చర్చిస్తారు.
భూతల పోరాటంలో బలాబలాలు